డీఈడీ కోర్సు రద్దు! టీచర్ అర్హతల్లో భారీ మార్పు !
x

డీఈడీ కోర్సు రద్దు! టీచర్ అర్హతల్లో భారీ మార్పు !

డీఈడీ రద్దు, పాస్ మార్కుల పెంపు, ఎప్‌సెట్ రద్దు సహా విద్యా కమిషన్ కీలక సంస్కరణల ప్రతిపాదనలు.


‘డీఈడీ కోర్సును రద్దు చేయండి. టీచర్ కావాలంటే డిగ్రీ, బీఈడీ అర్హతను తప్పనిసరి చేయండి’ తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర విద్య కమిషన్ చేసిన సిఫార్సులు ఇవి. వీటితో పాటు పాస్ మార్కులు, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల, ఎప్‌సెట్ సహా పలు కీలక అంశాలపై సంచలన సిఫార్సులు చేరసింది. కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ‘తెలంగాణ విద్యా విధానం–2026’ నివేదికను సీఎం రేవంత్ రెడ్డికు సమర్పించారు. ఈ నివేదికలో రాష్ట్ర విద్యావ్యస్థలో అనేక మార్పులు సూచించారు. టెన్త్ బోర్డ్, ఇంటర్ బోర్డ్‌ను కలిపేయాలని, నర్సరీ నుంచి పీజీ వరకు ఇంగ్లీషు మీడియం వంటి అంశాలు కూడా ఉన్నాయి.

డీఈడీ రద్దు: టీచర్ అర్హతల కొత్త ప్రమాణాలు

ఇప్పటివరకు ఇంటర్ తర్వాత డీఈడీ పూర్తి చేస్తే ప్రాథమిక టీచర్‌గా అర్హత లభించేది. ఈ విధానాన్ని పూర్తిగా నిలిపివేయాలని కమిషన్ సూచించింది. ఇకపై టీచర్ కావాలంటే డిగ్రీతో పాటు బీఈడీ తప్పనిసరి చేయాలని పేర్కొన్నారు. ప్రీ ప్రైమరీ స్థాయికి డిగ్రీ + బీఈడీ, ప్రైమరీకి పీజీ + బీఈడీ (ప్రైమరీ), హైస్కూల్‌కు పీజీ + బీఈడీ (సెకండరీ) అర్హతలు ఉండాలని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల విషయ పరిజ్ఞానం, బోధనా నైపుణ్యాలు మెరుగుపడతాయని కమిషన్ అభిప్రాయపడింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంపు లక్ష్యమని తెలిపారు.

ప్రమోషన్లలో పనితీరే ముఖ్యం

టీచర్లకు కాలానుగుణంగా లభించే ఆటోమేటిక్ పదోన్నతులను రద్దు చేయాలని నివేదిక సూచించింది. ప్రతి ఐదేళ్లకోసారి పనితీరు సమీక్షించాలని ప్రతిపాదించారు. అంచనాల్లో తక్కువగా ఉన్నవారికి మెరుగుదలకు సమయం ఇవ్వాలని, రెండేళ్లలో మార్పు లేకపోతే సేవల నుంచి తొలగించే విధానం ఉండాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయ వ్యవస్థలో బాధ్యత పెంపొందించడమే లక్ష్యమని కమిషన్ తెలిపింది.

పాస్ మార్కుల పెంపుతో క్వాలిటీ చెక్

ప్రస్తుతం 35 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించే విధానాన్ని మార్చాలని కమిషన్ సూచించింది. స్కూల్, ఇంటర్ స్థాయిలో పాస్ మార్కులను 45 శాతానికి పెంచాలని, డిగ్రీ, పీజీ కోర్సుల్లో కనీసం 50 శాతం మార్కులు రావాలని పేర్కొన్నారు. విద్యార్థుల్లో సబ్జెక్టుపై పట్టును పెంచడం, పోటీతత్వం పెంపొందించడం అవసరమని తెలిపారు. అమలు విధానంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే EAPCETను రద్దు చేయాలని కమిషన్ సిఫారసు చేసింది. ఇంటర్ మార్కుల మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించాలని పేర్కొన్నారు. కోచింగ్ సంస్కృతి వల్ల విద్యార్థులపై పడుతున్న ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. అయితే ABVP ఈ ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మార్కుల మేనిపులేషన్, డిప్లొమా విద్యార్థుల భవిష్యత్తుపై సందేహాలు ఉన్నాయని తెలిపింది.

ప్రైవేట్ విద్యాసంస్థలపై నియంత్రణ

ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీల ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని నివేదిక సూచించింది. వసతులు, మౌలిక సదుపాయాల ఆధారంగా విద్యాసంస్థలను వర్గీకరించి గరిష్ట ఫీజులను ప్రభుత్వం నిర్ణయించాలని పేర్కొన్నారు. కోచింగ్ కేంద్రాలుగా మారిన జూనియర్ కాలేజీలపై చట్ట సవరణలు అవసరమని తెలిపారు. ఫీజుల దోపిడీ అరికట్టడం ప్రధాన లక్ష్యమని కమిషన్ స్పష్టం చేసింది.

ప్రభుత్వ విద్య బలోపేతం కోసం ఐదేళ్లలో 2,000 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని కమిషన్ ప్రతిపాదించింది. ప్రతి స్కూల్‌లో 1,500 మంది విద్యార్థులకు ఒకే ప్రాంగణంలో విద్య అందించాలని సూచించారు. బస్ సౌకర్యం, అల్పాహారం, మిడ్డే మీల్స్, సాయంత్రం స్నాక్స్ సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. బోధన ఇంగ్లిష్ మీడియంలో సాగాలని తెలిపారు.

ఉన్నత విద్యలో పరిపాలనా మార్పులు

యూనివర్సిటీల్లో ఐఏఎస్ అధికారుల బదులు అకడమిక్ అనుభవం ఉన్న ప్రొఫెసర్లనే వీసీలుగా నియమించాలని సూచించారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రద్దు చేసి రెగ్యులర్ విధానంలోకి తీసుకురావాలని పేర్కొన్నారు. ప్రతి యూనివర్సిటీలో కంట్రోలర్ ఆఫ్ అఫిలియేషన్ కార్యాలయం ఏర్పాటు చేయాలని తెలిపారు. ఖాళీ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని సిఫారసు చేశారు.

రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం 18 శాతం విద్యకు కేటాయించాలని కమిషన్ సూచించింది. ఉచిత విద్యను 3 నుంచి 18 ఏళ్ల వయస్సు వరకు విస్తరించాలని ప్రతిపాదించారు. 10, 12 తరగతుల్లో మాత్రమే పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని, 11వ తరగతి బోర్డు పరీక్షను రద్దు చేయాలని పేర్కొన్నారు.

Read More
Next Story