
ఒప్పందాలు లేకుండానే ముగిసిన కాప్ -31 సదస్సు
తీవ్ర నిరాశ వ్యక్తం చేసిన భారత్
వాతావరణ మార్పులను అరికట్టేందుకు ప్రపంచ దేశాలు ఒక్కతాటిపైకి రావాల్సిన కీలక సమయంలో.. అంతర్జాతీయ వాతావరణ సదస్సు-31(కాప్ సదస్సు) ఎలాంటి తుది ఒప్పందం లేకుండానే ముగిసింది. శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడం, అభివృద్ధి చెందుతున్న దేశాలకు వాతావరణ ఆర్థిక సాయం అందించడం వంటి కీలక అంశాలపై దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.
రెండు రోజుల పాటు అదనంగా చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో COP31 సదస్సు ముగిసింది. అభివృద్ధి చెందిన దేశాలు వాతావరణ ఆర్థిక సాయంపై చర్చించేందుకు కూడా ఆసక్తి చూపలేదని భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
టర్కియేలోని అంటాల్యాలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో COP31 వాతావరణ సదస్సు జరిగింది. వాస్తవానికి నిర్ణీత షెడ్యూల్ ప్రకారం సదస్సు ముగియాల్సి ఉన్నప్పటికీ.. కీలక అంశాలపై విభేదాలు పరిష్కారం కాకపోవడంతో చర్చలను మరో రెండు రోజుల పాటు కొనసాగించారు. అయినప్పటికీ తుది ఒప్పందంపై దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధ్యం కాలేదు.
శిలాజ ఇంధనాల నుంచి ఇతర ఇంధన వనరుల వైపు మారడానికి బలమైన నిబద్ధత ప్రకటించాలన్న ప్రతిపాదన ఒకవైపు.. అభివృద్ధి చెందుతున్న దేశాలకు కొత్తగా, నిర్దిష్ట మొత్తంలో వాతావరణ ఆర్థిక సాయం అందించాలన్న డిమాండ్ మరోవైపు చర్చల్లో ప్రధాన అడ్డంకులుగా మారాయి. ఈ రెండు అంశాలపై దేశాలు ఒకే నిర్ణయానికి రాలేకపోయాయి.
ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల విభాగం అధిపతి సైమన్ స్టీల్.. సదస్సు ఎలాంటి తుది ఒప్పందం లేకుండా ముగియడంపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. దాదాపు 200 దేశాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి నిర్ణయాలు తీసుకోవడానికి ఐక్యరాజ్యసమితి చర్చల ప్రక్రియ ఉపయోగపడుతోందని ఆయన గుర్తుచేశారు. అయితే, ఈ ప్రక్రియను మరింత మెరుగుపరచడం, ఆధునికీకరించడం, అవసరమైన సంస్కరణలు చేపట్టడం కూడా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రతిష్టంభన మరోసారి ఎదురుకాకుండా చూడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో ఇలాంటి చర్చలు విఫలమవడం 2000 సంవత్సరం తర్వాత ఇదే తొలిసారి. నెదర్లాండ్స్‌లోని ది హేగ్‌లో జరిగిన వాతావరణ చర్చలు అప్పట్లో కూడా ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి.
మరోవైపు, COP31లో తుది ఒప్పందం కుదరకపోవడం ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ సంక్షోభం నేపథ్యంలో మరింత ఆందోళన కలిగిస్తోంది. పారిశ్రామికీకరణకు ముందు ఉన్న ఉష్ణోగ్రతలతో పోలిస్తే ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదల ఇప్పటికే 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితిని దాటే దిశగా సాగుతోంది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్రస్తుత విధానాలే కొనసాగితే ఈ శతాబ్దం చివరి నాటికి భూమి ఉష్ణోగ్రతలు 2.8 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే ప్రమాదం ఉంది. ఆ తర్వాత కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది.
