ప్రభుత్వ బిల్లుల పేరుతో ఘరానా మోసాలు.. సజ్జనార్ అలెర్ట్..!
x

ప్రభుత్వ బిల్లుల పేరుతో ఘరానా మోసాలు.. సజ్జనార్ అలెర్ట్..!

సైబర్ నేరాలపై సజ్జనార్ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అప్రమత్తత సూచనలు ఇచ్చారు.


కాదేదీ కవితకు అనర్హం అని అలనాడు మహాకవి శ్రీశ్రీ అన్నట్లు ఇప్పుడు సైబర్ నేరగాళ్లు ప్రవర్తిస్తున్నారు. సైబర్ ఫ్రాడ్ చేయడానికి ఏ ఒక్క అంశాన్ని కూడా వాళ్లు వదలడం లేదు. ఆఖరికి ప్రభుత్వ సంస్థలు అందించే బిల్లుల పేరుతో కూడా మోసాలు చేస్తున్నారు. తాజాగా వాటర్ బోర్డ్ బిల్లుల పేరుతో జరుగుతున్న మోసాల గురించి హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రజలను అలెర్ట్ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం ఏమరపాటుకు గురయినా మోసపోతారని హెచ్చరిస్తున్నారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.

హైదరాబాద్ నగరంలో కేటుగాళ్లు వాటర్ బోర్డు అధికారుల పేరుతో ఫోన్ చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు ఆయన వెల్లడించారు. నీటి బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేస్తామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. తర్వాత “HMWSSB WATER BILL UPDATE.apk” పేరుతో ప్రమాదకరమైన లింక్‌ను పంపుతున్నారని తెలిపారు. ఆ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేస్తే మొబైల్ నియంత్రణ పూర్తిగా నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుందని హెచ్చరించారు.

దీంతో కాల్స్ డైవర్ట్ అవుతాయని, ఫోన్ స్క్రీన్‌పై జరిగే కార్యకలాపాలను గమనిస్తారని వివరించారు. బ్యాంక్ లావాదేవీలకు వచ్చే ఓటీపీలను సేకరించి ఖాతాల్లోని డబ్బులను దోచుకుంటున్నట్లు తెలిపారు. ఇలాంటి కాల్స్, లింక్‌లకు స్పందించవద్దని సజ్జనార్ సూచించారు. గుర్తుతెలియని ఏపీకే ఫైళ్లను ఇన్‌స్టాల్ చేయకూడదని స్పష్టం చేశారు. నీటి బిల్లులు కేవలం అధికారిక వెబ్‌సైట్ లేదా అధికారిక యాప్‌ల ద్వారానే చెల్లించాలని తెలిపారు.

ఏదైనా అనుమానాస్పద కాల్ వస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఒకవేళ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని వివరించారు.

అయితే సైబర్ మోసాలు కేవలం వాటర్ బోర్డు బిల్లులకే కాకుండా కరెంట్ బిల్లు, ట్రాఫిక్ చలాన్ వంటి వాటి ద్వారా కూడా జరుగుతున్నాయని పలువురు నెటిజన్లు సజ్జనార్ పోస్ట్‌కు రిప్లైలలో పేర్కొన్నారు. కొందరు ఫోన్లు చేస్తే మరికొందరు వాట్సాప్‌కు మెసేజ్‌లు పెడుతున్నారని, మరికొందరు వాట్సాప్ మెసేజ్‌లలో బిల్లులను చెల్లించడానికి ప్రత్యేక యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ ఏపీకే ఫైల్స్‌ను పంపుతున్నట్లు సమాచారం.

Read More
Next Story