ఎన్‌టీఆర్‌ జిల్లాలో 12,466 హెక్టార్లలో పంట నష్టం

మిగ్‌జాం తుపాన్‌ వల్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఎన్‌టీఆర్‌ జిల్లాలో 12,466 హెక్టార్లలో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనాలు రూపొందించారు.


ఎన్‌టీఆర్‌ జిల్లాలో 12,466 హెక్టార్లలో పంట నష్టం
x
ఎన్టీఆర్‌ జిల్లాలో తుపాన్‌ వల్ల దెబ్బతిన్న పంటలు పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఢిల్లీరావు

మిగ్‌జాం తుపాన్‌ వల్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఎన్‌టీఆర్‌ జిల్లాలో వివిధ రకాల పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. 12,466 హెక్టార్లలో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనాలు రూపొందించారు. ఎక్కువ భాగం కృష్ణా జిల్లాకు నష్టం వాటిల్లింది. అయితే ఎన్‌టీఆర్‌ జిల్లాలోనూ వివిధ పంటలు, వరి పంట తీవ్రంగా దెబ్బ తిన్నది. దెబ్బతిన్న ప్రాంతాలను బుధవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ ఢిల్లీరావు సందర్శించారు. రైతులతో మాట్లాడారు. నష్ట పరిహారం విషయంలో లిబరల్‌గా ఉంటామని చెప్పారు. నష్టపోయిన ప్రతిరైతుకూ సాయం అందిస్తామన్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా దాదాపు మెట్ట ప్రాంతంగా చెప్పవచ్చు. కృష్ణా జిల్లా డెల్టా ప్రాంతం కాగా ఎన్‌టీఆర్‌ జిల్లా మెట్ట ప్రాంతం. పండ్లతోటలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మామిడి, నిమ్మ, దానిమ్మ, నిమ్మతోటలు కూడా ఉన్నాయి.
విజయవాడ, రాయనపాడు, పైడూరుపాడు గ్రామాల్లోని వరి పొలాలను సందర్శించారు. పంట నష్టం జరక్కుండా పొలాల నుంచి నీటిని బయటకు పంపించేందుకు అధికారులు చేసిన ఏర్పాట్లను కలెక్టర్‌ పరిశీలించారు. ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు.
ఖరీఫ్‌లో జిల్లాలో 41,163 హెక్టార్లలో వరి సాగు చేశారు. ఇప్పటికే 10 వేలకు పైగా హెక్టార్లలో కోతలు జరిగాయి. మిగ్‌జాం తుపాను కారణంగా కురిసిన వర్షాల వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం 11,859 హెక్టార్లలో వరి, 169 హెక్టార్లలో శనగ, 26 హెక్టార్లలో పెసర, 46 హెక్టార్లలో కంది, 270 హెక్టార్లలో మొక్కజొన్న, 68 హెక్టార్లలో జొన్న, 28 హెక్టార్లలో మినప పంటలు నేల కూలడం, ముంపునకు గురికావడం, నీట మునగడం జరిగాయి.
పంట నష్టం జరక్కుండా ఉండేందుకు పంట పొలాల నుంచి వరద నీటిని బయటకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైన ఇంజన్లను, జేసీబీల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. పంట పొలాల్లో కురిసిన వర్షంతో పాటు డ్రెయిన్లు పొంగిపొర్లుతుండటం వల్ల మరింతగా పొలాల్లోకి నీరు చేరి వరి పంట పూర్తిగా ముంపునకు గురైంది. వారం రోజుల వరకు నీరు బయటకు పోయే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ముంపునకు గురైన పంట ఏమాత్రం పనికి పోయే అవకాశం ఉంది. 25 శాతం కూడా రైతు చేతికొచ్చే అవకాశం కనిపించడం లేదు. పంట పొలాల్లో నీరు బయటకు పోయే విధంగా డ్రెయిన్లలో తూటికాడ, గుర్రపుడెక్క వంటివి అడ్డు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో తక్షణమే జేసీబీల ద్వారా వాటిని తొలగించి నీరు పొలాల్లోంచి బయటకు వెళ్లేలా అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఇప్పటికే రాయనపాడులో 2, పైడూరుపాడులో 2, జక్కంపూడి, గొల్లపూడిలో ఒక్కొక్కటి చొప్పున జేసీబీలను ఏర్పాటుచేసి తూటికాడ తొలగిస్తున్నారు. ఈ–క్రాప్‌ బుకింగ్‌ డేటాలో నమోదైన సర్వే నంబర్ల ఆధారంగా పంట నష్టం వివరాలను కలెక్టర్‌కు అధికారులు తెలియజేస్తున్నారు.


Next Story