బీజేపీ బ్యాంకు ఖాతాలూ ఫ్రీజ్ చేయాల్సిందే.. ఖర్గే
x

బీజేపీ బ్యాంకు ఖాతాలూ ఫ్రీజ్ చేయాల్సిందే.. ఖర్గే

ఎలక్టోరల్ బాండ్లపై విచారణ పూర్తయ్యే వరకు బీజేపీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు.


ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి ఐదేళ్లలో రూ.6,060 కోట్లు అందాయని ఖర్గే ఆరోపించారు. బాండ్లను కొనుగోలు చేసిన వ్యక్తులకు ED లేదా ఇన్‌కం టాక్స్ కేసులతో సంబంధం ఉందని ఆరోపించారు. బీజేపీ కోట్లాది రూపాయల ఎలక్టోరల్ బాండ్లు వసూలు చేయగా.. విరాళాలు పొందిన తమ బ్యాంకు ఖాతా స్తంభింపజేశారని చెప్పారు.

'నా ఖౌంగా, నా ఖానే దుంగా (తినను, ఇతరులను తిననివ్వను)' అని ప్రధాని అంటున్నారని, అయితే ఈరోజు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ ఎలా డబ్బు సంపాదించిందో సుప్రీంకోర్టు ద్వారా బట్టబయలైందన్నారు. బీజేపీకి 50 శాతం విరాళాలు, కాంగ్రెస్‌కు 11 శాతం విరాళాలు ఎలా వచ్చాయో SBI డేటాను బట్టి తెలుస్తుందన్నారు.

వాళ్లంతా కేసులతో సంబంధం ఉన్న వాళ్లే..

‘‘బీజేపీకి అన్ని విరాళాలు ఎలా వచ్చాయి? ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? పెట్టుబడిదారులు లేదా కంపెనీలు ఎలా విరాళాలు ఇవ్వగలవు? విరాళాలు ఇచ్చిన వ్యక్తులంతా ED కేసు, ఆదాయపు పన్ను కేసులతో ప్రమేయం ఉన్నవారే. ముఖ్యంగా (నరేంద్ర) మోదీ, అతని పార్టీ వ్యక్తులు విరాళాలు ఇవ్వాలని వారిని ఒత్తిడి చేస్తున్నారు.’’అని ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు.

వారి ఖాతా తెరిచే ఉంది..

కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారని ఖర్గే పేర్కొన్నారు. "ఐటి (ఆదాయపన్ను శాఖ) సీజ్ చేయమని ఆదేశించింది. దాదాపు రూ. 300 కోట్లు బ్యాంకుల్లో ఉండిపోయాయి. మేం ఎన్నికలకు ఎలా వెళ్లగలం? మీరు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కోట్ల రూపాయలు సేకరిస్తున్నారు. మా ఖాతా మూసేశారు. మరి వారి ఖాతా మాత్రం తెరిచి ఉంది. ఇదెక్కడి న్యాయం’’ అని మండిపడ్డారు.

కోర్టును ఆశ్రయిస్తారా?

బీజేపీ ఖాతాను బ్లాక్ చేయించేందుకు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తారా అని అడిగిన ప్రశ్నకు ఖర్గే.. "నేను విచారణకు డిమాండ్ చేయడం లేదు. ఏం చేయాలన్న దానిపై మా పార్టీ సమావేశం కానుంది. అక్కడ చర్చిస్తాం. నేను మోడీని కాదు. నేను సంప్రదించాలి." అన్నారు. విచారణ పెండింగ్‌లో ఉన్నందున ఎన్నికలను వాయిదా వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందా అనే ప్రశ్నకు కాంగ్రెస్ అధ్యక్షుడు అది చేయలేమని అన్నారు.

Read More
Next Story