
By Special Arrangement
ఓఆర్ఎస్ తయారీ కంపెనీలకు హైదరాబాద్ డాక్టర్ వార్నింగ్
పిల్లల ఆరోగ్యం కోసం ఓఆర్ ఎస్ తయారుదారులు రూల్స్ ఫాలో కావాల్సిందే అంటున్న డాక్టర్లు
డయేరియా చికిత్స కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి పొందిన మందుల స్థానంలో ఫ్లేవర్డ్ ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ అమ్ముతున్న కంపెనీలు కేసు వేసి తన నోరుమూయించాలని ప్రయత్నిస్తున్నాయని డాక్టర్ శివరంజని సంతోష్ ఆరోపించారు. గత ఆరేళ్లుగా ఎఫ్ఎస్ఎస్ఏఐ దగ్గర, తెలంగాణ హై కోర్టులో పోరాడుతున్న తనకు పేరు లేని అక్కౌంట్ల నుంచి సామాజిక మాధ్యమాల్లో బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు.
అయితే నిజాన్ని చెప్పడం మాననని అందుకు కంపెనీల ఆగడాలను అరికట్టడంలో ప్రభుత్వం చొరవ చూపాలని మీడియాతో ఆన్లైన్ జరిపిన ప్రెస్ మీట్ లో స్పష్టం చేశారు.
దేశంలో పిల్లల మరణాలకు మూడో ప్రధానమైన కారణం డయేరియా. దీని వలన ప్రపంచ వ్యాప్తంగా సుమారు 4.5 లక్షల మంది పిల్లలు దేశంలో లక్ష నుండి లక్షన్నర మంది చనిపోతున్న నేపథ్యంలో, చికిత్సలో భాగంగా వాడే ఉత్పత్తుల తప్పుడు లేబులింగ్, బ్రాండింగ్ జరగకుండా చూడటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ విషయంలో 2025 అక్టోబర్ 14న ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఆదేశాలు ఇచ్చినప్పటికీ తప్పుదోవ పట్టించే బ్రాండింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనితో ఆరోగ్య రంగంలో పని చేసే వారు, ముఖ్యంగా డాక్టర్ల సుదీర్ఘ పోరాటం తరువాత వచ్చిన ఆ ఆదేశాలు తప్పుదోవ పట్టడాన్ని జీర్ణించు కోలేకున్నారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ తీర్పుతో వాళ్ళు పొందిన విజయానందం ఎక్కువకాలం నిలవలేదు.
ఐదు సంవత్సరాల లోపు పిల్లల మరణాల్లో సుమారు 13 శాతం డయేరియాకే సంబంధితమైనవే.
ఈ విషయంలో గత ఆరు ఏళ్లుగా పోరాడుతున్న డాక్టర్ శివరంజని సంతోష్ వంటి వైద్యులు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు ఎలా ఉల్లంఘించబడుతున్నాయో వివరించడానికి ఆన్‌లైన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆమె గత ఆరేళ్లుగా ఈ అంశంపై పోరాడుతున్నారు. 2022లో WHO ప్రమాణాలు పాటించని ఏ ద్రావణం “ఓఆర్ఎస్” పేరు ఉపయోగించకూడదని ఎఫ్ఎస్ఎస్ఏఐ చెప్పినా, ఆ ఆదేశం అమల్లోకి రాలేదు. కొన్ని రోజుల తరువాత ఎఫ్ఎస్ఎస్ఏఐ కంపెనీలు ఈ ద్రవం ఓఆర్ఎస్ కాదు అనే గమనికను (disclaimer) పెట్టి అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చింది.
దీంతో ఈ ఉత్తర్వుకు వ్యతిరేకంగా ఆమె తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) వేశారు. ఆమెకు ఎండోక్రైనాలజిస్టుల సంఘం, మహిళా శిశు వైద్యులు మద్దతు ఇచ్చారు. అయితే ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిషియన్స్ ఈ విషయంపై స్పందించలేదు. ఎఫ్ఎస్ఎస్ఏఐ 2025 అక్టోబరులో ఇచ్చిన తన తదుపరి ఆదేశంలో ఇది వరకు తానే ఇచ్చిన ఉత్తర్వులను ప్రక్కన పెడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలు పాటించని కంపెనీలు ఓఆర్ఎస్ పేరును వాడ రాదని మళ్ళీ తీర్మానించింది.
