సైబరాబాద్‌లో ఏఐ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్
x

సైబరాబాద్‌లో ఏఐ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్

సైబరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఏఐ ఆధారిత ప్రిడిక్టివ్ సిస్టమ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. జ్యూరిక్ సంస్థ దీనిపై ప్రజెంటేషన్ ఇచ్చింది.


హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో వాహనదారులు ట్రాఫిక్ రద్దీతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు సైబరాబాద్ పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. యూరప్ ప్రమాణాలకు అనుగుణంగా 'ప్రిడిక్టివ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్' విధానం అమలు చేసేందుకు అడుగులు వేస్తున్నారు. ఫిబ్రవరి 25న సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ అధ్యక్షతన ఎస్సీఎస్సీ మీటింగ్ హాల్, పీఎస్‌ఐఓసీ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది.

ముందుగానే రద్దీ అంచనా.. ఏఐ మేజిక్!

స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్‌కు చెందిన 'ట్రాన్స్‌కాలిటీ' సంస్థ సీఈఓ డాక్టర్ లూకాస్ అంబుల్ ఏఐ ట్రాఫిక్ పరిష్కారాలపై ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. ఈ సాంకేతికత నగర ట్రాఫిక్ నమూనాలను విశ్లేషించి రద్దీ ఎక్కడ ఏర్పడుతుందో ముందే గుర్తిస్తుంది. రద్దీని బట్టి సిగ్నల్ సమయాన్ని ఆటోమేటిక్‌గా మారుస్తూ వాహనాల రాకపోకలను సులభతరం చేస్తుంది. ట్రాఫిక్ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ముందస్తు హెచ్చరికలు ఇస్తుంది.

భవిష్యత్తు అవసరాలే లక్ష్యం

రాజధానిలో వేగంగా పెరుగుతున్న మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ట్రాఫిక్ ప్రణాళికలు రూపొందించాలని సీపీ అధికారులను ఆదేశించారు. ఈ ఇంటెలిజెంట్ టెక్నాలజీ వల్ల రద్దీ తగ్గడమే కాకుండా రోడ్డు భద్రత మెరుగుపడుతుందని, సిబ్బంది పనితీరు పెరుగుతుందని ఆయన తెలిపారు. ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, అమలు సామర్థ్యం, రోడ్డు భద్రత మెరుగుదలకు ఇంటెలిజెంట్ టెక్నాలజీల సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని అధికారులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ ఆదేశించారు. ప్రయోగాత్మక ప్రాజెక్టుల విజయవంతమైన ఫలితాల నేపథ్యంలో, ఈ కొత్త ప్రిడిక్టివ్ విధానం త్వరలోనే వాహనదారులకు ఊరటనివ్వనుంది.

Read More
Next Story