
వాట్సాప్ టిక్కెట్ చెల్లదు.. రైల్వే శాఖ స్పష్టీకరణ
రైల్‌వన్ యాప్‌లో బుక్ చేసిన రిజర్వేషన్ లేని టిక్కెట్లు బుక్ చేసిన మొబైల్‌లోనే చెల్లుతాయని, వాట్సాప్ కాపీలు, స్క్రీన్‌షాట్‌లు చెల్లవని రైల్వే శాఖ స్పష్టం చేసింది.
రైలులో ప్రయాణించే వారికి భారతీయ రైల్వే కీలక సూచన చేసింది. రైల్‌వన్ యాప్ ద్వారా బుక్ చేసిన రిజర్వేషన్ లేని టిక్కెట్లను వాట్సాప్‌లో పంపించడం లేదా స్క్రీన్‌షాట్ చూపించడం ద్వారా ప్రయాణానికి అనుమతి ఉండదని స్పష్టం చేసింది. టిక్కెట్ జారీ చేసిన మొబైల్ ఫోన్‌లోనే ఆ టిక్కెట్ చెల్లుబాటు అవుతుందని తెలిపింది.
ఎందుకు ఈ నిర్ణయం?
ఇటీవల ఒక ప్రయాణికుడు అసలు టిక్కెట్‌కు బదులుగా వాట్సాప్‌లో ఉన్న స్క్రీన్‌షాట్‌ను టికెట్ చెకింగ్ సిబ్బందికి చూపించాడు. దాన్ని చెల్లుబాటు అయ్యే టిక్కెట్‌గా గుర్తించకుండా జరిమానా విధించారు. ఈ ఘటన తర్వాత రైల్వే శాఖ అధికారికంగా నిబంధనలను మరోసారి వెల్లడించింది. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వీడియో విడుదల చేసి ప్రయాణికులకు సూచనలు చేసింది.
రైల్‌వన్ యాప్‌లో బుక్ చేసిన రిజర్వేషన్ లేని టిక్కెట్, టిక్కెట్ జారీ చేసిన మొబైల్‌లోనే ఉండాలని తెలిపింది. ప్రయాణ సమయంలో అదే మొబైల్ ఫోన్‌తో పాటు చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డును కూడా వెంట తీసుకెళ్లాలని సూచించింది.
వాట్సాప్ ద్వారా పంపిన టిక్కెట్ కాపీలు, స్క్రీన్‌షాట్‌లు లేదా ఇతర రూపాల్లో ఉన్న టిక్కెట్లను చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలుగా పరిగణించబోమని స్పష్టం చేసింది.
ప్రయాణికుల అసంతృప్తి..
రైల్వేల ఈ నిబంధనపై సోషల్ మీడియాలో పలువురు ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము కుటుంబ సభ్యులకు టిక్కెట్లు బుక్ చేస్తుంటామని, కానీ ప్రతి సందర్భంలో వారితో కలిసి ప్రయాణించలేమని కొందరు పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో టిక్కెట్ బుక్ చేసిన మొబైల్ కూడా ఇవ్వాలా? అని ప్రశ్నించారు.
మరికొందరు వృద్ధులు, స్మార్ట్‌ఫోన్ వినియోగం తెలియని ప్రయాణికుల పరిస్థితిని కూడా రైల్వేలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అందరికీ ఉపయోగపడేలా నిబంధనలను రూపొందించాలని కోరారు.
ప్రయాణికులకు సూచన..
రైల్‌వన్ యాప్ ద్వారా రిజర్వేషన్ లేని టిక్కెట్ బుక్ చేసిన వారు, ప్రయాణ సమయంలో తప్పనిసరిగా అదే మొబైల్ ఫోన్‌ను వెంట ఉంచుకోవాలి. అలాగే చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డును కూడా చూపించాల్సి ఉంటుంది. లేకపోతే టిక్కెట్ ఉన్నప్పటికీ జరిమానా లేదా ఇతర చర్యలు ఎదురయ్యే అవకాశం ఉందని రైల్వేలు హెచ్చరించాయి.

