మావోయిస్టు గణపతికి లొంగిపోవాలని డీజీపీ పిలుపు
x

మావోయిస్టు గణపతికి లొంగిపోవాలని డీజీపీ పిలుపు

ఆపరేషన్ కగార్ ముగింపు దశలో మావోయిస్టు నేత గణపతికి లొంగిపోవాలని, చికిత్స అందిస్తామని డీజీపీ తెలిపారు.


ఆపరేషన్ కగార్ డెడ్‌లైన్ ముగియనున్న వేళ తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి అనారోగ్యంతో ఉన్నట్లు సమాచారం అందిందని తెలిపారు. ఆయన లొంగిపోతే హైదరాబాద్‌లోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో మెరుగైన వైద్య చికిత్స అందిస్తామని చెప్పారు. ఆయుధాలను వదిలి సాధారణ జీవితంలోకి రావాలని, కుటుంబాలకు చేరువ కావాలని డీజీపీ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపుతో గత రెండేళ్లలో 721 మంది మావోయిస్టులు లొంగిపోయారని గుర్తుచేశారు.

వీరిలో వివిధ స్థాయిల నాయకులు, కేడర్ ఉన్నారని తెలిపారు. లొంగిపోయిన వారు వందలాది ఆయుధాలను కూడా అప్పగించారని వివరించారు. ఇంకా కొంతమంది మావోయిస్టులు ప్రభుత్వానికి లొంగకుండా అజ్ఞాతంలో ఉన్నారని తెలిపారు. తెలంగాణకు చెందిన ఆరుగురు కీలక వ్యక్తులు ఇంకా బయట ఉన్నారని చెప్పారు. మొత్తం కేడర్‌ను కలుపుకుంటే రాష్ట్రానికి చెందిన 38 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసుల రికార్డులు సూచిస్తున్నాయని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ మార్చి 31తో ముగియనుంది. మావోయిస్టు కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ దిశగా ఇప్పటికే పలుమార్లు తమ లక్ష్యాన్ని వెల్లడించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఆపరేషన్ ముగింపు దశకు చేరుకోవడంతో, కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలపై ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.

Read More
Next Story