
ఐపీఎస్ లను బీఆర్ఎస్ టార్గెట్ చేసిందా ?
ప్రభుత్వంలో పాలకులు మారారు కాని ఉన్నతాధికారులు మారలేదన్న విషయాన్ని కేటీఆర్, హరీష్ తదితరులు గుర్తుంచుకోవాలి
రాజకీయ చదరంగంలో అధికార యంత్రాంగమే చివరకు బలవుతుంటుంది. ఎందుకంటే అన్నీ వ్యవస్ధల్లోకి రాజకీయ వ్యవస్ధే అత్యంత బలమైనది కాబట్టి. అధికారంలో ఎవరున్నా చివరకు టార్గెట్ గా మారుతున్నది మాత్రం ఉన్నతాధికారులే. ఇపుడు విషయం ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న హైదరాబాద్ కమిషనర్(VC Sajjanar) వీసీ సజ్జనార్, డీజీపీ బీ శివధర్ రెడ్డి(DGP Sivadhar Reddy)తో పాటు మరికొందరు ఐపీఎస్, కొందరు ఐఏఎస్ అధికారులను బీఆర్ఎస్(BRS) కీలకనేతలు(KTR) కేటీఆర్, హరీష్(Harish) తదితరులు పదేపదే టార్గెట్ చేస్తున్నారు. తమపైన తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నవారు ఎక్కడున్నా తాము అధికారంలోకి రాగానే పట్టుకొచ్చి విచారించి శిక్షలు వేస్తామని బెదిరిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే అధికారంలో ఎవరుంటే వారు చెప్పినట్లుగా వినటానికి అధికారయంత్రాంగం అలవాటుపడిపోయింది.
ఇపుడు కేటీఆర్, హరీష్ బెదిరిస్తున్న సజ్జనార్, శివధర్ రెడ్డిలు బీఆర్ఎస్ హయాంలో కూడా కీలకమైన పోస్టింగుల్లోనే ఉన్నారు. సజ్జనార్ ఆర్టీసీ ఎండీగాను, శివధరెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. అధికారయంత్రాంగాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్నది ముఖ్యమంత్రి ఇష్టం. తప్పుడు పనులకు వాడుకుంటే అధికారంలో నుండి దిగిపోయిన తర్వాత సమస్యల్లో ఇరుక్కోక తప్పదని అందరికీ తెలుసు. ఇపుడు ట్యాపింగ్ కేసులో ఇరుక్కున్న ఇంటెలిజెన్స్ మాజీ బాస్ టీ ప్రభాకరరావుతో పాటు మరో నలుగురు పోలీసు అధికారులే సాక్ష్యం.
ప్రభాకరరావు కూడా సప్తసముద్రాలు దాటి అమెరికాలో గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకుని సెటిల్ అయిపోదామని అనుకున్నా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇల్లీగల్ ట్యాపింగ్ కేసు నమోదవటం, కేసీఆర్, కేటీఆర్, హరీష్ విచారణకు హాజరవటాన్ని తట్టుకోలేకపోతున్నారు. శిక్షలు తప్పవేమో అన్న భయంతోనే ఇపుడు రేవంత్ ప్రభుత్వంతో పాటు ఐపీఎస్ లను బెదిరిస్తున్నారా అనే అనుమానలు పెరిగిపోతున్నాయి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అధికారులు అంటే ఐఏఎస్, ఐపీఎస్ కావచ్చు లేదా ఇతర సీనియర్ అధికారులు కూడా కావచ్చు ప్రభుత్వం ఏమిచెబితే అది చేయటానికి అలవాటు పడిపోయారు. పాలకులు ఆదేశాలను పాటించటానికే తామున్నది అన్నట్లుగా అధికార వ్యవస్ధ తయారైంది. కాబట్టి అధికారులు ఎలాగ పనిచేస్తున్నారు అన్నది పాలకుల నిర్ణయాలపైన ఆధారపడుంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టెలిఫోన్ ట్యాపింగ్ నే తీసుకుంటే వేలాది ఫోన్లు బీఆర్ఎస్ హయాంలో ట్యాప్ అయ్యాయన్నది నిజం. పలానా నెంబర్లను ట్యాప్ చేయాలని పాలకుల నుండి అప్పటి ఇంటెలిజెన్స్ బాస్ కు ఆదేశాలు వచ్చేవి. వచ్చే ఆదేశాలన్నీ నోటిమాట ద్వారానో లేకపోతే మరొకరిని పంపించో చెప్పించేవారు. అంటే రాతమూలకంగా పాలకులు ఎప్పుడూ ఆదేశాలు ఇవ్వలేదు.
