
తెలంగాణలో రోడ్డు ప్రమాదాలకు ఇక ‘అరైవ్–అలైవ్’ చెక్
తెలంగాణలో సంక్రాంతి ఆదుర్దా మధ్య ‘అరైవ్–అలైవ్’ ప్రారంభం
పండక్కి వెళ్లండి. క్షేమంగా రండి అంటున్న అధికారులు
అతి వేగం, మద్యం తాగి వాహనాలు నడపటం, నిర్లక్ష్య డ్రైవింగ్ … ఇవే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్న వేళ తెలంగాణలో ప్రతి రోజు సగటున 17 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ భయంకర వాస్తవానికి చెక్ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చింది. ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా తెలంగాణ పోలీసులు, రవాణాశాఖ కలిసి ‘అరైవ్–అలైవ్’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాయి. డ్రంకెన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు, బ్లాక్ స్పాట్ల సరిదిద్దటం, ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా రోడ్లపై ప్రాణరక్షణ సంస్కృతిని పెంపొందించడమే ఈ ఉద్యమం ప్రధాన ఉద్దేశం.
తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు భద్రతకు సర్కారు చర్యలు తీసుకుంటోంది. 2025వ సంవత్సరంలో రోడ్డు ప్రమాదాలు పెచ్చు పెరిగిన నేపథ్యంలో రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యమిచ్చి రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా తెలంగాణ పోలీసులు, రవాణశాఖ కలిసి ‘అరైవ్- అలైవ్’ కార్యక్రమాన్ని చేపట్టాయి.
- పీకల దాకా మద్యం తాగి వాహనాలు నడపటం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణకు హైదరాబాద్ నగరంలో డ్రంకెన్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా అత్యంత అధునాతన పరికరాలతో డ్రంకెన్, డ్రగ్స్ తనిఖీలు చేస్తున్నారు.
- తెలంగాణ రాష్ట్రంలో 2025వ సంవత్సరంలో 22,441 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, వాటిలో 6,221 మంది మృత్యువాత పడ్డారు. తెలంగాణలో పదేళ్ల రోడ్డు ప్రమాదాల వివరాలను విశ్లేషిస్తూ రోడ్డు భద్రతకు రవాణశాఖ, పోలీసులు, ఆర్టీసీ కొత్త చర్యలు చేపట్టాయి.
రోడ్డు ప్రమాదాల్లో వేలాది మంది మృత్యువాత
తెలంగాణ రాష్ట్రంలో గడచిన పన్నెండేళ్లలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. కారణాలు ఏవైనా ప్రమాదాల్లో వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరో వైపు వేలాది మంది గాయాలపాలవుతున్నారు. 2014వ సంవత్సరంలో 20,078 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, వీటిలో 6,906 మంది మృత్యువాత పడ్డారు. ఈ రోడ్డు ప్రమాదాల్లో 21,636 మంది గాయాల పాలయ్యారు. 2018వ సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య 22,230కి పెరిగాయి. ఈ ప్రమాదాల్లో 6,603 మంది మరణించగా, 21,613 మంది క్షతగాత్రులయ్యారు. 2023వ సంవత్సరంలో 22,903 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 7,660 మంది మృత్యువు పాలయ్యారు. 2025వ సంవత్సరంలో 22,441 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, వాటిలో 6,221 మంది మృత్యువాత పడ్డారు.
తెలంగాణలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు పట్టిక
సంవత్సరం ప్రమాదాల సంఖ్య మృతుల సంఖ్య
2014 20,౦78 6,906
2015 21,252 7,110
2016 22,811 7,219
2017 22,475 6,595
2018 22,230 6,603
2019 21,588 6,800
2020 19,164 6,668
2021 21,315 7,557
2022 21,619 7,550
2023 22,903 7,660
2024 25,934 7,281
2025 22,441 6,221
రాష్ట్రంలో రహదారి భద్రతా మండలి
రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు రహదారి భద్రతా మండలిని ఏర్పాటు చేసి భద్రతా చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణలో రహదారి భద్రతా మండలిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పోలీసు, రోడ్డు భవనాల శాఖ, వైద్యఆరోగ్య శాఖ, విద్యాశాఖల సభ్యులతో నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జాతీయ రహదారులపై మద్యం విక్రయాలు జరగకుండా ఎక్సైజ్ శాఖ చర్యలు చేపడుతోంది. రోడ్డు భద్రతపై మిస్టర్ రిడో మస్కట్ ద్వారా ప్రచారం చేపట్టారు. రోడ్డు ప్రమాద బాధితులకు అడ్మిషన్ ఖర్చులు డిమాండ్ చేయకుండా చికిత్స అందించాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది.
డ్రైవింగ్ రూల్స్ ఉల్లంఘిస్తే...
