ట్రాఫిక్ చలాన్లపై బలవంతపెట్టద్దు
x
Traffic police

ట్రాఫిక్ చలాన్లపై బలవంతపెట్టద్దు

బండి తాళాలు తీసుకున్న తర్వాత వాహన యజమాని చేసేదిలేక పోలీసులు వేసినంత జరిమానాను కట్టి తన బండిని తీసుకుని వెళతారు


తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో వాహనదారులు ఫుల్లు హ్యాపీ అయ్యేట్లే ఉన్నారు. రోడ్లపైన ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారి విషయంలో పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తుండటం అందరు చూస్తున్నదే. ట్రాఫిక్ వయలేషన్స్ అంటు వాహనాలను ముఖ్యంగా టూవీలర్స్ ను పోలీసులు రోడ్లపైన ఆపేస్తారు. టూవీలర్స్ ను ఆపగానే పోలీసులు ముందుగా చేసేపనేమిటంటే తాళాలు తీసేసుకోవటం. బండి తాళాలు తీసుకున్న తర్వాత వాహన యజమాని చేసేదిలేక పోలీసులు వేసినంత జరిమానాను కట్టి తన బండిని తీసుకుని వెళతారు.

ఇదే విషయమై హైకోర్టు ఈరోజు జరిగిన విచారణలో స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. గడచిన ఏడాదిలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి రు. 239 కోట్ల విలువైన చలానాలు విధించారు. ఇందులో వాహనాలను ఆపి విధించిన చలాన్లు 10.27 లక్షలుండగా, ఈ-చలాన్లు సుమారు 26 లక్షలున్నాయి. కొద్దిరోజుల క్రితం యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో రోడ్డు భద్రతా దినోత్సవం సందర్భంగా ప్రచార కార్యక్రమం జరిగింది. ఆ సమయంలో ట్రాఫిక్ చలానాల వసూళ్ళు విషయంలో చలానా పడగానే ఆటోమేటిక్కుగా వాహన యజమాని బ్యాంకు ఖాతానుండి డబ్బులు కట్ అయ్యేట్లుగా ఉంటే బాగుంటుందని చేసిన వ్యాఖ్యపై ఎంతటి రగడ జరిగిందో అందరు చూసిందే.

అలాగే ట్రాఫిక్ చలానాల విషయంలో అనేక గొడవలు కూడా అవుతున్నాయి. బహుశా వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఈరోజు విచారణలో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఏమనంటే పెండింగ్ చలానాల వసూళ్ళ కోసం వాహనదారులను బలవంతపెట్టద్దని. వాహనాల తాళాలు లాక్కోవటం, వాహనాలను సీజ్ చేసి పోలీసుస్టేషన్లకు ఎత్తుకెళ్ళటం తప్పని చెప్పింది. చలానాలు వేసినపుడు వాహనాల యజమానాలు తమంతట తాముగా చలానా మొత్తాన్ని చెల్లిస్తే తీసుకోవాలి లేకపోతే వదిలేయాలని చెప్పింది. చలానాలను చెల్లించని వాహన యజమానులకు నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. మరి తాజా కోర్టు ఆదేశాలను పోలీసులు ఎంతవరకు పాటిస్తారో చూడాల్సిందే.

Read More
Next Story