తమకు అందే ఆదేశాలన్నీ రాతమూలకంగానే ఇవ్వాలని అప్పటి ఇంటెలిజెన్స్ బాస్ టీ ప్రభాకరరావు ఎందుకు పాలకులను అడగలేదు. నోటిమాట ద్వారా వచ్చే ఆదేశాలను పాటించాల్సిన అవసరం ఏమిటి ? ఏమిటంటే కీలకమైన పోస్టింగులో ఉండాలన్న అధికారుల కోరిక. ప్రతి అధికారికీ తాను కీలకమైన పోస్టింగులోనే ఉండాలి, అధికారాలు చెలాయించే పోస్టుల్లోనే ఉండాలనే కోరిక బలంగా ఉంటుంది. అధికారుల్లోని ఈ కోరికను పాలకులు అడ్వాంటేజ్ గా తీసుకుని వాళ్ళతో చేయకూడని పనులన్నీ చేయిస్తారు. ప్రభుత్వాలు మారినపుడు విచారణ జరిగితే చివరకు తగులుకునేది అధికారులే కాని పాలకులు కాదు. ఈ విషయాలు ఐఏఎస్, ఐపీఎస్ తో సహా అందరికీ తెలిసినా అధికారుల మైండ్ సెట్ మారటంలేదు.
ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా సరే వెళతానని, నిబంధనలకు విరుద్ధంగా వచ్చే ఆదేశాలను పాటించనని ఉన్నతాధికారులు తెగేసిచెబితే పాలకులు ఏమీచేయలేరు. అలా చెప్పగలిగిన అధికారులు చాలా తక్కువమంది ఉంటారు. ఉన్నతాధికారుల్లోని బలహనీతలను పాలకులు అడ్వాంటేజ్ గా తీసుకుని రెచ్చిపోతుంటారు. ఫార్ములా కార్ రేసు కేసులో కూడా ఇలాగే జరిగింది. కేటీఆర్ చెప్పిన వాటన్నింటికీ తలపూటంతోనే సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ఇపుడు కేసుల్లో తగులుకుని విచారణలను ఎదుర్కొంటున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కూడా ప్రైవేటు కంపెనీదే పై చేయి కావటంతో ఇంజనీర్ ఇన్ చీఫ్ లు, చీఫ్ ఇంజనీర్లు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు. తాము ప్రాజెక్టును విజిట్ చేయటం, లోపాలను ఎత్తి చూపటం లాంటివి ఏమీ చేయలేదు.
ఎందుకంటే పాలకులు ప్రైవేటు కంపెనీలకు వత్తాసుగా ఉండటంతో ఉన్నతస్ధాయిలోని ఇంజనీరింగ్ అధికారులు తమకెందుకు వచ్చిందని దూరంగా ఉండిపోయారు. ఫలితంగా నిర్మించిన మూడేళ్ళకే కాళేశ్వరం కుప్పకూలి వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిపోయింది.
ఇపుడు విషయానికి వస్తే తమ అవినీతి లేదా అవకతవకలు బయటపడుతున్నాయన్న ఆక్రోసంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కీలక నేత హరీష్ రావు తదితరులు నానా రచ్చచేస్తున్నారు. ఇందులో భాగంగానే ఐపీఎస్ అధికారులు సజ్జనార్, డీజీపీ బీ శివధర్ రెడ్డిని పదేపదే బెదిరిస్తున్నారు. ఇదే సజ్జనార్, శివధర్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలో సైబరాబాద్ కమిషనర్, ఆర్టీసీ ఎండీగాను, ఇంటెలిజెన్స్ చీఫ్ గాను పనిచేశారు. అప్పట్లో ఈ ఇద్దరు ఉన్నతాధికారులు బ్రహాండంగా పనిచేసినట్లు లెక్క. ఎందుకంటే అప్పటి పాలకులు చెప్పింది చెప్పినట్లు చేశారు కాబట్టి వీళ్ళు బ్రహ్మండం.
