నో చెప్పిందని ‘హెచ్ఐవీ’ ఇంజెక్షన్ ఇచ్చిన వన్ సైడ్ లవర్ ? మరీ ఇంత శాడిస్టా ?
x
HIV injection by one side lover

నో చెప్పిందని ‘హెచ్ఐవీ’ ఇంజెక్షన్ ఇచ్చిన వన్ సైడ్ లవర్ ? మరీ ఇంత శాడిస్టా ?

సినిమాలో తండ్రి శాడిస్టు అయితే నిజజీవితంలో వన్ సైడ్ లవర్ శాడిస్టంతే


సమాజంలో జరుగుతున్న ఘటనల ఆధారంగా సినిమాలు తీస్తున్నారా ? లేకపోతే సినిమాల్లో చూపిస్తున్నారు కాబట్టి అచ్చంగా బయట అలాగే జరుగుతున్నాయా ? ఇపుడీ ప్రశ్న ‘‘విత్తుముందా ? చెట్టుముందా’’ ? అనే ప్రశ్న లాంటిదే. ఇపుడీ విషయం ఎందుకంటే ఈమధ్యనే ఒక సినిమా వచ్చింది. అందులో కూతురు తనకు ఇష్టంలేని అబ్బాయిని ప్రేమించిందన్న కోపంతో తండ్రి ఆసుపత్రిలో హెచ్ఐవీ టెస్టుకు వచ్చిన రక్తాన్ని ఇంజెక్షన్లో తీసుకుని కూతురికి ఎక్కించి ఆమె చావుకు కారణమవుతాడు. అప్పుడెప్పుడో, ఎక్కడో జరిగిన యథార్ధ ఘటన ఆధారంగా సినిమా తీసినట్లు దర్శకుడు చెప్పుకున్నాడు.

ఇపుడు విషయం ఏమిటంటే సినిమాలో చూపించినట్లుగానే అచ్చంగా ఘటన జరిగింది. కాకపోతే సినిమాలో తండ్రి శాడిస్టు అయితే నిజజీవితంలో వన్ సైడ్ లవర్ శాడిస్టంతే. ఇంతకీ ఏమి జరిగిందంటే మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పోచారం ప్రాంతంలో ఒక శాడిస్టు యువకుడు ఒక అమ్మాయికి హెచ్ఐవీ రక్తాన్ని ఇంజెక్షన్ రూపంలో ఎక్కించేశాడు. పోలీసుల సమాచారం ప్రకారం మనోహర్ అనే కుర్రాడు ఒక అమ్మాయి వెంటపడుతున్నాడు. తాను ప్రేమిస్తున్నాను తనను అమ్మాయి కూడా ప్రేమించాలని, పెళ్ళిచేసుకోవాలని నానా గోలచేస్తున్నాడు.

ఆ కుర్రాడిగురించి అమ్మాయి వాకాబు చేస్తే అతగాడికి హెచ్ఐవీ ఉందని తెలిసింది. యువకుడి గురించి అమ్మాయి ఎందుకు వాకాబుచేసిందో తెలీదు. ఎప్పుడైతే అబ్బాయికి హెచ్ఐవీ ఉందని బయటపడిందో అదే విషయాన్ని అమ్మాయి కుర్రాడికి మొహంమీదే చెప్పేసింది. కుర్రాడిని వివాహం చేసుకుని తన ప్రాణాలను పణంగా పెట్టలేనని స్పష్టంగానే చెప్పింది. దాంతో ఆ కుర్రాడికి అమ్మాయిమీద మండిపోయింది. తొందరలోనే తాను ఎలాగూ చనిపోతానని తెలుసుకున్న కుర్రాడు అమ్మాయి మాత్రం ఇంకెవరినో వివాహం చేసుకుని సుఖంగా ఉంటుందన్న ఆలోచననే జీర్ణించుకోలేకపోయాడు.

అందుకని ఆ అమ్మాయితో మాట్లాడుతున్నట్లు నటిస్తునే సడెన్ గా దాడిచేసి ఒక ఇంజెక్షన్ ఇచ్చి పారిపోయాడు. ఆ ఘటన తర్వాత అమ్మాయికి అనారోగ్యం మొదలవ్వటంతో ఇంట్లోవాళ్ళు ఆసుపత్రిలో చూపించారు. రక్త పరీక్షలు చేసినపుడు అమ్మాయికి హెచ్ఐవీ ఉందన్న విషయం బయటపడటంతో అందరు షాక్ కు గురయ్యారు. అప్పుడు ఆ అమ్మాయి కుర్రాడు చేసిన పనిని ఇంట్లో వాళ్ళకు వివరించింది. దాంతో తల్లి, దండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పాటు కూతురిని వైద్యంకోసం ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఫిర్యాదు ఆధారంగా ఘట్ కేసర్ పోలీసులు మనోహర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతనికి హెచ్ఐవీ రక్తం ఎక్కడినుండి వచ్చింది ? ఇంజెక్షన్ ఎక్కడ సంపాదించాడు అని దర్యాప్తుచేస్తున్నారు. చివరకు ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుందో ఏమో.

Read More
Next Story