‘రాముడు నా దేవుడు కాదు.. ఇండియా దేశం కాదు’ అని డీఎంకే రాజా ఎందుకన్నారు?
భిన్న సంస్కృతి, సంప్రదాయాలు ఉన్న భారతదేశం ఒక దేశం కాదని, ఉపఖండమని డీఎంకే ఎంపీ రాజా పేర్కొన్నారు. మదురైలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
డీఎంకె ఎంపీ ఎ రాజా వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన మాటలను అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఖండించాయి.
అసలు రాజా ఏమన్నారు?
మదురైలో పార్టీ నిర్వహించిన సమావేశంలో రాజా ప్రసంగించారు. భారతదేశం ఎప్పుడూ ఒక దేశం కాదని, విభిన్న పద్ధతులు, సంస్కృతులకు నిలయమైన ఉపఖండమని పేర్కొన్నారు. రాజా ప్రసంగ వీడియోను బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
“భారతదేశం ఒక (ఒక) దేశం కాదు. ఒక భాష, ఒక సంప్రదాయం, ఒక సంస్కృతి ఉన్నపుడే ఒక దేశంగా పరిగణించాలి. తమిళనాడులో ఒక సంస్కృతి ఉంది. కేరళలో మరొక సంస్కృతి ఉంది. అలాగే ఢిల్లీలో కూడా ఒక సంస్కృతి ఉంది. ఒడిశాలో మరో సంస్కృతి ఉంది.’’ అని అన్నారు. తమిళులు రాముడిని తమ దేవుడిగా అంగీకరించరని, 'జై శ్రీరామ్' లేదా 'భారత్ మాతా కీ జై' నినాదాలు చేయరని పేర్కొన్నారు.
రాజా వ్యాఖ్యలపై తప్పుబట్టిన బీజేపీ..
డీఎంకే ఎంపీ రాజా వ్యాఖ్యలను బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. డీఎంకే ఇండియా కూటమిలో భాగమని చెప్పారు. భారతదేశాన్ని అవమానించడం, హిందూ దేవుళ్ళను కించపరచడం భారత కూటమి రాజకీయ ఎజెండా అని పేర్కొన్నారు. 'భారతదేశం ఒక దేశం కాదు' అన్నరాజా వ్యాఖ్యను "మావోయిస్ట్ భావజాలం"గా అభివర్ణించారు. రాజా వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. "సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక (గాంధీ వాద్రా), మల్లికార్జున్ ఖర్గే.. రాజా వ్యాఖ్యలను సమర్థిస్తారా? అని ప్రశ్నించారు.
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ “సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి” అన్న వ్యాఖ్యపై సుప్రీంకోర్టు కేసు విచారణ చేపట్టింది. వాక్ స్వేచ్ఛను దుర్వినియోగం చేయడమేనని కోర్టు మండిపడిన విషయాన్ని రవిశంకర్ ప్రసాద్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
రాజా వ్యాఖ్యలను ఖండిస్తున్నాం..కాంగ్రెస్
''రాజా వ్యాఖ్యలతో నేను 100 శాతం ఏకీభవించను. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నా. మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని నేను భావిస్తున్నాను, ”అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతే విలేఖరులతో అన్నారు.
Next Story