
ధరణి దందా బహిర్గతం.. వేల ఎకరాల అక్రమాలు వెలుగు
ధరణి వ్యవస్థలో లోపాలు, అక్రమాలపై ప్రభుత్వం స్పందించి భూసర్వే, సంస్కరణలతో పరిష్కారానికి కసరత్తు ప్రారంభించింది.
ధరణి పోర్టల్‌తో భారీ దందా జరిగిందంటూ శాసన మండలిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. భూభారతితో రాష్ట్రంలోని భూ సమస్యలకు పరిష్కారం అందించే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. గతంలో ధరణి పోర్టల్‌తో వేల ఎకరాల అక్రమాలు జరిగాయని, అవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయని పొంగులేటి పేర్కొన్నారు. భూమి లేకపోయినా రికార్డుల్లో ఉండటం, పాస్‌బుక్లు ఆధారంగా ప్రభుత్వ పథకాలు పొందటం వంటి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ధరణి వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులకు కూడా పట్టా పాస్‌బుక్లు ఉండటం వంటి విచిత్ర పరిస్థితులు ఉన్నాయని చెప్పారు.
నాగార్జునసాగర్ పరిధిలో నిర్వహించిన సర్వేలో భారీ అక్రమాలు బయటపడ్డాయని వెల్లడించారు. మొత్తం 8600 ఎకరాల్లో 1250 ఎకరాలకు భూమి లేకపోయినా రికార్డుల్లో ఉండి రైతుబంధు, రైతు భరోసా పొందినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఇలాంటి లోపాలను పూర్తిస్థాయి భూసర్వే ద్వారా గుర్తించి సరిచేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి రెవెన్యూ గ్రామంలో జీపీఓ వ్యవస్థను ఏర్పాటు చేసి సర్వే నంబర్లను గుర్తించి ఎమ్మార్వోకు సమాచారం అందించే విధానం అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఇక సాధాబైనామ సమస్యపై కూడా కీలక మార్పులు చేశారు. జీవో నంబర్ 76 ద్వారా కొనుగోలుదారులు ఇక అమ్మకందారుల అఫిడవిట్ అవసరం లేకుండా స్వీయ ప్రకటనతోనే పరిష్కారం పొందే అవకాశం కల్పించారు. గతంలో 9 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, వాటికి శాశ్వత పరిష్కారం చూపేందుకు భూ భారతి చట్టం తీసుకువచ్చినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎదురైన సమస్యలను దృష్టిలో పెట్టుకుని నిబంధనలను సవరించినట్లు చెప్పారు.
ఇంకా రాష్ట్రవ్యాప్తంగా 413 గ్రామాల్లో దశాబ్దాలుగా భూసర్వే జరగకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తించారు. కోర్టుల చుట్టూ తిరగలేక అనేక సమస్యలు ఎదురైనట్లు తెలిపారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం భూసర్వే చేపట్టిందని వెల్లడించారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద ఐదు గ్రామాల్లో సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. భూములకు ఆధార్‌లా భూధార్ కార్డులు జారీ చేస్తున్నట్లు చెప్పారు. మిగిలిన 408 గ్రామాల్లో సర్వే దాదాపు పూర్తయిందని తెలిపారు.
త్వరలోనే 32 జిల్లాల్లో ప్రతి జిల్లాకు 70 గ్రామాలను ఎంపిక చేసి సర్వే పూర్తి చేసి భూధార్ కార్డులు అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. భూసమస్యలను సమగ్రంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తుందని మంత్రి తెలిపారు.

