
తెలంగాణ హైకోర్టు భవనం (ఫొటో కర్టసీ : హైకోర్టు వెబ్ సైట్)
ఒకవైపు కోర్టు ఆగ్రహం…మరోవైపు దూకుడు: హైడ్రా హాట్ టాపిక్
హైడ్రా పనితీరుపై హైకోర్టు సీరియస్… ఉత్తర్వులు లెక్కచేయట్లేదా?
హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల తొలగింపు, చెరువుల పరిరక్షణ పేరుతో దూకుడుగా ముందుకెళుతున్న హైడ్రా వ్యవహారం ఇప్పుడు న్యాయస్థానాల్లో చర్చనీయాంశమైంది. ఒకవైపు హైకోర్టు వరుసగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ప్రభుత్వ వర్గాలు, గవర్నర్ నుంచి ప్రశంసలు రావడం హైడ్రా పనితీరుపై విభిన్న అభిప్రాయాలకు దారితీస్తోంది.
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్ పై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మరోసారి తప్పు బట్టింది. ఒక వైపు హైడ్రా తీరుపై హైకోర్టు పలు సార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్షింతలు వేస్తున్నా, మరో వైపు చెరువుల పరిరక్షణ పేరిట కబ్జాల తొలగింపు, సుందరీకరణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి.
ఒక వైపు హైకోర్టు హైడ్రాకు తరచూ అక్షింతలు వేస్తుండగా మరో వైపు గవర్నరుతోపాటు కొంతమంది ప్రజల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో హైడ్రా ద్వారా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపి, రూ. 60 వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కాపాడటం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా తన బడ్జెట్ ప్రసంగంలో ప్రశంసించారు.
హైడ్రాపై హైకోర్టులో వరుస కేసులు
హైడ్రాపై హైకోర్టులో పలువురు బాధితులైన పిటిషనర్లు వరుస కేసులు దాఖలు చేస్తున్నారు. కొన్ని కేసుల్లో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా వాటిని హైడ్రా అమలు చేయడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒకవైపు కోర్టు కేసులున్నా హైడ్రా దూకుడుగా కబ్జాల తొలగింపు, భవనాల కూల్చివేత, చెరువుల సుందరీకరణ పనులు చేపడుతూనే ఉంది. హైదరాబాద్ నగరంలోని బతుకమ్మ కుంటలో సుందరీకరణ పనులు చేయడాన్ని సవాలు చేస్తూ సుధాకర్ రెడ్డి హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ బతుకమ్మ కుంట పునరుద్ధరణ పనులు చేపట్టడాన్ని హైకోర్టు జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ పి మధుసూధనరావులతో కూడిన ధర్మాసనం తప్పు పట్టింది. బతుకమ్మకుంటలో వరద నివారణ పనులు మాత్రమే చేపట్టాలని, భూమి స్వరూపం మార్చవద్దని హైకోర్టు గత ఏడాది జూన్ 12వతేదీన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దాన్ని ఉల్లంఘించి డ్రైనేజీ, పిల్లల ఆటస్థలం, వాకింగ్ ట్రాక్, గార్డెన్ ఏర్పాటు చేశారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ చర్యలన్నీ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లేనని, కుంట వద్ద బోర్డులను తొలగించాలని, ఈ స్థలంలో హైడ్రా ఆధీనంలో ఉందనే ఆనవాళ్లు కనిపించకూడదని హైకోర్టు ఆదేశించింది.
హైడ్రా కమిషనర్ చట్టానికి అతీతులు కాదు
మరో కేసులో ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో పరిధి దాటి హైడ్రా ప్రవర్తిస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది.రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం సాహెబ్ నగర్ కలాన్ సర్వే నంబరు 132,133లలోని 650 చదరపు గజాల ప్లాటుపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ప్లాటును హైడ్రా స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ నగరానికి చెందిన పూర్ణిమ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. హైడ్రా కమిషనర్ చట్టానికి అతీతులు కాదని కోర్టు వ్యాఖ్యానించింది.