ఈ పరిణామాలపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ స్పందించారు. సదస్సులో భారత్ చివరి వరకు నిర్మాణాత్మకంగా, చిత్తశుద్ధితో చర్చల్లో పాల్గొందని తెలిపారు. అయినప్పటికీ తుది ముసాయిదా ఒప్పందంపై ఏకాభిప్రాయం కుదరకపోవడం విచారకరమని పేర్కొన్నారు. అయితే, తుది ఒప్పందం లేకపోవడం వల్ల వాతావరణ మార్పులపై భారత్ చేపడుతున్న చర్యలు ఆగవని స్పష్టం చేశారు.
దేశంలో ఇప్పటికే 170 గిగావాట్లకు పైగా సౌర విద్యుత్ సామర్థ్యాన్ని సాధించినట్లు వివరించారు. తదుపరి COP32 సదస్సు దిశగా కూడా అన్ని దేశాలతో కలిసి పనిచేయడానికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు.‘‘తుది ఒప్పందం కుదరకపోవడం వాతావరణ చర్యలను నిలిపివేయదు. 170 గిగావాట్ల కు పైగా సౌర విద్యుత్ సామర్థ్యంతో భారత్ దేశీయంగా తన సేవలు కొనసాగిస్తోంది. కాప్ 31 దిశగా ఏకాభిప్రాయ ఆధారిత బహుపాక్షిక వాదానికి కట్టుబడి ఉంది’’ అని ఎక్స్ లో ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే.. అభివృద్ధి చెందిన దేశాలు వాతావరణ మార్పులపై తమ బాధ్యతను తప్పించుకుంటున్నాయని పర్యావరణ నిపుణులు విమర్శిస్తున్నారు. ఢిల్లీకి చెందిన క్లైమేట్ ట్రెండ్స్ సంస్థ డైరెక్టర్ ఆర్తి ఖోస్లా.. COP31లో రాజకీయ సంకల్పం, బాధ్యతాయుతమైన వైఖరి రెండూ లోపించాయని అభిప్రాయపడ్డారు.
శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించేందుకు అర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో దేశాలు విఫలమయ్యాయని ఆమె పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు ఇంధన మార్పునకు అవసరమైన ఆర్థిక సాయం విషయంలో తమపై కొలవగలిగే బాధ్యతలు లేకుండా చూసుకున్నాయని విమర్శించారు.
అదే సమయంలో ప్రధాన శిలాజ ఇంధన ఉత్పత్తి దేశాలు ఉద్గారాల తగ్గింపునకు సంబంధించి మరింత బలమైన నిర్ణయాలను అడ్డుకున్నాయని తెలిపారు. ‘‘కవర్ నిర్ణయంపై ఏకాభిప్రాయానికి రాలేకపోవడం రాజకీయ ఆశయం. జవాబుదారీతనం పూర్తిగా లోపించడాన్ని ప్రతిబింబిస్తుంది. చర్చలు ఆదివారం వరకు కొనసాగినప్పటికీ శిలాజ ఇంధనాల నుంచి వైదొలగడానికి ఒక అర్థవంతమైన నిబద్ధతపై గానీ, వాతావరణ భద్రత గురించి మాట్లాడటం గానీ దేశాలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి’’ అని ఖోస్లా ఒక ప్రకటనలో తెలిపారు.
భారత్ కూడా ఇదే అంశాన్ని సదస్సులో ప్రస్తావించింది. లైక్ మైండెడ్ డెవలపింగ్ కంట్రీస్ (LMDC) తరఫున మాట్లాడిన భారత్.. వాతావరణ ఆర్థిక సాయం అంశంపై అభివృద్ధి చెందిన దేశాలు చర్చించేందుకు నిరాకరించాయని తెలిపింది.
