అవినీతికి కాపీరైట్ పొందిన పార్టీ డీఎంకె: మోదీ
తమిళనాడులో కాంగ్రెస్, దాని మిత్రపక్షం, అధికార డీఎంకేపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తమిళనాడులో కాంగ్రెస్, దాని మిత్రపక్షం, అధికార డీఎంకేపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం ఆయన వేలూరులో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విమర్శస్త్రాలు సంధించారు. రాష్ట్రాన్ని లూటీ చేయడమే డీఎంకే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు.
"అవినీతిపై మొదటి కాపీరైట్ కలిగిన పార్టీ డిఎంకె. ఆ కుటుంబం మొత్తం తమిళనాడును లూటీ చేస్తోంది’’ అని విమర్శించారు. భాష, ప్రాంతం, మతం, కులం ఆధారంగా ప్రజల మధ్య విభేదాలను డిఎంకె సృష్టిస్తోందన్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే ప్రమాదకర రాజకీయాలను బహిర్గతం చేసేందుకు నేను వచ్చానని చెప్పారు.
1974లో కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు ఇవ్వాలని ఏ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు? ఎవరికి ప్రయోజనం చేకూర్చారని మోదీ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ వద్ద సమాధానం లేదన్నారు.
భారతీయ మత్స్యకారులను శ్రీలంక అరెస్టు చేసి వారి పడవలను స్వాధీనం చేసుకున్నపుడు వారిపై కాంగ్రెస్, డిఎంకె బూటకపు ప్రేమ చూపుతోందని ఆరోపించారు. శ్రీలంక ఆధీనంలో ఉన్న ఐదుగురు మత్స్యకారుల "శాశ్వత విడుదల"కు భరోసా ఇస్తున్నామని మోదీ చెప్పారు.
రాహుల్ గాంధీపై..
రాహుల్ గాంధీ ఇటీవల చేసిన ‘శక్తి’ వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు మోదీ. హిందువులు విశ్వాసంగా భావించే ’శక్తి‘ని నాశనం చేయాలని రాహుల్ మాట్లాడారని, డీఎంకే మనస్తత్వం కూడా అలాంటిదేనని పేర్కొన్నారు. రామ మందిర ప్రారంభోత్సవాన్ని (అయోధ్యలో) బహిష్కరించడం, కొత్త పార్లమెంటు భవనంలో 'పవిత్ర సెంగోల్' ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరుకాకపోవడాన్ని మోదీ గుర్తుచేశారు.
మహిళల పట్ల భారత కూటమి ఎలా ప్రవర్తిస్తుందో, దివంగత "జయలలిత" బతికి ఉన్నప్పుడు డిఎంకె ఎలా ప్రవర్తించిందో అందరికీ తెలుసని పేర్కొన్నారు.