మద్యం తాగి వాహనాలు నడపటం, అధిక లోడు, అతి వేగం, సిగ్నల్ జంపింగ్, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన వారిని గుర్తించి వారి డ్రైవింగ్ లైసెన్సులను తెలంగాణ రవాణశాఖ రద్దు చేసింది. అతివేగాన్ని నియంత్రించడానికి ప్రధాన రహదారులపై రవాణశాఖ, పోలీసులు స్పీడ్ గన్ లను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనుల నుంచి రూ.357 కోట్ల జరిమానాలను వసూ చేశారు. ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇస్తున్నారు.
బ్లాక్ స్పాట్ రోడ్ల గుర్తింపు
తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగిన బ్లాక్ స్పాట్లను గుర్తించి వాటిని సరిదిద్దే పనులను రోడ్లు భవనాల శాఖ చేపట్టింది. జాతీయ రహదారులపై 25, ఎన్‌హెచ్‌ఏఐ 44,రాష్ట్ర రహదారులపై106 బ్లాక్ స్పాట్ రోడ్లను గుర్తించి వాటిని సరిదిద్దే పనులు చేపట్టారు. అతివేగం వల్ల ప్రమాదాలు జరుగుతున్న రోడ్లను గుర్తించి అక్కడ రంబుల్ స్ట్రీప్స్, స్పీడ్ బ్రేకర్లు, రోడ్డు చిహ్నాలు లాంటి వేగనియంత్రణ చర్యలు చేపట్టామని రోడ్డు భవనాల శాఖ ఇంజినీరు చెప్పారు.
రోడ్డు భద్రత కోసం రేపటి నుంచి ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం
తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి ‘అరైవ్ అలైవ్’ప్రచార కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. జనవరి 13వతేదీ నుంచి 24వతేదీ వరకు పది రోజుల పాటు చేపడుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని డీజీపీ పేర్కొన్నారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు రహదారి భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు పాటు ప్రమాదాలను తగ్గించేందుకు సురక్షితమైన డ్రైవింగ్ సంస్కృతిని ప్రజల్లో ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు డీజీపీ వివరించారు.
రోడ్డు భద్రతా చర్యలకు ప్రాధాన్యం
రోడ్డు ప్రమాదాలకు దారి తీసే అంశాలను ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు. ద్విచక్రవాహన చోదకులు హెల్మెట్లు ధరించక పోవడం, కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్టు ధరించక పోవడం, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్లు ఉపయోగించడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మద్యం తాగి వాహనాలు నడపటం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం, సిగ్నల్ జంపింగ్, స్టాప్ లైన్ దాటడం, జాతీయ రహదారులపై ఆటోల్లో అధిక లోడ్, మీటర్, యూనిఫాం నిబంధనల ఉల్లంఘన, హై బీమ్ లైట్లు వాడటం, ఎడమవైపు నుంచి ఓవర్ టేక్ చేయడం నివారించాలని పోలీసులు ప్రచారం చేస్తున్నారు.
రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేస్తే రూ.25వేలు బహుమతి
రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేసే పౌరులకు రూ.25వేలు బహుమతిగా అందించాలని పోలీసులు నిర్ణయించారు. జిల్లా ఎస్పీలు, పోలీసు కమిషనర్ల ఆధ్వర్యంలో ఈ బహుమతులను అందించాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంలోని డివిజన్ స్థాయిలో డీఎస్పీలు, మండల స్థాయిలో సర్కిల్ ఇన్ స్పెక్టర్లు, ఎస్ఐలు, గ్రామాల్లో సర్పంచుల అధ్యక్షతన ట్రాఫిక్ భద్రతా కమిటీలను ఏర్పాటు చేసి ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించనున్నారు. పది రోజుల పాటు చేపడుతున్న ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ కార్యకర్తలు, యువత, ఎన్ సీసీ, ఆటో డ్రైవర్లు, ట్రాక్టర్ల యజమానులు, విద్యార్థులు, డ్రైవర్లు పాల్గొంటున్నారు. ప్రమాదాలకు దారి తీస్తున్న బ్లాక్ స్పాట్లను గుర్తించి వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు.
చట్టాలు, చర్యలు, ప్రత్యేక డ్రైవ్‌లు ఎంత కఠినంగా ఉన్నా రోడ్డు భద్రత చివరికి ప్రతి పౌరుడి బాధ్యతే. హెల్మెట్, సీటు బెల్ట్ వంటి చిన్న జాగ్రత్తలు కూడా పెద్ద ప్రాణాలను కాపాడగలవు. ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం రోడ్లను సురక్షితంగా మార్చే ప్రయత్నం చేస్తుంటే, ఆ ప్రయత్నాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. ఇంటి నుంచి బయలుదేరిన ప్రతి ఒక్కరూ గమ్యానికి సురక్షితంగా చేరుకోవడమే ఈ ఉద్యమం ఆశయం. రోడ్డు మీద ఒక్క తప్పిదం కూడా ఓ కుటుంబాన్ని చీకటిలోకి నెట్టగలదన్న సత్యాన్ని గుర్తుంచుకుంటేనే రోడ్లపై నిజమైన భద్రత సాధ్యమవుతుంది.
Next Story

