ఢిల్లీ లిక్కర్ స్కాం: కేజ్రీవాల్ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు
x

ఢిల్లీ లిక్కర్ స్కాం: కేజ్రీవాల్ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు

జైలులో ఉన్న తనకు న్యాయ సలహాలు తీసుకునేందుకు సమయం పెంచాలంటూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. జైలులో ఉన్న తనకు న్యాయ సలహాలు తీసుకునేందుకు సమయం పెంచాలంటూ రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో ఆయన పిటిషన్ వేశారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టి వేసింది. ప్రస్తుతం కేజ్రీవాల్ తన లాయర్‌ను వారానికి రెండు సార్లు మాత్రమే కలిసేందుకు కోర్టు అవకాశం ఇచ్చింది. ముఖ్యమంత్రిగా విధులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు వారానికి ఐదు సార్లు లాయర్‌ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని సీఎం తన పిటిషన్‌లో కోరారు. అయితే రిలీఫ్ ఇవ్వడానికి తగిన కారణాలు లేవని పేర్కొంటూ సిబిఐ, ఈడీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా పిటిషన్‌ను తోసిపుచ్చారు.
కేజ్రీవాల్‌పై అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడానికి, సూచనలు ఇవ్వడానికి వారానికి ఒక గంట సరిపోదని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది న్యాయమూర్తికి తెలిపారు. సంజయ్ సింగ్‌పై ఐదు లేదా ఎనిమిది కేసులు మాత్రమే ఉన్నప్పుడు మూడు సమావేశాలకు అనుమతి ఇచ్చిన విషయాన్నిజడ్డికి ఆయన గుర్తు చేశారు.
ప్రతి వారం ఐదుసార్లు తన లాయర్లతో కేజ్రీవాల్ కలవడాన్ని ఈడీ వ్యతిరేకించింది. సంప్రదింపుల కోసం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం కేజ్రీవాల్ న్యాయపర ఇంటర్వ్యూలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించింది.
ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను కోర్టు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. కాగా ఢిల్లీ మద్యం కుంభకోణం మొత్తం కుట్రలో ఆప్ నేత ప్రమేయం ఉందని, పాలసీని రూపొందించడం, అమలు చేయడంలో ఆయన పాత్ర ఉందని ఈడీ ఆరోపిస్తోంది.
Read More
Next Story