హైదరాబాద్ కు రోజూ మంచినీళ్లు సప్లై అయ్యేదెపుడంటే...
x

హైదరాబాద్ కు రోజూ మంచినీళ్లు సప్లై అయ్యేదెపుడంటే...

లేకుంటే కలుషిత జలాలే...ఎందుకంటే...


ఇపుడు హైదరాబాద్ నగరంలో రోజు విడిచి రోజు నీళ్ల సరఫరా చేస్తున్నారు. దీని వల్ల చాలా అనర్థాలు వస్తున్నాయి. పైపుల ద్వారావస్తున్న మంచినీళ్లు కలుషితమయ్యేందుకు, రోగాల బారిన పడేందుకు ఈ రెండురోజులకొకసారి నీళ్లువదలడం ఒక కారణమని నిపుణులు అంటున్నారు.

పైపుల ద్వారా నీళ్లు నిరంతరం వేగంగా ప్రవహిస్తున్నపుడు ఆ ప్రెజర్ వల్ల పైపులకు ఉన్న నెర్రల, పగుళ్ల నుంచి, రంద్రాలనుంచి, బలహీనపడిన జాయింట్స్ నుంచి కలుషితమయిన గ్రౌండ్ వాటర్ గాని, మురుగు నీరు గాని వాటర్ సప్లై పైపుల్లోకి ప్రవేశించడం జరగదు. ఆ వేగం, వత్తిడి ఈ మురికినీరు పైపుల్లోకి రాకుండా అడ్డుకుంటుంది. వాటర్ సప్లై పైపుల్లో నీళ్లు లేకుండా ఖాళీగా ఉంటే, పైపుల నెర్రల నుంచి, పగుళ్ల నుంచి,బలహీనంగా ఉన్న జాయింట్స్ నుంచి, రంధ్రాలనుంచి సులభంగా మురికి నీరు, గ్రౌండ్ వాటర్ సులభంగా ప్రవేశిస్తుంది. కాబట్టి హైదరాబాద్ ప్రజలకు నల్లాల ద్వారా వస్తున్న నీరు మంచిగా ఉండాలంటే హైదరాబాద్ వాటర్ బోర్డ్ (HMWSSB)రోజూ మంచినీళ్లు ఇవ్వాల్సిందే. లేకపోతే, సిటీలో ఎక్కడో ఒకచోట, ఎపుడో అరవై డెబ్బై యేళ్ల కిందట వేసిన పాతపైపులే కొనసాగుచున్నచోట, పైపుల రంధ్రాలనుంచి మురుగనీరు, రసాయనాలు కలసిన గ్రౌండ్ వాటర్ పైపుల్లోకి చేరి ఇండోర్ తరహా ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పాతపైప్ లైన్లు

హైదరాబాద్ చాలా ప్రాంతాల్లో మంచినీళ్లు పైపు లైన్లు, మురుగు పైపులు పాతవే కొనసాగుతున్నాయి. ఇవి పగుళ్లు పడి చాలా సార్లు నీరు లీక్ అవుతూ ఉండటం నగరంలో చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకు మంజీర వాటర్ కు సంబంధించి పైప్ లైన్లు ఎపుడో 1960లో వేశారు. వాటి జీవిత కాలం అరవైయేళ్లే. నీటి సరఫరా ప్రెజర్ పెరిగినపుడు ఈ పైపులు పగిలిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల హైదరాబాద్ వాటర్ బోర్డు తక్కువ ప్రెజర్ తో నీళ్లను సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. ఇలా పైపులు పాతబడినా, నెర్రెలిచ్చినా, జాయింట్స్ వదులయినా, కలుషితమయిన గ్రైండ్ వాటర్, మురుగు నీరు మంచినీళ్ల పైప్ లోకి చేరే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులొకరు చెప్పారు.

దీన్ని హైదరాబాద్ బోర్డు కూడా గుర్తించింది. అందుకే రోజూ మంచినీళ్లు అందించే విషయం గురించి తీవ్రంగాఆలోచిస్తున్నదని అధికారులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో నగరం జనాభా విపరీతంగా పెరుగుతూ ఉంది. నగరం బాగా విస్తరిస్తూ ఉంది. అయినా సరే, నగరానికి సరఫరా అవుతున్న మంచినీళ్లు ఆ ఆవసరాలకు తగ్గట్టు పెరగ లేదు. ఈ నేపథ్యంలో మంచినీళ్ల కనెక్షన్లు 8 లక్షల నుంచి 14లక్షలకు పెరిగాయంటే హైదరాబాద్ మంచినీళ్ల మీద ఎంత వత్తిడి ఉందో అర్థమవుతుంది.

మరిమంచి నీళ్లు రోజూ విడుదల చేయడం సాధ్యమా?

సాధ్యమే అంటున్నారు అధికారులు.

“హైదరాబాద్ కు అదనంగ మంచినీళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 లను చేపడట్టారు. ఈప్రాజక్టుల వల్ల నగరానికి రోజుకు 30 కోట్ల గ్యాలన్ల నీరు అదనంగా అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రాజక్టులు పూర్తయితే, హైదరాబాద్ లోఉన్న సుమారు 1.30 కోట్ల మందికి రోజూ మంచినీళ్లు విడుదల చేయడం సాధ్యమే,” వాటర్ బోర్డుకు చెందిన సీనియర్ అధికారి ఒకరు ఫెడరల్-తెలంగాణకు తెలిపారు.

గోదావరి ఫేజ్ 2 , పేజ్ 3 ప్రాజక్టులు అందుకే...

రూ.7,360కోట్లతో గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్‌-2, 3, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు గత ఏడాది సెప్టెంబర్ లో గండిపేట వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజక్టుల వల్ల 20 టీఎంసీల గోదావరి జలాలను హైదరాబాద్ సమీపంలోని జంట జలాశయాలకు తీసుకువస్తున్నామని, ఇందులో 15, 16 టీఎంసీలు హైదరాబాద్‌ దాహార్తి తీర్చేందుకు, పరిసర ప్రాంతాల్లోని చెరువులు నింపేందుకు వినియోగిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇందులో మరొక 4, 5 టీఎంసీలు మూసీ ప్రక్షాళనకు వాడనున్నట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ కు రోజుకు 580 నుంచి 600 మిలియన్ గ్యాలన్ల నీరు సరఫరా అవుతున్నది.గోదావరి ఫేజ్ 1 ప్రాజక్టుతో పాటు ఇతర మార్గాల ద్వారా ఈ నీరు అందుతున్నది. గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 పూర్తయితే మరొక 300 మిలియన్ గ్యాలన్ల నీరు అదనంగా అందుతుంది. 2027 నాటికి హైదరాబాద్ మంచినీళ్ల సరఫరా 835 మిలియన్ గ్యాలన్లకు, 2047 నాటికి రోజుకు 1,114 గ్యాలన్ల సరఫరా స్థాయికి చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.



Read More
Next Story