వాతావరణ సంక్షోభానికి ప్రధాన కారణం కాని అభివృద్ధి చెందుతున్న దేశాలపై మాత్రం దాని ప్రభావం తీవ్రంగా పడుతోందని భారత్ పేర్కొంది. అలాంటి పరిస్థితుల్లో తమ అవసరాలను తీర్చేందుకు ఆర్థిక సాయం కోరితే.. అభివృద్ధి చెందిన దేశాలు కనీసం చర్చించడానికి కూడా సిద్ధంగా లేవని అభ్యంతరం వ్యక్తం చేసింది.
అంతేకాదు.. COP31 తుది ఒప్పందం ముసాయిదాలో సమానత్వం, ఉమ్మడి కానీ విభిన్న బాధ్యతలు, దేశాల సామర్థ్యాలకు అనుగుణంగా బాధ్యతలు అనే ప్రాథమిక సూత్రాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని భారత్ అభిప్రాయపడింది.
వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి చట్టపరమైన వ్యవస్థలోనే ఈ సూత్రం భాగంగా ఉంది. దీని ప్రకారం ప్రతి దేశానికి పర్యావరణ పరిరక్షణలో బాధ్యత ఉన్నప్పటికీ.. చరిత్రలో అత్యధిక గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలకు కారణమైన అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.
గతంలోనే ప్రపంచ కార్బన్ బడ్జెట్లో అధిక భాగాన్ని వినియోగించుకున్న దేశాలు తమ బాధ్యతను గుర్తించాలని భారత్ వాదించింది. కానీ, తుది ముసాయిదాలో ఈ చారిత్రక బాధ్యతల అంశానికి తగిన ప్రాధాన్యం దక్కలేదని LMDC పేర్కొంది.
ఇక వాతావరణ మార్పుల ప్రభావం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ముఖ్యంగా చారిత్రకంగా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలకు తక్కువగా కారణమైన గ్లోబల్ సౌత్ దేశాలు తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటున్నాయి. 1996 నుంచి 2025 వరకు 30 ఏళ్ల వాతావరణ విపత్తుల సమాచారాన్ని విశ్లేషించిన అధ్యయనంలో డొమినికా, మయన్మార్, హోండురాస్ దేశాలు అత్యధికంగా ప్రభావితమైనట్లు వెల్లడైంది. ఆ తర్వాత లిబియా, హైతీ, గ్రెనడా దేశాలు ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందుతున్న వాతావరణ ఆర్థిక సాయం మాత్రం వాటి అవసరాలకు సరిపోవడం లేదు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం విడుదల చేసిన 2026 అడాప్టేషన్ గ్యాప్ నివేదిక ఈ అంతరాన్ని స్పష్టంగా వెల్లడించింది.
అభివృద్ధి చెందిన దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలకు 2024లో అందిన అంతర్జాతీయ ప్రభుత్వ వాతావరణ అనుసరణ నిధులు 28.2 నుంచి 31.7 బిలియన్ డాలర్ల మధ్య ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది కేవలం ఒక బిలియన్ డాలరు మాత్రమే ఎక్కువ. అయితే, 2035 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఏటా 305 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అవసరమవుతుందని అంచనా వేసింది.
అంటే.. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు అవసరమైన నిధులకు, ప్రస్తుతం అందుతున్న ఆర్థిక సాయానికి మధ్య భారీ వ్యత్యాసం ఉంది.
మొత్తంగా చూస్తే.. శిలాజ ఇంధనాల నుంచి మార్పు, వాతావరణ ఆర్థిక సాయం, అభివృద్ధి చెందిన దేశాల బాధ్యత వంటి కీలక అంశాలపై ప్రపంచ దేశాల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సహకారం అవసరమని అన్ని దేశాలు అంగీకరిస్తున్నప్పటికీ.. ఆ బాధ్యతలను ఎలా పంచుకోవాలి, అవసరమైన నిధులను ఎవరు సమకూర్చాలి అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. తదుపరి చర్చల్లో ఈ విభేదాలకు పరిష్కారం లభిస్తుందా అన్నది చూడాలి.
Next Story
