కాంగ్రెస్ మ్యానిఫెస్టో: ఐదు న్యాయాలకు హమీ ఇస్తున్నాం
x

కాంగ్రెస్ మ్యానిఫెస్టో: ఐదు న్యాయాలకు హమీ ఇస్తున్నాం

దేశంలో ప్రస్తుతం ఉన్నది ధనవంతుల ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. తమకు అధికారం ఇస్తే దేశంలో ఉన్న పేదరికాన్ని తొలగిస్తామని హమీ ఇచ్చింది


కాంగ్రెస్ 2024 లోక్‌సభ ఎన్నికల కోసం 'పాంచ్ న్యాయ్' (న్యాయానికి ఐదు స్తంభాలు) పేరిట తన మ్యానిఫెస్టోను ప్రకటించింది. ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ చీఫ్‌లు సోనియా, రాహుల్ గాంధీ మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టో కమిటీకి నేతృత్వం వహించిన కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కూడా హాజరయ్యారు.

మేనిఫెస్టోను విడుదల చేసిన ఖర్గే, “సామాన్య ప్రజలతో విస్తృత సంప్రదింపుల తర్వాత ఈ మేనిఫెస్టోను రూపొందించాం. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కూడా ఐదు న్యాయ స్తంభాలపైనే ఆధారపడింది. అందుకే మా మేనిఫెస్టోకు కూడా ఇదే ఆధారం. వాటిని సమాన న్యాయం( హిస్సాదార్ న్యాయ్), నారీ న్యాయ్, యువ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్ గా విభజించాం. ప్రతి కేటగిరీ కింద మేము మరో 5 హామీలను కూడా పేర్కొన్నాం. ఈ విధంగా, మేనిఫెస్టోలో ఐదు స్తంభాల క్రింద 25 హామీలు ఉన్నాయి” అని పార్టీ అధినేత అన్నారు.
“రాజ్యాంగ సంస్థలను బలోపేతం చేయడం, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, ఆర్థిక న్యాయం, ఫెడరలిజం తో రాష్ట్రాల సమస్యలకు న్యాయం, భారతదేశ రక్షణ సమస్యలను పరిష్కరించడానికి రక్ష న్యాయ్, పర్యావరణ పరిరక్షణ కోసం పర్యవరణ న్యాయ్ వంటి అంశాలను కూడా ఇందులో చేర్చాము” ఖర్గే అన్నారు.

'మోదీ నిరంకుశ పాలనను తొలగించండి'
కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లాడుతూ, “భారతదేశానికి MNREGA, ఆహార హక్కు, సమాచార హక్కు, కార్మిక సంస్కరణలు, హక్కులు అందించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ పది సంవత్సరాల పాలనను ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడూ విమర్శిస్తారు.. కానీ గత 10 సంవత్సరాలలో మోదీ ఏం చేశారు? యుపిఎ ప్రభుత్వం సాధించిన విజయాలలో ఒక్కటి కూడా సాధించలేదని విమర్శించారు.
నిరంకుశ మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అయితే, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు మోదీ పాలన “అసలు ముఖాన్ని” బయటకు తీసి, ప్రజలకు చేరువ కావాలని, పార్టీ హమీలను వివరించాలని ఆయన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
ఈ సందర్భంగా చిదంబరం మాట్లాడుతూ.. మేనిఫెస్టోలోని అతిపెద్ద అంశం న్యాయం. గత 10 సంవత్సరాలలో ప్రతి అంశంలో న్యాయం తగ్గిపోయింది. కొన్ని సందర్భాల్లో ఎవరికీ అందుబాటులో లేదు. ఈ మేనిఫెస్టో గత 5-10 ఏళ్లలో జరిగిన నష్టాన్ని తిప్పికొట్టేందుకు సాహసోపేతమైన చర్యలను సూచిస్తుంది. పని, సంపద, సంక్షేమం మా మేనిఫెస్టోలో మూడు ప్రధాన స్తంభాలు. ముసాయిదా మేనిఫెస్టోపై సీడబ్ల్యూసీ కూలంకషంగా చర్చించిందని, ఆ తర్వాత కొన్ని మార్పులు చేశామన్నారు.
మాజీ కేంద్ర మంత్రి మాట్లాడుతూ, “బిజెపి ధనవంతుల ప్రభుత్వం, ధనవంతుల కోసం నడుస్తోందని నేను ఎప్పుడూ ఆరోపించాను. ఇది దేశంలో ఉన్న 1 శాతం అగ్రశ్రేణి సంపన్నుల కోసం మాత్రమే నడుస్తుంది. మేము 2024లో అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్లలో కనీసం 23 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తి చేస్తామని చెప్పగలను. మేము గతంలో చేసాము.. ఇప్పుడు చేస్తాము” అని చిదంబరం అన్నారు.
Read More
Next Story