2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సజ్జనార్ ను హైదరాబాద్ కమిషనర్ గా నియమించటమే కాకుండా శివధర్ రెడ్డిని డీజీపీగా నియమించింది. వీళ్ళిద్దరు హైదరాబాద్ కమిషనర్ గా, డీజీపీగా నియమితులు కాకముందే రేవంత్ ప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటుచేసింది. ప్రభుత్వం బీఆర్ఎస్ కీలకనేతలపై తప్పుడు కేసులు పెట్టలేదు. బీఆర్ఎస్ హయాంలో ట్యాపింగ్ జరిగింది అనేందుకు చాలా రుజువులున్నాయి. అయితే వాటిల్లో దేనిలోను ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్ రాతమూలకంగా ఆదేశాలు లేవు. అందుకనే ట్యాపింగ్ కేసు ఇపుడు ఇంత సంచలనంగా మారింది.
అరెస్టయిన పోలీసు అధికారుల వాగ్మూలాలతో తాము ఎక్కడ ఇరుక్కుంటామో అన్న భయంతోనే కేటీఆర్, హరీష్ తదితరులు సజ్జనార్, శివధరరెడ్డిని పదేపదే బెదిరిస్తున్నారు. భయపెట్టి వాళ్ళని తమ అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. అందుకనే సజ్జనార్ కూడా అంతే ధీటుగా వ్యవహరిస్తున్నారు. విచారణ పూర్తికాగానే ఇల్లీగల్ ట్యాపింగ్ కేసు విచారణలో కేసీఆర్ విచారణ పూర్తయినట్లు సజ్జనార్ చేసిన ట్వీట్ పై కేటీఆర్, హరీష్ నానా గోలచేశారు. అక్రమ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ పూర్తయ్యిందని సజ్జనార్ ఎలాగ చెబుతారంటు గోలచేశారు. సజ్జనార్ ఏమన్నా కోర్టా ? అంటు మండిపడ్డారు.
అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే కేసే నమోదైందే అక్రమ ట్యాపింగ్ కేసని. బీఆర్ఎస్ హయాంలో చట్టబద్దంగా ట్యాపింగ్ జరిగుంటే ఇపుడు కేసులు, విచారణలే ఉండేవి కావుకదా. సెలబ్రిటీలు, జడ్జీలు, వాళ్ళ కుటుంబసభ్యులు, జర్నలిస్టులు, రాజకీయ ప్రత్యర్ధులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తల ఫోన్లను మావోయిస్టులు లేదా మావోయిస్టు మద్దతుదారులు, సింపథైజర్లు అనే ముద్రవేసి ట్యాపింగ్ చేశారంటేనే అక్రమ ట్యాపింగ్ అని తెలిసిపోతోంది. చివరకు కేసీఆర్ కూతురు కవిత, ఆమె భర్త ద్యావనపల్లి అనీల్ కుమార్ తో పాటు కొంతకాలం హరీష్ రావు, ఈటల రాజేందర్ ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారు. జరిగిన ట్యాపింగ్ అంతా ఇల్లీగల్ గా జరిగింది కాబట్టే కేసు కూడా ఇల్లీగల్ టెలిఫోన్ ట్యాపింగ్ అయ్యింది. దీన్నే సజ్జనార్ ట్వీట్లో చెప్పారంతే.
పదేపదే ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేయటం ద్వారా కేటీఆర్, హరీష్ తదితరుల్లోని ఆందోళన అర్ధమైపోతోంది. తాము ఎలాంటి తప్పుచేయకపోతే రేవంత్ ప్రభుత్వం, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై నోటికొచ్చినట్లు మాట్లాడాల్సిన అవసరంలేదు. బీఆర్ఎస్ హయాంలో ఉన్నతాధాకారులు పాలకులు చెప్పింది చేసినట్లుగానే ఇపుడు రేవంత్ ప్రభుత్వం చెప్పింది చేస్తున్నారు. ప్రభుత్వంలో పాలకులు మారారు కాని ఉన్నతాధికారులు మారలేదన్న విషయాన్ని కేటీఆర్, హరీష్ తదితరులు గుర్తుంచుకోవాలి.
