తమ్మిడిహట్టి రిపోర్ట్‌కు డెడ్‌లైన్ ఫిక్స్
x

తమ్మిడిహట్టి రిపోర్ట్‌కు డెడ్‌లైన్ ఫిక్స్

తమ ప్రభుత్వం చేసే అభివృద్ధి విమానాశ్రయంతో ఆగిపోదన్న సీఎం రేవంత్.


తమ్మిడిహట్టి ప్రాజెక్ట్‌పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆదిలాబాద్‌ను నెవ్వర్ బిఫోర్ అనేలా అభివృద్ది చేస్తామని, ఆ దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఎర్ర బస్సు కూడా రాని ఆదిలాబాద్‌కు ఎయిర్ బస్‌ను తీసుకొచ్చామని, తమ ప్రభుత్వం చేసే అభివృద్ధి విమానాశ్రయంతో ఆగిపోదని అన్నారు. నిర్మల్‌లో జరిగిన “ప్రజా పాలన – ప్రగతి బాట” బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు. జిల్లాకు సాగునీటి భద్రత కల్పించాలంటే తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం తప్పనిసరి అని స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాలకు ముందే తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై సంపూర్ణ నివేదిక ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ చుక్క నీటిని వినియోగించి ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై తనకు ప్రత్యేక అభిమానం ఉందని సీఎం పేర్కొన్నారు. జల్ జంగల్ జమీన్ నినాదంతో ఉద్యమాలు సాగిన ఈ ప్రాంతానికి తగిన స్థాయిలో అభివృద్ధి జరగలేదన్నారు. పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాద్ జిల్లాకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే జిల్లా అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతుందన్నారు.

ఆదిలాబాద్‌కు యూనివర్సిటీ మంజూరైనా ప్రాంతాల మధ్య విభేదాల వల్ల జాప్యం జరిగిందని సీఎం తెలిపారు. బాసర ఐఐటీ ప్రాంతంలో యూనివర్సిటీ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావుకు సూచించారు. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రజా ప్రతినిధులు అధికారులతో సమీక్షలు నిర్వహించాలని పెద్దలు సుదర్శన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. జిల్లాకు కావాల్సిన అభివృద్ధి పనులు నిధులపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు.

ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. పారిశ్రామిక అభివృద్ధికి పదివేల ఎకరాలతో భారీ పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఎన్నికల తర్వాత అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామని రాజకీయాలకు తావులేదన్నారు. ప్రజలకు మంచి జరగాలన్నదే ప్రభుత్వ ఆలోచనగా వివరించారు.

పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని సీఎం స్పష్టం చేశారు. ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు పేదలకు సన్న బియ్యం సన్న ధాన్యానికి బోనస్ అందిస్తున్నట్టు తెలిపారు. ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని చెప్పారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు సేవ చేసే అభివృద్ధి చేసే నాయకులకే మద్దతివ్వాలని సీఎం పిలుపునిచ్చారు. గతంలో గెలిచినట్టే రాబోయే ఎన్నికల్లోనూ ప్రజల ఆశీస్సులతో మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. చనాక కొరటా ప్రాజెక్టుకు సీ రామచంద్రారెడ్డి సదర్మట్ బ్యారేజీకి నర్సారెడ్డి పేర్లు పెట్టాలని నిర్ణయించామని తెలిపారు. ప్రజలకు సేవ చేసిన వారి పేర్లు ప్రాజెక్టులకు పెట్టడం గౌరవంగా భావిస్తున్నామని అధికారులకు సూచించారు.

Read More
Next Story