నిబంధనలు తప్పించుకునే ఎత్తులు:
ఈ ఆదేశం తరువాత నిబంధనలను ప్రక్కన పెట్టి మిగిలిన సరుకును అమ్ముకోవటానికి అనుమతి కోరుతూ ఢిల్లీ హై కోర్టును అభ్యర్థించింది. స్పందించిన కోర్టు ఎఫ్ఎస్ఎస్ఏఐని జెఎన్టీఎల్ కన్స్యూమర్ హెల్త్ (ఓఆర్ఎస్ఎల్ తయారీదారు) వాదన వినమని ఆదేశించింది. కంపెనీ ‘ఓఆర్ఎస్ఎల్’ పేరును ‘ఈ-ఆర్జెఎల్’ గా మార్చి మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. కానీ ట్రేడ్‌మార్క్ ను మార్చకుండా అలాగే ఉంచింది. కంపెనీ ఇకపై ఓఆర్ఎస్ ప్రమాణాలను పాటిస్తూ ఓఆర్ఎస్ఎల్ అమ్ముతామని, అదే సమయంలో ఓఆర్ఎస్ఎల్ పేరుతో అమ్మిన ద్రవాన్ని ఇక ఈ-ఆర్జెఎల్ గా అమ్ముతామని చెప్పింది.
అయితే ఈ రెండు ప్యాక్ (ఓఆర్ఎస్ఎల్, ఈ-ఆర్జెఎల్) ల రూపురేఖలు ఒకేలా ఉండటం వలన చిన్న పట్టణాలు, గ్రామాల్లోని ప్రజలు ఇవి ఓఆర్ఎస్ అని భ్రమపడే అవకాశం ఉందని డాక్టర్ శివరంజని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమాలకు తగినట్టుగా లేని ఏ ద్రావణాన్ని ఓఆర్ఎస్ పేరుతో సరిపోలే పేర్లు పెట్టకూడదని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆ రకమైన నిబంధన పెట్టాలని ఆమె అభిప్రాయ పడ్డారు.
ఓఆర్ఎస్ ప్రాముఖ్యత ఏమిటి?
డబ్ల్యూహెచ్ఓ సూచించిన ఓఆర్ఎస్ ఫార్ములా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది పిల్లల ప్రాణాలు కాపాడింది. డయేరియా బారిన పడిన పిల్లల శరీరంలో ద్రవాలు సరయిన మోతాదులో ఉండేట్టుగా ఇది సహాయ పడుతుంది. ఫ్లేవర్డ్ ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ ఈ ప్రమాణాలకు తగినట్టుగా ఉండవు. అవి పిల్లల్లో డయేరియా ప్రమాదాన్ని పెంచే ప్రమాదమూ లేకపోలేదు.
ఈ పానీయాలు తీసుకోవటం వలన ఎంత మంది పిల్లల ప్రాణాలు పోయాయో ఎప్పటికీ తెలిసే అవకాశం లేదు, అవి సాధారణ డయేరియా మరణాలుగానే నమోదయి ఉంటాయి అని డాక్టర్ శివరంజని ఆవేదన వ్యక్తం చేశారు. “తల్లిదండ్రులు ఓఆర్ఎస్ అని భావించి ఫ్లేవర్డ్ ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ ఇవ్వటం వలన ఈ నష్టం జరుగుతోంది. కాబట్టి వాటి ప్యాకింగ్ వలన వాళ్ళు మోసపోకుండా చూడటం కంపెనీ బాధ్యత,” అని ఆమె అన్నారు.
