
వాహనాల రిజిస్ట్రేషన్ కు డెడ్ లైన్
డీలర్ దగ్గరనుండి రవాణాశాఖకు ఆన్ లైన్లో రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన దరఖాస్తును పరిశీలించి 48 గంటల్లో ఆమోదించాలన్నదే కొత్త నిబంధన
కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కు రవాణాశాఖ కొత్త నిబంధన అమల్లోకి తెచ్చింది. ఈ నిబంధన అమలైతే వాహనయజమానులకు నిజంగా శుభవార్తనే చెప్పాలి. ఇంతకీ కొత్త నిబంధన ఏమిటంటే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కు రవాణాశాఖ డెడ్ లైన్ విధించింది. డీలర్ దగ్గరనుండి రవాణాశాఖకు ఆన్ లైన్లో రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన దరఖాస్తును పరిశీలించి 48 గంటల్లో ఆమోదించాలన్నదే కొత్త నిబంధన. ఆన్ లైన్లో వచ్చిన దరఖాస్తులో అన్నీ వివరాలు సక్రమంగా ఉంటే 48 గంటల్లోనే ఆమోదించి వాహనానికి కొత్త నెంబర్ ను కేటాయించాల్సిందే. కొత్త నెంబర్ కేటాయించగానే అదేవిషయాన్ని రవాణాశాఖ అధికారులు వాహనాన్ని కొనుగోలుచేసిన యజమానితో పాటు వాహనాన్ని అమ్మిన డీలర్ కు కూడా సమాచారం అందించాలి.
ఒకవేళ దరఖాస్తులో ఏదైనా తప్పులుంటే ఆ విషయాన్ని ప్రస్తావించి వెంటనే ఆన్ లైన్లోనే దరఖాస్తును డీలర్ కు తిప్పిపంపాలి. అలాగే దరఖాస్తును తిప్పిపంపిన విషయాన్ని వాహనయజమానికి సమాచారం అందించాలి. దరఖాస్తులో ఉన్న తప్పును సరిచేసి డీలర్ మళ్ళీ ఆ దరఖాస్తును రెండోసారి రవాణాశాఖకు పంపాల్సిందే. ఈకొత్త నిబంధన మార్చి 13వ తేదీనుండి అందుబాటులోకి వచ్చింది. ఈరోజునుండి దరఖాస్తులను ఆన్ లైన్లో తప్ప ఫిజికల్ గా రవాణాశాఖ అధికారులు తీసుకోరు, తీసుకొచ్చేందుకు లేదు. డీలర్లు రవాణాశాఖకు ఫిజికల్ ఫైళ్ళను తీసుకొస్తే తిరస్కరించాలని రవాణాశాఖ కమిషన్ శాఖలోని అధికారులందరికీ కచ్చితమైన ఆదేశాలను జారీచేశారు.
ఇప్పటివరకు జరుగుతున్నది ఏమిటంటే వాహనాన్ని యజమాని కొనుగోలు చేయగానే సదరు దరఖాస్తులను డీలర్ల నుండి ఒక ఉద్యోగి రవాణాశాఖలోని అధికారుల దగ్గరకు తీసుకుని వెళుతున్నాడు. ఈ నేపధ్యంలోనే డీలర్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ పేరుతో అధికారికంగానే వాహనాల యజమానుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. నిజానికి హ్యాండ్లింగ్ ఛార్జెస్ వసూలుచేయటం తప్పు. నిబంధనల ప్రకారం యజమానికి రవాణాశాఖకు ఎంత ఫీజైతే చెల్లించాలో డీలర్ అంతే తీసుకోవాలి. కాని ఏదో పేరుచెప్పి అధికారికంగా కొత, అనధికారికంగా మరికొంత యజమానుల నుండి తీసుకుంటున్నారు. అదేమని అడిగితే రవాణాశాఖలో అధికారులకు ఇవ్వాలి అని డీలర్లు చెబుతున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి.
యజమానులు డబ్బులు చెల్లించటానికి ఇష్టపడకపోతే ఏదో కారణంతో డీలర్లు వాహనాల రిజిస్ట్రేషన్లలో జాప్యం చేస్తుంటారు. దరఖాస్తులను రవాణాశాఖకు పంపకుండా ఆలస్యం చేస్తున్నారు. దాంతో వేరేదారిలేక వాహన యజమాని ఎంతోకొంత మొత్తాన్ని డీలర్ కు చెల్లించుకోక తప్పటంలేదు. అలాగే రవాణాశాఖలో అధికారులు కూడా డీలర్లు చెప్పినట్లే నడుచుకుంటున్నారనే ఆరోపణలు చాలానే వినబడుతున్నాయి. ఇలాంటి ఆరోపణలను గమనించిన కమిషనర్ కొత్త నిబంధన తెచ్చారు. వాహన రిజిస్ట్రేషన్ కోసం డీలర్లు ఎవరూ దరఖాస్తులను ఫిజికల్ గా రవాణాశాఖకు పంపేందుకు లేదన్నారు. అలాగే వాహనాల రిజిస్ట్రేషన్ కు డెడ్ లైన్ కూడా విధించారు. అంటే 48 గంటల్లో వాహనాల రిజిస్ట్రేషన్ అయితీరాలి.
ఆన్ లైన్లో దరఖాస్తు స్టేటస్ ను యజమాని కూడా చూసుకోవచ్చు. కాబట్టి వాహనాలు కొన్నవారికి ఏదో ఒకటిచెప్పి డీలర్లు మభ్యపెట్టేందుకు లేదు. ఎక్కడైనా తేడావస్తే యజమానులు డీలర్లపైన రవాణాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేయవచ్చు. ఎవరైనా ఫిర్యాదుచేస్తే డీలర్, రవాణాశాఖ అధికారి కమిషనర్ కు సమాధానం చెప్పుకోవాల్సుంటుంది. వాహనాలకు సంబంధించిన నకిలీ లేదా తప్పుడు పత్రాలను సమర్పిస్తే డీలర్లపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని, దరఖాస్తును 7 రోజులకు మించి తమ దగ్గరే పెండింగులో పెట్టినట్లు తేలితే వాహనాలను అమ్మకుండా డీలర్ లాగిన్ ను బ్లాక్ చేస్తామని కమిషనర్ హెచ్చరించారు. మరి కొత్తపద్దతి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

