
డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవటంలో రాబోతున్న కొత్తమార్పు తెలుసా ?
తొందరలో రెండంచెల డ్రైవింగ్ విధానం స్ధానంలో మూడంచెల విధానం అమల్లోకి రాబోతున్నది
ఇప్పటివరకు డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళకు లైసెన్స్ తీసుకోవటంలో ఉన్న పద్దతులు ఏమిటో తెలుసు. మొదటగా ఎల్ఎల్ఆర్ తీసుకోవాలి. ఆ తర్వాత పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. ఈ లైసెన్స్ ఇచ్చేముందు ఫార్మల్ గా ఒక ట్రాక్ పైన టెస్ట్ కు హాజరవ్వాల్సుంటుంది. ఈ విషయాలు అందరికీ తెలిసినవే. అయితే తొందరలో రెండంచెల డ్రైవింగ్ విధానం స్ధానంలో మూడంచెల విధానం అమల్లోకి రాబోతున్నది. ఏప్రిల్ నుండి కొత్తవిధానం అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇంతకీ మూడంచెల విధానం ఏమిటి ? అందులో ఏముంటుంది ? కొత్తగా రాబోతున్న విధానం ఏమిటంటే ఎల్ఎల్ఆర్ ఎలాగూ ఉంటుంది. అలాగే పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్(డీఎల్) టెస్టు కూడా ఉంటుంది. అయితే ఎల్ఎల్ఆర్ కన్నా ముందే ఒక ఆన్ లైన్ టెస్టును రవాణాశాఖ ప్రవేశపెడుతోంది.
అదేమిటంటే ఆన్ లైన్ రోడ్ సేఫ్టీ టెస్ట్. ఈ ఆన్ లైన్ రోడ్ సేఫ్టీ టెస్టులో ఏముంటుంది అంటే ఆరు మాడ్యూల్స్ ఉంటాయి. ఒక్కోటి 30 నిముషాలుంటుంది. అన్నింటికీ కలిపి మొత్తం 3 గంటలు టెస్టు ఉంటుంది. జనాలకు రోడ్డు భద్రతపైన అవగాహన కలిగించటమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ టెస్టుకు అప్పియర్ అయ్యేందుకు అభ్యర్ధులు ఎక్కడికీ వెళ్ళాల్సిన అవసరంలేదు. తమ ఇళ్ళు, ఆపీసులు లేదా డ్రైవింగ్ నేర్చుకున్న స్కూల్ నుండే టెస్టుకు హాజరవచ్చు. కెమెరా సౌకర్యం ఉంటే ల్యాప్ టాప్, డెస్క్ టాప్ మాత్రం కంపల్సరి.
ఈ 3 గంటల పరీక్షలో అభ్యర్ధులు పాసైతే రవాణాశాఖ ఒక సర్టిఫికేట్ అందిస్తుంది. ఆ సర్టిఫికేట్ లో ఒక ప్రత్యేక నెంబర్ ఉంటుంది. సర్టిఫికేట్ చేతికి అందిన తర్వాత మాత్రమే అభ్యర్ధులు ఎల్ఎల్ఆర్ కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత సాధించినట్లు. ఎల్ఎల్ఆర్ కు దరఖాస్తు చేసుకునేటపుడు అభ్యర్ధులు సదరు సర్టిఫికేట్ లోని నెంబర్ వేయాలి. ఈ టెస్టులో ఏముంటుంది అంటే నిజంగా జరిగిన కొన్ని ప్రమాదాలను అధికారులు వీడియోల్లో చూపిస్తారు. డ్రైవింగులో చేసే పొరబాట్లు, రోడ్డుపైకి వాహనంతో ఎలావెళ్ళాలి, సైడ్ మిర్రర్లను ఎలాసెట్ చేసుకోవాలి, ముందు వెళుతున్న వాహనాలన్ని ఎలా ఓవర్‌టేక్ చేయాలి, జరిగిన లేదా జరుగుతున్న ప్రమాదాల్లో ఎవరి తప్పెంత, జరిగిన తప్పు కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే విషయాలను ఉదాహరణలతో సహా ఉన్నతాధికారులు ఆన్ లైన్లోనే వివరిస్తారు.
పైన చెప్పిన మాడ్యూల్స్ కు సంబంధించిన కొన్నిప్రశ్నలకు ఆన్‌లైన్లోనే జవాబులు రాయాల్సుంటుంది. ఆన్‌లైన్ టెస్టులో పాసైతేనే ఎల్ఎల్ఆర్ దరఖాస్తు చేసుకునేందుకు అర్హత సాధించినట్లు లెక్క. ఆన్‌లైన్ టెస్టులో పాస్ కాకపోతే ఎల్ఎల్ఆర్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశంఉండదు. కొత్తగా ప్రవేశపెడుతున్న ఆన్‌లైన్ టెస్టన్నది వాహనాలు నడిపే వారితో పాటు వారి కుటుంబం క్షేమం కోరే అని రవాణాశాఖ చెబుతోంది.
ఎందుకంటే తెలంగాణలో 2023-24లో సుమారు 8లక్షల ఎల్ఎల్ఆర్‌లు జారీఅయితే 4.7లక్షల పర్మినెంట్ లైసెన్సులు జారీఅయ్యాయి. అలాగే 2024-25లో సుమారు 7లక్షల ఎల్ఎల్ఆర్‌లు జారీఅయితే 4.63లక్షల పర్మినెంట్ లైసెన్సులు జారీఅయ్యాయి. ఇదేసమయంలో 2024లో సుమారు 26వేల ప్రమాదాలు జరిగితే 8 వేలమంది మరణించారు. 2025లో 27 వేల ప్రమాదాల్లో 7500 మంది మరణించారు. దేశం మొత్తంమీద ప్రతి ఏడాది సుమారు 2 లక్షలమంది రోడ్డు ప్రమాదాల్లోనే మరణిస్తున్నారు. రకరకాల కారణాలతో రోడ్డుప్రమాదాలు ప్రతి ఏడాది పెరుగుతునే ఉన్నాయి. జరుగుతున్న ప్రమాదాల్లో అత్యధికం వాహనాలు నడపటంలో యజమానుల నిర్లక్ష్యమే కారణంగా తేలుతోంది. అందుకనే రోడ్డుమీదకు వాహనాలను తీసుకొచ్చేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి చెప్పేందుకే రవాణాశాఖ కొత్తగా మూడంచెల విధానాన్ని ప్రవేశపెడుతోంది.

