అవినీతికి అడ్డుకట్ట: ఏసీబీ ట్రాప్‌లో వరుసగా పోలీసు అధికారులు
x
లంచం సొమ్ముతో ఏసీబీ వలలో చిక్కిన ఇన్‌స్పెక్టర్ సంపాతి కనకయ్య,ఎస్.ఐ. యు.కె. సిద్ధేశ్వర్ ( ఫొటో : ఎక్స్ పోస్టు / ఏసీబీ)

అవినీతికి అడ్డుకట్ట: ఏసీబీ ట్రాప్‌లో వరుసగా పోలీసు అధికారులు

తెలంగాణలో ఏసీబీ కఠిన చర్యలు


తెలంగాణలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు పెంచింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అక్రమాలు అధికమవుతుండటంతో ఆకస్మిక తనిఖీలు, ట్రాప్ కేసులతో ఏసీబీ వరుసగా దాడులు చేస్తోంది. ముఖ్యంగా పోలీసు శాఖలోనే అధికారులు లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది.ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలు పెరిగిపోవడంతో ఆకస్మిక తనిఖీలు చేయడంతోపాటు ట్రాప్ కేసులతో ఏసీబీ హడలెత్తిస్తోంది.


ఏసీబీ వలలో ఇద్దరు పోలీసు అధికారులు

ఆర్.జి.ఐ. ఎయిర్‌పోర్ట్ పోలీస్ అవుట్‌పోస్ట్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ సంపాతి కనకయ్య,ఎస్.ఐ. యు.కె. సిద్ధేశ్వర్ లు ఒక కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు, అలాగే ఫిర్యాదుదారుని కుటుంబ సభ్యులను అరెస్టు చేయకుండా ఉండేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేశారు. అందులో భాగంగా రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా, తెలంగాణ అవినీతినిరోధకశాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఇన్‌స్పెక్టర్ కనకయ్య నివాసంలో ఏసీబీ జరిపిన సోదాల్లో రూ.33,97,000 నగదుతో పాటు కొన్ని ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.అవినీతి నిరోధకశాఖ అధికారులు ప్రస్తుతం వీటిపై లోతైన విచారణ జరుపుతున్నారు.



ఎస్ఐ లంచం కేసులో...

నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చలమల్ల హరి ప్రసాద్ రెడ్డి ఫిర్యాదుదారుడి తమ్ముడికి చెందిన సీజ్ చేసిన వాహనాన్ని విడుదల చేయడానికి ఫిర్యాదుదారుడి నుండి రూ.30వేలు లంచం డిమాండ్ చేశారు. తదనంతరం సీజ్ చేసిన వాహనాన్ని విడుదల చేయడానికి ఫిర్యాదుదారుడి నుంచి రూ. 20వేలు డిమాండ్ చేసి ఎస్ఐ తీసుకున్నాడు. దీంతో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు కేసు నమోదు చేశారు.

ఏసీబీ వలలో ఏఎస్ఐ

మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్‌కు చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఏఎస్ఐ) పూసాల బాలయ్య ఫిర్యాదుదారుడిపై ఉన్న క్రిమినల్ కేసులో సెక్షన్‌ను మార్చడానికి, దాన్ని లోక్ అదాలత్‌లో రాజీ చేయడానికి గాను, ఫిర్యాదుదారుడి నుంచి రూ. 15వేలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.



నిజాయితీగా విధులు నిర్వర్తించండి : డీజీపీ శివధర్ రెడ్డి

తెలంగాణలో ఇటీవల పోలీసు శాఖలో అక్రమాలు పెరిగిన నేపథ్యంలో డీజీపీ బి శివధర్ రెడ్డి సంచలన ఆదేశాలు జారీ చేశారు. హోం గార్డుల నుంచి ఐపీఎస్ అధికారుల వరకు ప్రతి ఒక్కరూ నిజాయితీ, కరుణ, జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించాలని తెలంగాణ డీజీపీ ఆదేశించాను. చాలామంది ఈ విలువలను పాటిస్తున్నప్పటికీ, ఇటీవల ఏసీబీ తీసుకున్న చర్యలు,ఈ మార్గం నుంచి పక్కకు తొలగితే కఠిన పరిణామాలు తప్పవని గుర్తుచేస్తున్నాయని డీజీపీ పేర్కొన్నారు.



పెన్షన్ మంజూరుకు లంచం

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అయోధ్యపురం గ్రామంలో జిల్లాపరిషత్ ప్రధానోపాధ్యాయులు, గూడూరు మండల విద్యాశాఖాధికారి జె. రవికుమార్, స్కూల్ అసిస్టెంట్, ఇన్‌ఛార్జ్ క్లర్క్ జి. చంద్రమౌళిలు ఒక ఫిర్యాదుదారుడి నుంచి రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా, తెలంగాణ అవినీతినిరోధకశాఖ అధికారులు పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడికి సంబంధించిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రిటైర్మెంట్ బెనిఫిట్ బిల్లులను సిద్ధం చేసి, వాటిని ఏజీఏ కార్యాలయానికి పంపేందుకు వీరు లంచాన్ని డిమాండ్ చేసి, గూడూరు పాఠశాల ఆవరణలో తీసుకుంటుండగా అవినీతినిరోధకశాఖ అధికారులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.



అవినీతిపై ఫిర్యాదు చేయండి : డీజీ చారుసిన్హా

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై ఫిర్యాదు చేయడానికి 1064 ఫోన్ చేయాలని తెలంగాణ డైరెక్టర్ జనరల్ చారుసిన్హా కోరారు. ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని కోరారు. వాట్సాప్ నంబరు 9440446106, ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) వెబ్ సైట్ (http://acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ ఏసీబీని సంప్రదించవచ్చు.

ప్రభుత్వ వ్యవస్థపై ప్రజల నమ్మకం నిలుపుకోవాలంటే అవినీతిని పూర్తిగా నిర్మూలించడం అత్యవసరం. ఏసీబీ చర్యలు అవినీతి అధికారులకు గట్టి హెచ్చరికగా మారుతున్నాయి. ప్రజలు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి 1064 ద్వారా ఫిర్యాదులు చేస్తేనే ఈ పోరాటం మరింత ఫలితాలను ఇస్తుందని అధికారులు సూచిస్తున్నారు.


Read More
Next Story