టార్గెట్ చేయటం చాలా తప్పు : మురళీధర్
డీఐజీ, అంబర్ పేట పోలీసు ట్రైనింగ్ కాలేజీలో ప్రిన్సిపాల్ గా రిటైర్ అయిన జన్నుమహంతి మరళీధర్ ఏమన్నారంటే ఉన్నతాధికారులను టార్గెట్ చేయటం చాలా తప్పన్నారు. తెలంగాణ ఫెడరల్ తో మురళీధర్ మాట్లాడుతు
‘‘బీఆర్ఎస్ హయాంలో కూడా అధికారులను ఇష్టం వచ్చినట్లు వాడుకున్నారు’’ అని చెప్పారు. ‘‘ఇప్పటి డీజీపీ శివధర్ రెడ్డిని అప్పుడు కేసీఆరే ఇంటెలిజెన్స్ చీఫ్ వాడుకున్నారు అని గుర్తుచేశారు. ‘‘అయితే ఏవో కారణాల వల్ల పాలకులతో శివధర్ రెడ్డికి పడకపోవటంతో 6 ఏళ్ళపాలనలో శివధరరెడ్డిని ప్రభుత్వం ఐజీ పర్సనల్ అనే లూప్ లైన్ పోస్టులోనే ఉంచేసింది’’ అని చెప్పారు.
‘‘బీఆర్ఎస్ హయాంలో శివధరరెడ్డిని బాగా హెరాస్ చేశారు’’ అని కూడా చెప్పారు. ‘‘సజ్జనార్ బీఆర్ఎస్ పాలనలో సైబరాబాద్ కమిషనర్ గా, ఆర్టీసీ ఎండీగా కూడా పనిచేశారు’’ అని తెలిపారు. ‘‘ఈ ఇద్దరికీ కాంగ్రెస్ ప్రభుత్వం కీలకపోస్టింగులు ఇవ్వటం బీఆర్ఎస్ కు నచ్చలేదేమో’’ అనే అనుమానాన్ని వ్యక్తంచేశారు.
‘‘సిట్ చీఫ్ గా కేసీఆర్ ను విచారించారంటే ప్రభుత్వ ఆదేశాలు కాబట్టే విచారించారని స్పష్టంచేశారు’’. ‘‘అంతమాత్రాన సజ్జనార్, శివధర్ రెడ్డిని టార్గెట్ చేయటం తప్పు’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘ఐపీఎస్ అధికారులపైన బ్లాక్ మెయిలింట్ పద్దతులను బీఆర్ఎస్ నేతలు ఉపయోగిస్తున్నారు’’ అని మురళీధర్ మండిపడ్డారు.
తెలంగాణను సొంతానికి ఉపయోగించుకున్నారు : శాస్త్రి
‘‘తెలంగాణను సొంతానికి ఉపయోగించుకుంటున్నారు అనేందుకు మేడిగడ్డ ప్రాజెక్టును అత్యంత ప్రమాధకరమైన ప్రాజెక్టుగా తేల్చిచెప్పటమే ఉదాహరణ’’ అని రిటైర్డ్ ఐటి అధికారి సాయి ప్రసాద్ శాస్త్రి చెప్పారు.
‘‘జస్టిస్ ఘోష్ కమిషన్ కూడా కేసీఆర్, హరీష్ ను తప్పుపట్టడాన్ని బీఆర్ఎస్ ముఖ్యులు తట్టుకోలేకపోతున్నారు’’ అని అబిప్రాయపడ్డారు. ‘‘బీఆర్ఎస్ పాలకులు చెప్పబట్టే అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ టీ ప్రభాకరరావు అక్రమంగా టెలిఫోన్ ట్యపింగ్ చేసి ఇపుడు కేసులో తగులుకున్నారు’’ అని చెప్పారు.

