‘మున్సిపల్ విజయం మా చేతలకు ప్రజలిచ్చిన గౌరవం’
x

‘మున్సిపల్ విజయం మా చేతలకు ప్రజలిచ్చిన గౌరవం’

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత పట్టణ ప్రజలకు నేతల కృతజ్ఞతలు. అభివృద్ధి, సంక్షేమంపై మరింత దృష్టి పెడతామని హామీ.


తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయం తమ చేతలకు ప్రజలిచ్చిన గౌరవమంటూ మంత్రులు అభివర్ణించారు. ఈ విజయం మాటలకంటే పనులకు, అవినీతికంటే అభివృద్ధికి, ఆడంబరాలకంటే పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పుగా కాంగ్రెస్ అభివర్ణించింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే పార్టీ నాయకత్వం పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపింది.

గత రెండేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు పట్టణ ప్రజలు మద్దతుగా నిలిచారని కాంగ్రెస్ పేర్కొంది. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను ప్రజలు ఓటుతో తిప్పికొట్టి, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించారని వెల్లడించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పాటు మిత్రపక్షాల అభ్యర్థుల గెలుపును తమ విజయంగా భావించి పనిచేసిన కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు పార్టీ అభినందనలు తెలిపింది. ఈ అఖండ విజయం వెనుక ప్రతి ఒక్కరి కృషి ఉందని పేర్కొంది.

మీడియాతో మాట్లాడిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రజలు తమపై ఉంచిన బాధ్యతలను మరింత నిబద్ధతతో నెరవేరుస్తామని తెలిపారు. మున్సిపాలిటీల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తామని, రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. ప్రతి వార్డు అభివృద్ధి చెందేలా ప్రజలతో కలిసి ముందుకు సాగుతామని, పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు స్పందిస్తూ, రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ అభివృద్ధి, సంక్షేమం, విశ్వసనీయతకే ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు. మున్సిపల్ ఫలితాలు అదే విషయాన్ని మరోసారి రుజువు చేశాయని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్న ప్రభుత్వాన్ని వారు హృదయపూర్వకంగా ఆదరించారని తెలిపారు. ఈ ఫలితాలతో ప్రజా ప్రభుత్వంపై బాధ్యత మరింత పెరిగిందని కాంగ్రెస్ నాయకత్వం పేర్కొంది. ప్రజల నమ్మకానికి తగ్గట్టుగా పాలన కొనసాగిస్తామని స్పష్టం చేస్తూ, పట్టణాభివృద్ధికి మరింత వేగం తీసుకువస్తామని తెలిపింది.

Read More
Next Story