
పునర్విభజన 25 యేళ్లు ఆపాల్సిందే... దక్షిణాది నుంచి ద్విముఖ పోరు
చెన్నైలో ‘తిరుగుబాటు’ జెండా
2026 లో జరపతలపెట్టిన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation of Lok Sabha Constituencies) ను 25 ఏళ్లపాటు వాయిదా వేయాల నిన్న చెన్నైలో జరిగిన అఖిల పక్ష సమావేశం (All Party Meeting) కేంద్రాన్నిడిమాండ్ చేసింది. ఇపుడున్న లోక్‌సభ స్థానాలను యథాతథంగా కొనసాగించాలని, ఎంపీ స్థానాల సంఖ్యను ఏమాత్రం తగ్గించడానికి వీల్లేదని సమావేశం డిమాండ్ చేసింది.
డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) నేతృత్వంలోని సంయుక్త కార్యాచరణ కమిటీ (Joint Action Committee) ఈ మేరకు ఒక తీర్మానం కూడా చేసింది. . పునర్విభజనకు వ్యతిరేకంగా, ప్రధాని మోదీ ఎన్డీఎ (NDA)ప్రభుత్వ పెత్తందారీ తనానికి వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపిస్తున్న స్టాలిన్‌కు ఏడు రాష్ట్రాల నుంచి గట్టి మద్దతు లభించింది. స్టాలిన్ ప్రారంభించిన పోరాటంలో మేమూ ఉన్నామంటు అంటూ దక్షిణాదిలోని బీజేపీయేతర పార్టీలకు చెందిన పలువురు సీఎంలు, ప్రముఖులతో పాటు ఏక్కడో దూరాన ఉత్తర భారత దేశంలో ఉన్న పంజాబ్ ముఖ్యమంత్రి కూడా భాగమయ్యారు.
ఇలా కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర దక్షిణాదికి ఉంది. గతంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నాపుడు 1983లో అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు ఇదే పాత్ర పోషించారు. అపుడు హైదరాబాద్ ప్రతిపక్ష ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు వేదిక అయింది. దేశవ్యాపిత కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమం మొదలైంది. ఇపుడు అదే తరహాలోతమిళనాడు రాజధాని నుంచి ‘చెన్నై ధిక్కారం’ మొదలైంది.
ఈ దిశలో శనివారం ఉదయం అక్కడి రూలింగ్ పార్టీ డీఎంకే ఆధ్వర్యంలో మరొక అడుగు పడింది.
“శిక్షించేలా కాదు. న్యాయ సమ్మతంగా పునర్విభజన జరగాల,”అని సమావేశానికి వచ్చిన ముఖ్యమంత్రులు, ఎంపిలు, ఇతర పార్టీల నేతలు ఏకకంఠంతో నినదించారు.
ఈ పోరాటంలో స్టాలిన్ వెంట ఉంటామని పలువురు నేతలు ప్రకటించారు. కేంద్రంతో పోరాడేందుకు ద్విముఖ వ్యూహం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ పోరాటం చేస్తూనే , న్యాయపరమైన కార్యాచరణ కూడా చేపట్టాలని నిర్ణయించారు. దీనికోసం నిపుణులతో కమిటీని ఏర్పాటుచేయాలన్న స్టాలిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంతా ఆమోదించారు.
లోక్‌సభ స్థానాల పునర్విభజనను 25 యేళ్లపాటు వాయిదా వేస్తూ పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని జేఏసీ కోరింది.
‘పునర్విభజన వల్ల నష్టపోతామని ఆందోళన చెందుతున్న రాష్ట్రాలకు చెందిన పార్టీలను ఆహ్వానించి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం జరపాలని కోరింది. అదే సమయంలో పునర్విభజనను వ్యతిరేకిస్తున్న పార్టీలకు చెందిన ఎంపీలతో కోర్ కమిటీని ఏర్పాటుచేసుకుని, పార్లమెంటులో సమన్వయంతోను, స్పష్టమైన వ్యూహంతోను పనిచేయాలని నిర్ణయించింది.
సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (కాంగ్రెస్), కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (సీపీఎం), పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ (ఆప్), కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (కాంగ్రెస్), బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు, , ఒదిశా మాజీ మంత్రి సంజయ్‌కుమార్ దాస్ బుర్మా, అమర్ పట్నాయక్ సింగ్ (బీజేడీ), పంజాబ్ రాష్ట్ర శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సర్దార్ బల్వీందర్ సింగ్, దల్జిత్‌సింగ్ సీమా, సీపీఐ కేరళ రాష్ట్ర కార్యదర్శి బినోయ్ విశ్వం, కాంగ్రెస్ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు కె.సుధాకరన్, ముస్లిం లీగ్ నేత పీఎంఏ సలామ్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు ఎన్‌కే ప్రేమ్‌చంద్రన్, ఎంఐఎం ప్రతినిధి ఇంతియాజ్ జలీల్, కేరళకాంగ్రెస్ (మణి) ప్రతినిధి జోస్ కె.మణి, కేరళ కొట్టాయం కాంగ్రెస్ ఎంపీ జార్జి కె.ఫ్రాన్సిస్ పాల్గొన్నారు. బీజేడీ అధినేత, ఒదిశా మాజీ సీఎం నవీన్‌పట్నాయక్ వీడియోసందేశం పంపారు. ఆంధ్రపదేశ్ వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి మద్దతు లేఖ పంపించారు.