
నాయకులు ఇగోను పక్కనపెట్టాలి: రాహుల్
అనంతగిరి శిక్షణా తరగతుల ముగింపు వేడుకలో రాహుల్ గాంధీ పార్టీ బలోపేతం, క్రమశిక్షణ, నాయకత్వంపై దిశానిర్దేశం చేశారు.
డీసీసీ అధ్యక్షులు అహంకారం పక్కన పెట్టి పార్టీ కోసం పని చేయాలని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అనంతగిరి హిల్స్‌లో జరిగిన శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన ఈ సందేశం ఇచ్చారు. ఒక రోజు పర్యటన కోసం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్న రాహుల్ గాంధీకి శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం ఆయనతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వికారాబాద్‌కు వెళ్లారు.
అక్కడ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తదితరులు స్వాగతం పలికారు. ముందుగా SAP ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రాంగణంలో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఆ తర్వాత అనంతగిరి హరిత హోటల్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ జిజుట్సు మార్షల్ ఆర్ట్స్‌లోని మెళకువలను ప్రదర్శిస్తూ నాయకత్వానికి అవసరమైన క్రమశిక్షణ, నియంత్రణ గురించి వివరించారు. వ్యక్తిగత జీవితంలో కూడా ఆ విలువలను అన్వయించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ సిద్ధాంతాలపై ప్రత్యేకంగా క్లాస్ ఇచ్చారు. పార్టీ బలోపేతమే లక్ష్యమని తెలిపారు. వ్యక్తిగత ఈగోల కంటే పార్టీ ముఖ్యమని చెప్పారు.
ప్రతి డీసీసీ అధ్యక్షుడు మరో పదిమందిని తయారు చేయాలని సూచించారు. పని చేస్తున్న వారిని గుర్తించి ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లపై కూడా ఆయన వివరించారు. పాకిస్థాన్‌కు చైనా మద్దతు ఇస్తోందని, ఇరాన్ వెనుక చైనా, రష్యా ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందు మోదీ పూర్తిగా తలొగ్గారని, ట్రంప్‌కు వ్యతిరేకంగా పని చేయలేరని వ్యాఖ్యానించారు.
శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. అనంతరం రాహుల్ గాంధీ వికారాబాద్ నుంచి హెలికాప్టర్‌లో శంషాబాద్ చేరుకుని, అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారు. పార్టీ భవిష్యత్ వ్యూహాలపై ఈ సమావేశం దిశానిర్దేశం ఇచ్చినట్టుగా కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

