
తెలంగాణ హేట్ స్పీచ్ బిల్లుపై తీవ్ర విమర్శలు
హేట్ స్పీచ్ బిల్లు విస్తృతంగా, స్పష్టత లేకుండా ఉందని, దుర్వినియోగం జరిగే ప్రమాదం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ బిల్ కీలక చర్చలకు దారితీస్తోంది. ఈ బిల్లుపై తీవ్ర విమర్శలు కూడా వెళ్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ బిల్లు స్వేచ్ఛా భావ వ్యక్తీకరణను అణిచివేసే ప్రమాదం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమాజంలో విద్వేషాన్ని అరికట్టడం ప్రభుత్వ బాధ్యతేనని, కానీ ఈ బిల్లు నిర్మాణం విస్తృతంగా, స్పష్టత లేకుండా ఉందని పేర్కొన్నారు. దీనివల్ల చట్టం దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తమైంది.
ప్రజా శాంతి కాపాడటానికి బదులుగా, ప్రతిపక్ష నేతలు, విమర్శకులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా కార్యకర్తలు, సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకునే సాధనంగా మారే ప్రమాదం ఉందని విమర్శించారు. దేశంలో ఇప్పటికే విద్వేష ప్రసంగాలు, హింసకు ప్రేరేపణ, అపకీర్తి వంటి అంశాలపై చట్టాలు ఉన్నాయని గుర్తుచేశారు. వాటి అమలును బలోపేతం చేయకుండా, కొత్త చట్టం ద్వారా అధిక అధికారాన్ని విస్తరించే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

