
కాలినడకన శ్రీశైలం వస్తున్న కర్ణాటక భక్తులు
ఎక్కువ మంది భక్తులు శ్రామికులు, రైతులు, అల్పాదాయ వర్గాల వారే
శ్రీశైలం ఉగాది ఉత్సవాలలో పాల్గొనేందుకు, మొక్కుబడులు చెల్లించుకునేందుకు కాలినడకన, కంబి(పల్లకి)లలో,కర్ర కాళ్ల మీద నడుచుకుంటూ అలసటు అనేది తెలియకుండా వేలాది మంది శివభక్తులు శ్రీశైలం చేరుకుంటున్నారు. తప్పెట దరువులు వేస్తూ దారిపొడవునా కుంకుమ చల్లుకుంటూ, చిందులు వేస్తూ కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈ శివభక్తులతో శ్రీశైలం తరలి వస్తున్నారు. నల్లమల అడవుల్లో వారి కోలాహలం మిన్నుముట్టింది. విచిత్రమేమిటంటే ఈ భక్తుల్లో 90 శాతం మంది శ్రామికులు, పేద వర్గాల వారే.
ఆంధ్రప్రదేశ్ శ్రీశైల మహాక్షేత్రంతో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు కర్ణాటక నుండి వేలాది మంది భక్తులు పాదయాత్రగా తరలి వస్తారు. భక్తులు ప్రధానంగా హైదరాబాద్-కర్నాటక ప్రాంతం నుంచి తరలి వస్తున్నారు.
మార్చి 16-20 మధ్య జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా, భ్రమరాంబికా దేవిని తమ ఆడపడుచుగా భావిస్తూ చీరసారెలు సమర్పించేందుకు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు నల్లమల అడవి మార్గంలో కాలినడకన క్షేత్రానికి చేరుకుంటున్నారు.
మండటెండలో, నల్లమల అడవిలో ఎదురయ్యే, కొండలు గుట్టలు లోయలు లెక్క చేయకుండా లెక్కచేయకుండా భక్తులు వందల కిలోమీటర్లు నడిచి వస్తున్నారు. కర్నాటకలోని రాయచూడు, హుబ్లీ, హసన్, గుల్బర్గా ప్రాంతాలనుంచి ఈ భక్తులు సు మారు నాలుగు వందల కిలోమీటర్లు నడస్తూ చేరుకుంటారు. శ్రీశైలం క్షేత్రం, నల్లమడ అడవులు కన్నడ భక్తుల జయజయధ్వానాలతో, 'ఓం నమఃశివాయ' స్మరణతో మార్మోగిపోతున్నది.
అడవిలో నాగలూటి వీరభద్రేశ్వర గుడి వద్ద, భీమునికొలను, పెచ్చెరువు గ్రామాల వద్ద వీళ్ల కోసం భోజన ఏర్పాట్లు ఉన్నాయి. మహారాష్ట్ర భోజన ట్రస్టు నాగలూటి వద్ద చపాతి యంత్రాల ద్వారా రోజూ వేలాది మందికి భోజనం అందించింది.
కొందరు భక్తులు తనకంటే పొడవైన కర్రకాళ్ల మీద మీద వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వందలాది కిలోమీటర్లు నడుచుకుంటూ నల్లమల అడవుల్లో వృద్ధులు, మహిళలు, చంటిపిల్లల తల్లులు సైతం పాదయాత్ర చేసుకుంటూ తరలివస్తున్నారు. వీరి కోసం మహారాష్ట్ర కు చెందిన ఒక ట్రస్టు అడవిలో భోజన ఏర్పాట్లు చేసింది.
ఇంట్లో జబ్బు పడిన వారికి ఆరోగ్యం మెరుగైతే శ్రీశైలం వస్తామని మొక్కుకుని వస్తుంటారు. ఈ ఏడాది ఒక భక్తుడు మొక్కుబడితో పెంపుడు కుక్కకు జబ్బు నయమైందని కుక్కతో సహా పాదయాత్రం చేసుకుంటూ శ్రీశైలం చేరుకున్నాడు.

