
ఢిల్లీలో ఉద్రిక్తత.. పోలీసుల అదుపులోఅభిజీత్ దీప్కే, నేహా బోరా
ఢిల్లీలో ‘లెహ్రా దో తిరంగా’ మార్చ్ ఉద్రిక్తతకు దారితీసింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, నేహా బోరాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీలో ‘లెహ్రా దో తిరంగా’ మార్చ్ ఉద్రిక్తతకు దారితీసింది. జాతీయ జెండా ప్రదర్శనకు పిలుపునిచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, నిరసనలో పాల్గొన్న కార్యకర్త నేహా బోరాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియను రద్దు చేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ, ఇతర యువ కార్యకర్తలు ఈ నిరసనకు పిలుపునిచ్చారు. అక్టోబర్ 16న సాయంత్రం 5 గంటలకు కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌లో జాతీయ జెండాలతో మార్చ్ నిర్వహించాలని నిర్ణయించారు.
అయితే, ఈ కార్యక్రమానికి ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. కన్నాట్ ప్లేస్ పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని స్పష్టం చేశారు. మరోవైపు, న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) సెంట్రల్ పార్క్‌ను రెండు రోజుల పాటు మూసివేసింది. దీంతో మార్చ్ నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది.
ఇటీవల జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన సందర్భంగా సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని న్యాయ కస్టడీకి పంపడంతో ఆ చర్యను నిరసిస్తూ, ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరించాలని కోరుతూ సీజేపీ తాజా మార్చ్‌కు పిలుపునిచ్చింది. మార్చ్‌లో పాల్గొనవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే, తగిన ప్రదేశంలో పరిమిత సంఖ్యలో ప్రజలు జాతీయ జెండాను ప్రదర్శించేందుకు, జాతీయ గీతాన్ని ఆలపించేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. పండుగల సమయంలో వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా చూడాలని స్థానిక వ్యాపార సంఘాలు కోరినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు, జాతీయ జెండా మార్చ్‌పై ఆంక్షలు విధించడాన్ని సీజేపీ వ్యతిరేకిస్తోంది. SIRపై తమ నిరసనను కొనసాగిస్తామని కార్యకర్తలు చెబుతున్నారు. ఈ పరిణామాలతో ఢిల్లీలో ఎన్నికల సంస్కరణలు, నిరసనలకు అనుమతులు, ప్రజాస్వామ్య హక్కులపై చర్చ మరోసారి తెరపైకి వచ్చింది
