
మేడారం జాతరలో కొత్త భద్రతా చర్యలు: డీజీపీ
మేడారం జాతరలో భక్తుల భద్రత కోసం కొత్తగా చైల్డ్ ట్రాక్ సిస్టం అమలు చేస్తున్నారు. డీజీపీ శివధర్‌రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు.
ఈసారి మేడారం జాతర మరింత భద్రతతో జరుగుతోందని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. భక్తుల భద్రతకు తాము పెద్దపీట వేస్తున్నామని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆదివాసీల సహకారంతో పోలీసులు జాతరలో ఉత్సాహంగా విధులు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. డీజీపీ ముందుగా వనదేవతలను దర్శించుకున్నారు. అనంతరం కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించి సీసీ ఫుటేజీల ద్వారా జాతరలో భక్తుల రద్దీ, జాతరకు వచ్చే మార్గాల్లో ట్రాఫిక్ పరిస్థితిని పరిశీలించారు.
గత జాతరల్లో పిల్లలు, వృద్ధులు తప్పిపోయినప్పుడు వారి అచూకీ తెలుసుకోవడంలో ఆలస్యం జరిగేదని డీజీపీ తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఈసారి కొత్తగా చైల్డ్ ట్రాక్ మేనేజ్‌మెంట్ సిస్టంను అమలు చేస్తున్నట్లు వివరించారు. ఈ విధానంలో పిల్లలు, వృద్ధుల చేతులకు హ్యాండ్ బ్యాండ్‌లు వేస్తున్నట్లు చెప్పారు. వాటిలో ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా తప్పిపోయిన వారిని సులభంగా గుర్తించే అవకాశం ఏర్పడిందని తెలిపారు. దీనివల్ల బాధిత కుటుంబాలకు మాత్రమే కాకుండా పోలీస్ శాఖకు కూడా సంతృప్తి కలుగుతున్నట్లు పేర్కొన్నారు.
జాతరలో విధులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న ట్రైయినీ ఐపీఎస్ అధికారులు, డీఎస్పీలకు కూడా బాధ్యతలు కేటాయించి పని అనుభవం కల్పిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. 1996లో తాను ట్రైయినీ ఐపీఎస్‌గా ఉన్న సమయంలో మేడారం జాతరకు వచ్చినట్లు డీజీపీ గుర్తు చేశారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు జాతర నిర్వహణలో అనేక మార్పులు వచ్చాయని చెప్పారు.
జాతరకు వచ్చే అన్ని మార్గాల్లో రోడ్లను వెడల్పు చేయడం, ప్రత్యామ్నాయ దారులు ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ జామ్ సమస్య తగ్గినట్లు తెలిపారు. డ్రోన్ల వినియోగంతో జాతరలో ప్రతి మూల జరుగుతున్న కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు.
ఈ సమీక్షలో డీజీపీ వెంట మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తదితర అధికారులు పాల్గొన్నారు. మేడారం జాతరలో భక్తులకు భద్రతతో పాటు సౌకర్యాలు కల్పించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

