అరైవ్ అలైవ్‌తో రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట: తగ్గుతున్న మృతుల సంఖ్య
x
తెలంగాణలో రోడ్డు ప్రమాదం ఫైల్ ఫొటో

అరైవ్ అలైవ్‌తో రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట: తగ్గుతున్న మృతుల సంఖ్య

ట్రాఫిక్ నిబంధనలతో మారుతున్న తెలంగాణ..హెల్మెట్ నుంచి హైవే వరకు రోడ్డు భద్రత బలోపేతం


తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో పోలీసు శాఖ చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం ప్రభావం చూపుతోంది. కఠిన తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు, ప్రజల భాగస్వామ్యంతో ప్రమాదాలు, మృతుల సంఖ్య తగ్గుముఖం పట్టడం ఆశాజనకంగా మారింది.ఒక చిన్న నిర్లక్ష్యం ప్రాణాలను బలి తీసుకుంటున్న నేపథ్యంలో తెలంగాణలో రోడ్డు భద్రతపై పెద్ద ఎత్తున చర్యలు ప్రారంభమయ్యాయి.

తెలంగాణ రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు ప్రారంభించిన అరైవ్ అలైవ్ (Arrive Alive) కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుతోంది.మూడు దశల వారీగా చేపట్టిన ఈ కార్యక్రమంతో రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గడంతో కొంత ప్రభావం చూపిస్తుంది.

అరైవ్‌.. అలైవ్‌ ప్రచారం

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టాలను తగ్గించాలనే సంకల్పంతో పోలీసు శాఖ ‘అరైవ్‌.. అలైవ్‌’ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజల భాగస్వామ్యంతో రోడ్డు ప్రమాదాలను, మరణాలను తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని డీజీపీ బి శివధర్ రెడ్డి చెప్పారు. రోడ్డు భద్రత ప్రాముఖ్యతను ప్రతి పౌరుడి మనసులో బలంగా నాటేందుకే అరైవ్‌ అలైవ్‌ను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో హోంగా ర్డు నుంచి ఉన్నతాధికారి వరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వివరించారు. జిల్లా స్థాయిలో పోలీసు కమిషనర్‌ లేదా ఎస్పీల నేతృత్వంలో, గ్రామాల్లో సర్పంచ్‌ల అధ్యక్షతన గ్రామ ట్రాఫిక్‌ సేఫ్టీ కమిటీల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించనున్నామని చెప్పారు.

ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక దృష్టి

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించక పోవడం, కార్లలో సీటు బెల్టులు పెట్టుకోకపోవడం, వాహనం నడుపుతూ సెల్‌ఫోన్‌ లో మాట్లాడటం, మద్యం తాగి వాహనాలు నడపడం, సిగ్నల్‌ జంపింగ్, స్టాప్‌ లైన్‌ దాటడం, హైవేలపై ఆటోల ఓవర్‌ లోడింగ్‌, ఎడమవైపు నుంచి ఓవర్‌ టేకింగ్‌ వంటి ప్రమాదకర అలవాట్లపై అరైవ్ అలైవ్ ప్రచారంలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఏం చేస్తున్నారంటే...

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేయడంతోపాటు జాతీయ రహదారులపై స్పీడ్ గన్ల ద్వారా నిరంతర నిఘా పెట్టారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించడంపై ప్రత్యేక తనిఖీలు, రోడ్లపై బ్లాక్ స్పాట్స్ గుర్తింపు,వాటికి మరమ్మతులు చేయించడం, అవగాహన సదస్సులు, రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే 'గోల్డెన్ అవర్'లో బాధితులకు వైద్యం అందేలా హైవేలపై అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచడం వల్ల ప్రమాదాలతోపాటు మృతులు, క్షతగాత్రుల సంఖ్య తగ్గుతుందని పోలీసులు చెబుతున్నారు.

డ్రైవర్లకు కంటిచూపు సమస్యలు

భారీ టిప్పర్లు, లారీలు నడుపుతున్న డ్రైవర్లకు కంటిచూపు సమస్యలను గుర్తించేందుకు పోలీసులు ఉచితంగా కంటి వైద్యులతో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. తాజాగా చర్లపల్లిలో ఆయిల్ ట్యాంకర్లు నడుపుతున్న 76 మంది భారీ మోటారు వాహన డ్రైవర్లకు ఉచితంగా పోలీసులు కంటి పరీక్షలు నిర్వహించగా, వారిలో పలువురికి కంటి చూపు సమస్యలున్నాయని తేలింది. కంటిచూపు సమస్యలతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించి కంటి పరీక్షలకు డ్రైవర్లకు శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. వాటిలో 8 కంటిశుక్లం కేసులు, 31 మందికి కళ్లజోడు అవసరం, రెండు కేసుల్లో రెటీనా సమస్యలు, 5 కేసుల్లో వర్ణ అంధత్వం, ఒక వ్యక్తికి ఒంటి కన్ను సమస్య బయటపడ్డాయి.

డ్రంకెన్ డ్రైవింగ్ పరీక్షలు ముమ్మరం

హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫోర్త్ సిటీ పోలీసు కమిషనరేట్ లతోపాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వారాంతాల్లో రెండు రోజుల పాటు రోడ్లపై డ్రంకెన్ డ్రైవింగ్ పరీక్షలు చేస్తున్నారు. మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు వారాంతంలో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక తనిఖీలు చేసి 118 మంది నిబంధనల ఉల్లంఘనదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రోడ్డు భద్రతపై డీజీపీ సూచనలు

రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, కారు ప్రయాణికులు సీటుబెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం వంటి అంశాలే ఎక్కువగా ప్రమాదాలకు కారణమవుతున్నాయని తెలిపారు. ఈ తరహా ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ చెప్పారు. జాతీయ రహదారులు, ప్రధాన రాష్ట్ర రహదారులపై రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువగా జరుగుతుంది.స్పీడ్ కెమెరాల సంఖ్యను పెంచడం, ప్రమాదాలకు గురయ్యే రోడ్డు ప్రాంతాల్లో ప్రత్యేక హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలతో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించవచ్చని పోలీసులు చెబుతున్నారు.

తెలంగాణలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు

తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను నియంత్రించేందుకు పోలీసులు, రవాణశాఖ, రోడ్లు భవనాల శాఖలు చర్యలు చేపట్టాయి. గతంలో తెలంగాణలో రోజుకు 71 రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా, అరైవ్ అలైవ్ కార్యక్రమంతో వీటి సంఖ్య తగ్గుముఖం పట్టింది. పాఠశాలలు, కళాశాలలు, ఆటో,క్యాబ్ డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలపై శిక్షణ ఇవ్వడం వల్ల ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు యత్నిస్తున్నారు.2014వ సంవత్సరంలో తెలంగాణలో 20,078 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 6,906 మంది మృత్యువాత పడ్డారు. మరో 21,636 మంది గాయపడ్డారు. ఇలా ఏటేటా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుండేది. ఈ ప్రమాదాల్లో మృతులే కాకుండా క్షతగాత్రుల సంఖ్య పెరుగుతుండేది.2024 వ సంవత్సరంలో 25,934 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 7,281 మంది మరణించగా,మరో15,401 మంది గాయపడ్డారు. 2025వ సంవత్సరంలో 24,826 రోడ్డు ప్రమాదాలు జరగ్గా వీటిల్లో 6,499 మంది మరణించారు. మరో 14,768 మంది గాయపడ్డారు. 2024వ సంవత్సరంతో పోలిస్తే గత ఏడాది రోడ్డు ప్రమాదాలతో పాటు మృతులసంఖ్య, క్షతగాత్రుల సంఖ్య తగ్గింది. ఈ ఏడాది ఈ ప్రమాదాల సంఖ్య మరింత తగ్గే అవకాశాలున్నాయని తెలంగాణ డీజీపీ బి శివధర్ రెడ్డి చెప్పారు.
తెలంగాణలో రోడ్డు ప్రమాదాల పట్టిక
సం. ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు
2014 20,078 6,906 21,636
2015 21,252 7,110 22,948
2016 22,811 7,219 24,217
2017 22,475 6,595 24,017
2018 22,230 6,603 23,613
2019 21,588 6,800 22,265
2020 19,164 6,668 18,745
2021 21,315 7,557 20,107
2022 21,619 7,559 20,209
2023 22,903 7,660 21,022
2024 25,934 7,281 15,401
2025 24,826 6,499 14,768

రోడ్డు భద్రతకు ప్రాధాన్యం : మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ రాష్ట్రంలో రోడ్డుసేఫ్టీ కి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్ల కు శిక్షణ ఇవ్వడంతోపాటు బస్సుల స్క్రాప్ పాలసీ అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. టీఎస్ఆర్టీసీ లో నియామకం అవుతున్న డ్రైవర్లకు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ ద్వారా ఆరు నెలలపాటు ట్రైనింగ్ ఇచ్చి ఆర్టీసీలోకి తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.
తెలంగాణలో రోడ్డు భద్రతా చర్యల వల్ల రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

రోడ్డు ప్రమాదాలకు నెలవుగా...

హైదరాబాద్​ శివార్లలో అధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తేలడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశ వ్యాప్తంగా అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు, మరణాలు సంభవిస్తున్న 100 జిల్లాలను గుర్తించగా, వాటిలో తెలంగాణకు చెందిన నాలుగు ప్రాంతాలున్నాయి.తెలంగాణలో గుర్తించిన నాలుగు ప్రాంతాల్లో రాచకొండ, సైబరాబాద్​ కమిషనరేట్​ పరిధిలోని రంగారెడ్డి జిల్లాలో ఈ ప్రమాదాలు, మరణాలు అధిక సంఖ్యలో జరుగుతున్నాయని తేలింది. హైదరాబాద్ రాజధాని శివారు ప్రాంతాల్లో ఏటా రోడ్డు ప్రమాదాల్లో 500 మరణాలు సంభవిస్తున్నాయని పోలీసు గణాంకాలు చెబుతున్నాయి.రంగారెడ్డి జిల్లాలో అత్యధిక ప్రమాదాలు, మరణాల్లో అబ్దుల్లాపూర్ మెట్​ తొలి స్థానంలో ఉండగా ఆదిభట్ల రెండో స్థానంలో నిలిచింది. సైబరాబాద్ లో​44 రోడ్డుప్రమాదాలు,మల్కాజిగిరిలో 46,సంగారెడ్డిలో 56,వరంగల్ కమిషనరేట్60 ప్రమాదాలు జరిగాయి.
రోడ్డు భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు.. ప్రతి పౌరుడి కర్తవ్యమూ అదే. ఒక చిన్న జాగ్రత్త ప్రాణాలను కాపాడగలదన్న విషయాన్ని గుర్తుంచుకుంటేనే “అరైవ్ అలైవ్” అసలైన అర్థం నెరవేరుతుంది.ఒక్క క్షణం నిర్లక్ష్యం కుటుంబాల జీవితాలను చీకటిలోకి నెట్టేస్తోంది. అందుకే “సురక్షితంగా వెళ్లి సురక్షితంగా చేరుకోవడం” అనే భావన ప్రతి ఒక్కరిలో అలవాటు కావాలి. అదే నిజమైన ‘అరైవ్ అలైవ్’.
Read More
Next Story