బాసర నుంచి భద్రాచలం వరకు పుష్కర ఘాట్ల అభివృద్ధి
x
గోదావరి తీరంలో భద్రాచలం దేవాలయం చెంత పుష్కరఘాట్

బాసర నుంచి భద్రాచలం వరకు పుష్కర ఘాట్ల అభివృద్ధి

2026-27 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రతిపాదించారు.


12 ఏళ్లకు ఒకసారి జరిగే గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత సన్నాహాలు ప్రారంభించింది. 2027లో జరగనున్న ఈ మహోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన దేవాలయాలు, పుష్కర ఘాట్ల అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేస్తోంది.2027 గోదావరి పుష్కరాలను రాష్ట్ర ఆధ్యాత్మిక చరిత్రలో చిరస్మరణీయంగా నిలపాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. రోజుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతుల విస్తరణ, ఘాట్ల నిర్మాణం, దేవాలయాల అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది.

పుష్కరాల కోసం తెలంగాణలోని బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి నదీ తీరం వెంట ఉన్న ప్రముఖ దేవాలయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలం దేవాలయాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు. కుంభమేళాను తరహాలో ఈ సారి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. రోజుకు రెండు లక్షల మంది భక్తులు పుష్కర ఘాట్లకు వచ్చినా పుష్కర స్నానాలకు ఎలాంటి అంతరాయం లేకుండా సౌకర్యాలు కల్పించాలని సీఎం కోరారు.

ధర్మపురి ఆలయం వద్ద గోదావరి తీరంలో స్నానఘట్టం

రూ.530 కోట్లతో దేవాదాయ శాఖ ప్రతిపాదనలు

గోదావరి తీరంలోని బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం వంటి ప్రధాన మత ప్రదేశాలతో పాటు చిన్న దేవాలయాల సమీపంలో స్నాన ఘాట్ల నిర్మాణం, దేవాలయాల మరమ్మత్తు పనులు చేపట్టాలని నిర్ణయించారు. 12 రోజుల పుష్కరాల నిర్వహణ కోసం నిధులు కోరుతూ ప్రతిపాదనలను రాష్ట్ర ఆర్థికశాఖకు పంపారు. గత ఏడాది బడ్జెట్ లో గోదావరి పుష్కరాలకు రూ.175 కోట్లను కేటాయించినా, కేవలం రూ.50కోట్లనే విడుదల చేశారు. ఈ నిధులతో గోదావరి తీరంలో స్నానఘట్టాలను అభివృద్ధి చేయనున్నారు.
తెలంగాణలో గోదావరి పుష్కరాల కోసం 2026-27 రాష్ట్ర బడ్జెట్ లో రూ.530 కోట్లను కేటాయించాలని తెలంగాణ దేవాదాయ శాఖ ప్రతిపాదించింది.

కేంద్రానికి ప్రతిపాదనలు

గోదావరి పుష్కరాలకు నదీ తీరంలో పుష్కర ఘాట్లను విస్తరించడంతోపాటు రోడ్లు, వసతుల కల్పనకు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ నిధులు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్ పథకాల కింద నిధులు కేటాయించాలని సర్కారు కేంద్రానికి ప్రతిపాదించింది. పర్యాటక, నీటిపారుదల, దేవాదాయ శాఖల అధికారులు పుష్కరాలకు సన్నాహాలు చేయాలని సీఎం ఇటీవల ఆదేశించారు.
అవసరమైన నిధులు సమయానికి విడుదలైతే 2027 గోదావరి పుష్కరాలు తెలంగాణ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే వేడుకగా నిలవనున్నాయి. కేంద్ర–రాష్ట్ర సమన్వయంతో పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఇప్పుడు అన్ని శాఖల సమిష్టి కృషితో గోదావరి పుష్కరాలు విజయవంతంగా నిర్వహించబడతాయా అన్నదానిపై అందరి దృష్టి నిలిచింది.
Read More
Next Story