గాంధీ మునిమనవడు బీఆర్‌ఎస్ ట్రాప్‌లో పడ్డారు: రేవంత్
x

గాంధీ మునిమనవడు బీఆర్‌ఎస్ ట్రాప్‌లో పడ్డారు: రేవంత్

తుషార్ గాంధీ వ్యాఖ్యలపై సీఎం వివరణ, మూసీ ప్రాజెక్టు, విద్యా మార్పులు, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై వివరాలు.


గాంధీ సృతివనం ప్రాజెక్ట్‌కు గాంధీ మునిమనవడు వ్యతిరేకించారు. దీంతో ఈ విషయం మరింత వేడెక్కింది. గాంధీ మునిమనవడే వద్దంటున్నా రేవంత్ ఎందుకు మొండి పట్టు పడుతున్నారన్న చర్చలు కూడా జరుగుతూనే ఉన్నాయి. కేవలం ప్రతిపక్షాలు వద్దంటున్నాయ్ కాబట్టే.. రేవంత్ ఇంతలా పట్టుపడుతున్నారన్న వాదన కూడా వినిపించింది. అయితే తాజాగా గాంధీ విగ్రహ ప్రాజెక్ట్‌ను తుషార్ గాంధీ వ్యతిరేకించడంపై రేవంత్ రెడ్డి స్పందించారు. గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ.. బీఆర్ఎస్‌లో ట్రాప్‌లో పడ్డారని, అందుకే అలా మాట్లాడారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశ పెట్టిన తర్వాత రేవంత్.. మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగానే తుషార్ గాంధీ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తుషార్ గాంధీ కూడా ఈ దేశ పౌరుడేనని, కొన్ని రాజకీయ ప్రభావాల వల్ల ఆ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని రేవంత్ అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై ప్రభుత్వం వెనక్కి తగ్గదని సీఎం స్పష్టం చేశారు. ప్రభావితుల అభిప్రాయాలను సేకరిస్తున్నామని తెలిపారు. నదికి రెండు వైపులా 50 మీటర్ల మేర మాత్రమే భూసేకరణ చేపట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళిక సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

టెన్త్ పరీక్షలు ఇక ఉండవు

ఈ సందర్భంగానే టెన్త్ పరీక్షలకు సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో టెన్త్ పరీక్షలను రద్దు చేయనున్నట్లు తెలిపారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధమైన విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఈ మార్పులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. దేశమంతా 10+2 విధానం అమలవుతుందని, రాష్ట్రంలో కూడా దానినే తీసుకొస్తామని వివరించారు. అనంతరం రాజకీయ అంశాలపై మాట్లాడిన సీఎం, డ్రగ్స్ సమస్యపై బీజేపీ స్పందనపై ప్రశ్నలు లేవనెత్తారు. బీఆర్‌ఎస్‌పై విమర్శలు వచ్చినప్పుడు బీజేపీ స్పందిస్తోందని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య పొత్తుల అంశంపై త్వరలో స్పష్టత ఇస్తామని తెలిపారు.

బీఆర్ఎస్ హయాంలో వేల ఫోన్లు ట్యాప్

ఫోన్ ట్యాపింగ్ కేసుపై కూడా సీఎం స్పందించారు. గత ప్రభుత్వ కాలంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపించారు. ఈ ఘటనల వల్ల అనేక మంది నష్టపోయారని పేర్కొన్నారు. విచారణ చట్టపరమైన విధానంలో కొనసాగుతోందని తెలిపారు. కేంద్రం నుంచి అనుమతి వచ్చిన తర్వాత చర్యలు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఈ కేసులో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కొందరు నేతలు చేస్తున్న క్లీన్ చిట్ వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమని పేర్కొన్నారు. అవసరమైతే తాను కూడా విచారణకు హాజరవడానికి సిద్ధమని తెలిపారు.

అదే సమయంలో గత కాలంలో జరిగిన ఏ అంశంపైనా విచారణకు సిద్ధమని సీఎం స్పష్టం చేశారు. సంబంధిత నాయకులు కోరితే ఆయా అంశాలపై విచారణ చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ పరిణామాలతో మూసీ ప్రాజెక్టు, రాజకీయ వ్యాఖ్యలు, విద్యా మార్పులు ఒకేసారి చర్చనీయాంశాలుగా మారాయి. రాబోయే రోజుల్లో ఈ అంశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Read More
Next Story