Medaram Jatara 2026
x

మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు

మేడారం జాతరకు జాతీయ పండగ గుర్తింపు కోరుతూ వినతిపత్రం

మేడారం మహా జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం వినతిపత్రం సమర్పించింది. నేడు సమ్మక్క ప్రతిష్ఠ జరగనుంది.


Click the Play button to hear this message in audio format

‘మేడారం జాతర’ను జాతీయ పండగగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, జుయల్ ఓరమ్‌ను కోరింది. తెలంగాణలో మేడారం జాతర అట్టహాసంగా కొనసాగుతోంది. తొలి రోజు నుంచి సమ్మక్క, సారలక్కను దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు మేడారం‌కు తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం కేంద్రమంత్రులు జుయల్ ఓరమ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా వనదేవతలను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతర గుర్తింపుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రులకు వినతి పత్రాన్ని అందించింది.

అదే సమయంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కూడా మేడారంలో అమ్మవార్లను దర్శించుకున్నారు. జాతర ప్రాముఖ్యతను వివరించి, జాతీయ పండుగగా గుర్తించాలనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముందుకు తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా, మేడారం జాతరలో అత్యంత కీలక ఘట్టం నేడు జరగనుంది. చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠించనున్నారు. ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం ముందుగా చిలకలగుట్టపై పూజలు నిర్వహించి, అక్కడి నుంచి ఊరేగింపుగా సమ్మక్కను గద్దెలకు తీసుకురానున్నారు.

సారలమ్మను కాక వంశీయులు తీసుకురాగా, సమ్మక్కను సిద్ధబోయిన వంశీయులు గద్దెలపైకి తీసుకొస్తారని సమాచారం. ఈ కార్యక్రమంలో చందా వంశీయులు, ఐదు వంశస్తులు, మేడారం గ్రామస్తులు, ఆదివాసీలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. డోలి వాయిద్యాలు, సంప్రదాయాలతో ఉత్సాహంగా ఊరేగింపు సాగనుంది. సమ్మక్క రాక సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ గాలిలోకి 10 రౌండ్లు కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో స్వాగతం పలకడం ఆనవాయితీగా కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్ పూజారులకు పట్టు వస్త్రాలు సమర్పించి స్వాగతం పలకనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ పూజారులను ఆహ్వానించనున్నారు. సమ్మక్క ఆగమనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. స్థానిక మంత్రి సీతక్క జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read More
Next Story