సైబర్ పోలీసులకు ఆశ్రయించిన అనసూయ
x

సైబర్ పోలీసులకు ఆశ్రయించిన అనసూయ

ఆన్‌లైన్ వేదికగా తనను వేధిస్తున్నారంటూ ఫిర్యాదు.


సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్.. సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. గతేడాది డిసెంబర్ 20వ తేదీ నుంచి తనను ఆన్‌లైన్ వేదికగా వేధిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అశ్లీల వ్యాఖ్యలు, లైంగిక దూషణలు, బెదిరింపులు రోజురోజుకు పెరిగాయని చెప్పారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని, తీవ్రమైన పదజాలంతో దూషిస్తున్నారని పేర్కొన్నారు.

మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయం వెల్లడించిన తర్వాత నుంచే తనను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించారని అనసూయ వివరించారు. విమర్శలుగా మొదలైన ట్రోలింగ్.. క్రమక్రమంగా తిట్లుగా మారిందని వివరించారు. కొందరు కంటెంట్ క్రియేటర్లు వ్యూస్ కోసమే తన పేరును వాడుకుంటూ అభ్యంతరకర వీడియోలు రూపొందించారని ఆరోపించారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దాడి స్పష్టంగా కనిపించిందని అన్నారు.

ఫొటోలు మార్ఫింగ్

తన ఫిర్యాదులో అనసూయ పలు తీవ్రమైన అంశాలను వెల్లడించారు. తన ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యంగా ప్రచారం చేశారని చెప్పారు. వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం రెండింటినీ లక్ష్యంగా చేసుకుని కించపరిచారని తెలిపారు. మహిళగా తన గౌరవాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో పోస్టులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు గ్రూపులుగా ఏర్పడి మానసికంగా వేధించారని చెప్పారు. ఈ ఘటనలు తన మానసిక స్థితిపై తీవ్రమైన ప్రభావం చూపాయని పేర్కొన్నారు.

73మందిపై కేసులు

అనసూయ ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు 73 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ జాబితాలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు, యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు ఉన్నారు. బొజ్జ సంధ్యారెడ్డి, ప్రియాచౌదరి, గోగినేని పావని, రజని శేఖర్, బాషా, కరాటే కల్యాణి, విజయలక్ష్మి, టీవీ యాంకర్ రోహిత్ వంటి పేర్లు కూడా నమోదయ్యాయి. మరికొందరు మీడియా వ్యక్తుల పాత్రపై విచారణ సాగుతోంది.

చట్టపరమైన చర్యలు ప్రారంభం

పోలీసులు ఐటీ యాక్ట్ సంబంధిత సెక్షన్లతో పాటు ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు. క్రిమినల్ డిఫమేషన్ సెక్సువల్ హెరాస్‌మెంట్ ఆన్‌లైన్ బెదిరింపులు ఏఐ ఫోర్జరీ వంటి ఆరోపణలు చేర్చారు. డిజిటల్ సాక్ష్యాలుగా వీడియోలు పోస్టులు స్క్రీన్‌షాట్లు ఇప్పటికే సేకరించారు. త్వరలో నిందితులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. నేరం రుజువైతే జరిమానాతో పాటు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

అసలు మొదలయింది ఎక్కడంటే..

హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వివాదానికి బీజం పడింది. శివాజీ చేసిన వ్యాఖ్యలను అనసూయ తీవ్రంగా ఖండించారు. ఆయన సలహా ఎవరూ అడగలేదని అన్నారు. దుస్తులు ఎలా ధరించాలి అన్న విషయంపై మహిళలకు శివాజీ సలహాలు ఏమీ అక్కర్లేదని తెలిపారు. “ఇది మా శరీరం. మాకు నచ్చిన విధంగా మేం ఉండే హక్కు మాకుంది” అని వ్యాఖ్యానించారు. “ఎవరికి ఏది సౌకర్యంగా ఉంటే అదే దుస్తులు ధరించడం వారి వ్యక్తిగత హక్కు. ఇతరుల అభిప్రాయాల ఆధారంగా మహిళలు జీవించాల్సిన అవసరం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు దురదృష్టకరం” అని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే కొందరు అనసూయను టార్గెట్‌గా చేసుకుని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ట్రోలింగ్ కాస్తా హద్దుమీరి వేధింపులుగా మారాయి. అవి రోజురోజుకు అధికం అవుతుండటంతో అనసూయ.. సైబర్ పోలీసులను ఆశ్రయించారు.

Read More
Next Story