హైడ్రా తీరు మార్చుకోవాలి : హైకోర్టు
హైడ్రా తీరును మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగం ప్రకారం కోర్టులు చెప్పినప్పుడు వినాలని కోరింది. తెలంగాణ మున్సిపల్ శాఖ చీఫ్ సెక్రటరీ మార్గదర్శకాల ప్రకారం హైడ్రా పనిచేయాల్సి ఉందని, సొంత నిర్ణయాలు చేయడం చెల్లదని కోర్టు పేర్కొంది. కోర్టుల్లో పెండింగులో ఉన్న భూముల్లో హైడ్రా ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరిట జోక్యం చేసుకోవడాన్ని హైకోర్టు తప్పు పట్టింది.
బాధితుల పిటిషన్లు...
హైడ్రా 23 ప్రాంతాల్లోని చెరువుల్లో వెలసిన 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. దీనిపై పలువురు బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. అసలు హైడ్రా ఏర్పాటు జీఓ 99 చట్టబద్ధతను సవాలు చేస్తూ నానక్ రాం గూడకు చెందిన డి లక్ష్మీ పిటిషన్ దాఖలు చేశారు. ఐలాపూర్ గ్రామంలో భవనాలను కూల్చివేతపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులున్నా హైడ్రా పట్టించుకోలేదని లక్ష్మీ ఆరోపించారు. అమీన్ పూర్ గ్రామంలో కూల్చివేతలపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి భార్య ఉమామహేశ్వరమ్మ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున పిటిషన్ వేశారు. మరో వైపు జన్వాడ ఫాం హౌస్ కూల్చివేయవద్దంటూ యజమాని ప్రదీప్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. చట్టబద్ధంగా సాగకపోతే హైడ్రాను మూసివేస్తామని హైకోర్టు గతంలో తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించింది.
హైడ్రా ప్రజావాణికి 42 ఫిర్యాదులు
బీహెచ్ ఈఎల్, రామచంద్రాపురం పరిసరాల్లోని నేషనల్ హైవే 65లో ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోతోందని.. ఈ సమస్యను పరిష్కరించాలని మియాపూర్ ట్రాఫిక్ డివిజన్ పోలీసులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.అమీన్‌పూర్ మండలం బీరంగూడ విలేజ్‌లోని సర్వే నంబరు 996, 997లో ఉన్న ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కోపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీకి చెందిన లే ఔట్‌ను ఆక్రమించుకుని కొంతమంది 100 గజాల చొప్పున అమ్మేస్తున్నారని సొసైటీ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాప్రా మున్సిపాలిటీ పరిధిలోని అమ్ముగూడలోని జేజేనగర్‌ను పైనుంచి వచ్చే వరద ముంచెత్తుతోంది.. వరద కాలువలను విస్తరించాలని హైడ్రా ప్రజావాణిలో అక్కడి నివాసితులు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సర్దార్‌నగర్‌లోని రావిర్యాల పెద్ద చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్‌ను వెంటనే నిర్ధారించాలని అక్కడి ప్లాట్ల యజమానులు హైడ్రా ప్రజావాణిలో కోరారు. ఇలా సోమవారం హైడ్రా ప్రజావాణికి మొత్తం 42 ఫిర్యాదులందాయి.
రెండో దశగా 18 చెరువుల అభివృద్ధి
మొదటి దశ 6 చెరువులను సుందరీకరించగా, రెండోదశలో మరో 18 చెరువులను రెండో దశగా చేపట్టామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణతో వరదలకు చెక్ పెట్టడమే కాకుండా.. నగరంలో భూగర్భ జలాలు పెరగడానికి అవకాశం ఉంటుందన్నారు. ఎన్ ఆర్ ఎస్ సీ (నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్) డేటా ప్రకారం 1975 నుంచి 2023 లోపు నగరంలో 61 శాతం చెరువులు మాయమయ్యాయని.. మరో 15 ఏళ్లలో ఉన్నవి కూడా కనుమరుగయ్యే పరిస్థతి ఉందని హెచ్చరించిన విషయాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. 1300ల చెరువుల్లో 700ల చెరువులు మాయం అవ్వగా.. ఉన్న చెరువులు 60 శాతం కబ్జాకు గరయ్యాయని రంగనాథ్ పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణ అవసరం ఎంతైనా ఉన్నా, చట్టబద్ధతను పాటించడం అంతే ముఖ్యమని హైకోర్టు స్పష్టం చేస్తోంది. ఇకపై హైడ్రా చర్యలు న్యాయపరమైన గీత దాటుతాయా లేదా సమతౌల్యం సాధిస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story

