
సెలవు రోజుల్లోనే గుండెపోట్లు ఎందుకు పెరుగుతాయో తెలుసా?
అతిగా మద్యం తీసుకోవటం, మసాలాలు దట్టించిన మాంసాహారం తీసుకోవటం, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటంతోనే గుండె సమస్యలు పెరిగిపోతున్నట్లు అధ్యయనంలో బయటపడింది
సెలవురోజుల్లోనే గుండెపోట్లు ఎక్కువగా వస్తున్నాయి. హైదరాబాద్ లోని ఒక ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగం రిపోర్టు ఈ విషయాన్ని వెల్లడించింది. వారాంతాల్లో పార్టీలు ఎక్కువగా జరుగుతుండటం, పబ్బులు, బార్లలో ఫ్రెండ్స్ మందుపార్టీలు, ఆలస్యంగా నిద్రలేచినా ఇబ్బందిలేదు ఎలాగూ రేపు సెలవేకదా అనుకుని ఓ రెండుపెగ్గులు ఎక్కువగా తీసుకోవటం లాంటి అనేక కారణాల వల్ల జనాల్లో గుండెపోట్లు సెలవురోజుల్లోనే ఎక్కువగా వస్తున్నాయి. అతిగా మద్యం తీసుకోవటం, అతిగా మసాలాలు దట్టించిన మాంసాహారం తీసుకోవటం, జంక్ ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తీసుకోవటంతోనే గుండెసమస్యలు పెరిగిపోతున్నట్లు అధ్యయనంలో బయటపడింది. దీన్ని వైద్య పరిభాషలో హాలిడే హార్ట్ సిండ్రోమ్(హెచ్ హెచ్ ఎస్) అంటారు.
అప్పటికే హైబీపీ, మానసిక సమస్యలు, ఆఫీసులు, ఇళ్ళల్లో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారిపైన వీకెండ్ పార్టీల్లో అతిగా మద్యం తీసుకోవటం మరింత ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నది. అతిగా మద్యం సేవించటం, అతిగా ఆహారం తీసుకోవటం అనే కారణాలు అధిక చెక్కర, కొవ్వు, ఉప్పు మన శరీరంలోకి వెళుతున్నాయి. దీనివల్ల రక్తపోటు పెరిగిపోయి గుండెపనితీరుపై ఒత్తిడిపెరిగిపోయి పనితీరులో బ్యాలెన్స్ దెబ్బతింటుంది. దీంతో గుండెపోట్లు పెరిగిపోతున్నాయని రిపోర్టులో తేలింది.
ఆసుపత్రి రిపోర్టు ప్రకారం మామూలు రోజులతో పోల్చితే సెలవురోజులు, వారాంతాల్లో హార్ట్ ఫెయిల్యూర్ కేసులు 30 శాతం ఎక్కువగా నమోదవుతున్నాయి. పోయిన ఏడాది సాధారణ చెకప్పు కోసం ఆసుపత్రికి వచ్చిన వారికి పరీక్షలు తర్వాత 68శాతం మంది రోగులకు అప్పటికప్పుడు స్టంట్లు వేయాల్సొచ్చిందని రిపోర్టు స్పష్టంచేసింది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే శీతాకాలంలో కూడా గుండె వైఫల్యంతో మరణాలు పెరుగుతున్నట్లు తేలింది. హార్ట్ ఎటాక్ మరణాలు శీతాకలంలో మామూలు రోజుల్లో కన్నా 36శాతం ఎక్కువగా నమోదైంది.
మద్యపానం తీసుకోవటం అన్నది ఇపుడు సామాజికహోదాగా మారిపోయింది. చిన్నా, పెద్దా, ఆడ, మగ తేడాలేకుండా పండుగలు, వివాహాలు, పుట్టినరోజులు చివరకు చావుల్లో కూడా కొన్ని సామాజికవర్గాల్లో, సంపన్నకుటుంబాల్లో మద్యపానం తప్పనిసరిగా ఉండాల్సిందే అన్నట్లుగా తయారైంది. మితిమీరిన మద్యపానం వల్ల నాడీవ్యవస్ధ ప్రభావం చూపిస్తుందని రిపోర్టు తెలిపింది. దీనివల్ల గుండె స్పందనలు పెరిగిపోయి, బీపీ పెరిగి హార్ట్ ఫెయిల్యూర్లు పెరిగిపోతున్నాయి. అలాగే మద్యపానం ఎక్కువగా తీసుకోవటం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ అవకాశాలు పెరుగుతాయని కూడా సదరు రిపోర్టు చెప్పింది.
శరీరంలో అనవసరమైన కేలరీలు పేరుకుపోవటం కూడా హైబీపీకి కారణమవుతోందని రిపోర్టు చెప్పింది. అనవసరమైన కేలరీలు అంటే కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తదితరాల కారణంగా శరీరంలోకి చేరుతోంది. సాధారణంగా రోజుకు 300 మిల్లీలీటర్ల సైజుండే ఒక కూల్ డ్రింక్ తాగితే అందులోని 200 కేలరీలు మనశరీరంలోనే ఉండిపోతాయి. ఈ కేలరీలు శరీరంలోనుండి బయటకుపోవు, శరీరంలోని రక్తంలో కలిసే అవకాశాలు తక్కువ. ఫలితంగా ఈ అనవసరమైన కేలరీలు రక్తప్రసరణకు అడ్డుపడటమే కాకుండా గుండెపనితీరుమీద ప్రభావం చూపిస్తుంది. ఇక, బిర్యానీ తింటే 2 వేల కేలరీలు శరీరంలో పేరుకుపోతుంది. ఇలాంటి కూల్ డ్రింకులు, బిర్యానీలు ఒకటికి మించి ఎక్కువసార్లు తీసుకుంటే ఎన్ని వేల అనవసరపు కేలరీలు శరీరంలో తిష్టవేస్తాయో ఆలోచించాల్సిందే.
ఒకపుడు వయస్సు అయినపోయిన వారిలోనే కనిపించే గుండెసమస్యలు ఇపుడు 30 లేదా 40 ఏళ్ళ వాళ్ళల్లో కూడా మామూలైపోయింది. దీనికి కారణం జీవనశైలిలో మార్పులు రావటమే. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలామందికి ఎలాంటి శారీరక వ్యాయామం ఉండటంలేదు. ఆఫీసుల్లో, ఇళ్ళల్లో ఏదో ఒక కారణంతో టెన్షన్లు పెరిగిపోవటం కూడా గుండెపోట్లకు కారణాలు అవుతున్నట్లు సదరు ఆసుపత్రి రిపోర్టు స్పష్టంచేసింది.

