ప్రభుత్వ ఆరోగ్య పథకంలో చేరికపై స్పష్టత కోరిన సీపీఎస్ ఉద్యోగుల యూనియన్
x

ప్రభుత్వ ఆరోగ్య పథకంలో చేరికపై స్పష్టత కోరిన సీపీఎస్ ఉద్యోగుల యూనియన్

సిపీఎస్ ఉద్యోగులు తమ నుండి 1.5 శాతం చందా ఎలా స్వీకరిస్తారో వెంటనే విధి విధానాలను జారీ చేయాలని కోరారు


రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగులు ప్రభుత్వం మొదలుపెడుతున్న సరికొత్త ఆరోగ్య పథకంలో తాము లబ్ది పొందటం పై స్పష్టత కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావును కలిశారు. సిపీఎస్ ఉద్యోగికి రిటైర్ ఐయ్యాక పెన్షనర్ ఐ.డి ఉండదు వారు ఆరోగ్య పథకంలో భాగం కావటానికి 1.5 శాతం చందా చెల్లించలేరు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెడుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఫిబ్రవరి 12వ తారీఖున వారి సంఘాలతో జరిపిన చర్చలలో ప్రాధమికంగా ప్రవేశపెట్టింది. అయితే ఈ చర్చలలో సీపీఎస్ పథకం క్రింద ఉన్న ఉద్యోగుల ప్రత్యేక సమస్యను పరిగణన లోకి తీసుకోలేదని వారు గుర్తు చేస్తున్నారు. ఈ మేరకు వారి ఆందోళనను వ్యక్తం చేస్తూ ఇప్పటివరకు రిటైర్డ్ అయిన 2,316 తో పాటు తమ భవిష్యత్తు పై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ (TSCPSEU) కోరుతోంది.

ఈ సందర్భంగా ఆ యూనియన్ నాయకులు స్థితప్రజ్ఞ మాట్లాడుతూ, “సిపీఎస్ ఉద్యోగికి రిటైర్ ఐయ్యాక ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెన్షనర్ ఐ.డి ఉండదు. ఓపీఎస్ పెన్షనర్లకు ప్రభుత్వం ట్రెజరీ (IFMIS) ద్వారా పెన్షన్ చెల్లిస్తుంది. కాబట్టి, వారి పెన్షన్ నుండి 1.5 శాతం ఈహెచ్‌ఎస్ (EHS) చందా మినహాయించడం సాధ్యమవుతుంది. కానీ, 01/09/2004 తర్వాత చేరి రిటైర్ అయిన సిపీఎస్ (CPS) ఉద్యోగులకు ప్రభుత్వం నుండి పెన్షన్ రాదు. వీరి పెన్షన్ (Annuity) షేర్ మార్కెట్ విలువ (NAV) ఆధారంగా పింఛను నిధి నియంత్రణ మరియు అభివృద్ది అథారిటీ (PFRDA) నియమించిన ప్రైవేట్ ఏజెన్సీల (ASP) నుండి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం మా పెన్షన్ నుండి నేరుగా డబ్బులు కట్ చేయడం సాంకేతికంగా సాధ్యం కాదు. అందుకే రిటైర్ అయిన సిపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉచిత ఆరోగ్య భీమాను వర్తింప చేయాలని కోరాము.”

ప్రభుత్వం పదవీ విరమణ చేసిన సీపీఎస్ ఉద్యోగులకు పెన్షన్ లభించదు. ప్రభుత్వం నుండి ఎటువంటి సామాజిక భద్రతా రక్షణ ఉండదు.

ఈ పరిస్థితి లో “రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగులకు అందే మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. ఆ పరిమిత జీవనోపాధి నుండి ఆరోగ్య ప్రీమియం వసూలు చేయడం అన్యాయం. ప్రాథమిక సామాజిక భద్రతా చర్యగా సీపీఎస్ పదవీ విరమణ చేసిన వారి ఆరోగ్య సంరక్షణ ఖర్చును రాష్ట్రం పూర్తిగా భరించాలని కొరినట్టు తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్ తెలిపారు.

ఫెడరల్ తో మాట్లాడుతూ, “మార్కెట్ ఒడిదుడుకులపై ఆధారపడి వచ్చే అరకొర పెన్షన్‌తో, బయట ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోలేక రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పదవీ విరమణ పొందిన తర్వాత, వృద్ధాప్యంలో ఆసుపత్రి ఖర్చుల కోసం సిపీఎస్ ఉద్యోగులు అప్పుల పాలవకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. సిపీఎస్ ఉద్యోగుల నుండి 1.5 శాతం చందా ఎలా స్వీకరిస్తారో వెంటనే స్పష్టమైన విధి విధానాలను జారీ చేయాలని కోరాము. ఉద్యోగికే నిర్ణయాధికారం ఇవ్వాలి,” అని శ్రీకాంత్ చెప్పారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కల్వ శ్రవణ్ కుమార్, కోటకొండ పవన్ కుమార్ లు పాల్గొన్నారు.

Read More
Next Story