
ఢిల్లీలో వంట గ్యాస్ కొరతపై కాంగ్రెస్ నాయకుల ఆందోళన
మట్టి పొయ్యిపై వంట చేసి నిరసన వ్యక్తం చేసిన కార్యకర్తలు..
ఎల్పీజీ సిలిండర్ల కొరత, పెరుగుతోన్న ధరలకు వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం రోడ్డు పక్కన మట్టిపొయ్యిపై చపాతీలు తయారు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) కార్యాలయం వెలుపల వందలాది పార్టీ కార్యకర్తలు గుమిగూడి, ఇటీవలి పెరిగిన ఎల్పీజీ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు.
కొరతకు మోదీ ప్రభుత్వమే కారణం..
ఇప్పటికే ద్రవ్యోల్బణంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో, కేంద్రం పదే పదే ధరలు పెంచి పేదలపై పెనుభారం మోపుతోందని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ అన్నారు. బ్లాక్ మార్కెట్లో ఎల్పీజీ సిలిండర్ల కొరత, ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, మోదీ ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు. పెరుగుతున్న గ్యాస్ ధరల కారణంగా సాంప్రదాయ వంట పద్ధతులపై వెళ్లాల్సి వస్తుందన్నారు.
డీపీసీసీ కార్యాలయం నుంచి కొద్ది దూరం ర్యాలీగా వెళ్లిన నిరసనకారులు తర్వాత పోలీసులు అడ్డుకున్నారని పార్టీ సభ్యుడు ఒకరు తెలిపారు. దేవేందర్ యాదవ్, పుష్ప సింగ్, తస్వీర్ సోలంకితో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకుని, తరువాత విడుదల చేశారు. ధరల పెరుగుదల LPGపై ఆధారపడిన జీవనోపాధిని ప్రభావితం చేసిందని నిరసనకారులు పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో ఎల్పీజీ సిలిండర్ల ధర దాదాపు రూ.400 ఉండగా, ఇటీవల రూ.60 పెంపు తర్వాత ధర రూ.913కి పెరిగిందని, బ్లాక్ మార్కెట్లో సిలిండర్లు రూ.2,000 వరకు అమ్ముడవుతున్నాయని నిరసనకారులు ఆరోపించారు.