ఆరోగ్యం పై ప్రభావం; ఆందోళన:
ఫార్మసీలు ఎలక్ట్రోలైట్ డ్రింక్స్‌ను ఓఆర్ఎస్ గా ప్రజలను భ్రమింపజేస్తూ అమ్ముతున్న వీడియో లను ఆమె ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఇవి రోజు వారీగా దాహాన్ని తీర్చేందుకు త్రాగగలిగే డ్రింక్స్ గా ప్రచారం చేయడం తప్పు అని ఆమె అభిప్రాయ పడ్డారు.
ఈ పానీయాల్లో ఉండే సుక్రలోజ్ అనే పదార్థం పిల్లల్లో ఉబకాయానికి దారితీస్తుందని ఆమె చెప్పారు. వీటిని పెద్దలు అప్పుడప్పుడు తీసుకోవచ్చని కానీ రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసు పిల్లలు తీసుకోరాదని ఆమె అన్నారు. “ఈ-ఆర్జెఎల్ లో 87 శాతం తక్కువ చక్కెర ఉందని ఇప్పుడు ఏ ఉద్దేశంతో చెప్తున్నారు,” అని ఆమె ప్రశ్నించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ 15 మే, 2023 లో జారీచేసిన మార్గ దర్శకాలలో నాన్-షుగర్ స్వీటెనర్స్ వాడకాన్ని నిరుత్సాహపరిచింది. ఇవి టైప్-2 డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు పెంచే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
పీడియాట్రిషియన్స్ చిన్నపిల్లలకు, ముఖ్యంగా రెండు సంవత్సరాల లోపు పిల్లలకు ఈ కృత్రిమ స్వీటెనర్స్ అసలు ఇవ్వకూడదనే అభిప్రాయపడతారు.
నియంత్రణలో లోపాలు:
ఒక ప్రశ్నకు జవాబుగా జెఎన్టీఎల్ కన్స్యూమర్ హెల్త్ తయారీ ఓఆర్ఎస్ఎల్ కు మాత్రమే కాకుండా అన్ని ఫ్లేవర్డ్ ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ కు వ్యతిరేకంగా తాను మాట్లాడుతున్నట్టు ఆమె చెప్పారు. “ఓఆర్ఎస్ఎల్ బ్రాండ్ ప్రజలను తప్పుదోవ పట్టించడంలో అందరికంటే ముందు ఉంది. అన్ని తప్పుడు ప్రకటనలకు వ్యతిరేకంగా నేను మాట్లాడాను. ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నియమాలకు అనుగుణంగా ఉండాలి. సరయిన ఆహారం నీరు తీసుకుంటే వీటి అవసరం ఉండదు,” అని ఆమె స్పష్టం చేశారు.
ఎఫ్ఎస్ఎస్ఏఐ సాధారణ ఆరోగ్య విషయాలపై దృష్టి పెడితే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ చికిత్స అందించటంలో సామర్ధ్యంపై కేంద్రీకరిస్తుంది. ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలు వైద్య ప్రమాణాలకు తగిన విధంగా లేకపోవటం పెద్ద లోపం. అది సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తో సమన్వయం తో పనిచేయాల్సిన అవసరం ఉంది.
కంపెనీలు ఎఫ్ఎస్ఎస్ఏఐ తో నమోదు సులభం కావటంతో ఔషధాలను ఈ సంస్థ పరిధిలో అనుమతులు తీసుకుని మార్కెట్లో అమ్ముకుంటున్నారు.
జాన్సన్ అండ్ జాన్సన్, కెన్వ్యూ కంపెనీలు తనకు నోటిస్ ఇచ్చినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. నిబంధనలు పాటించే మరే దేశంలో అయినా ఈ కంపెనీలు ఎన్నో కేసులు ఎదుర్కోవాల్సి వచ్చేదని ఆమె అన్నారు.
“మందుల షాపుల్లో ఫ్లేవర్డ్ ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ అమ్మకుండా నిషేధించాల్సిన అవసరం ఉంది. తద్వారా వాటి దురుపయోగాన్ని అరికట్టచ్చు. కేసులతో నన్ను బెదిరించాలనే ప్రయత్నాలు సఫలం కావు. పిల్లలను కంపెనీల అకృత్యాల నుండి కాపాడాలనే నా ప్రయత్నాలను నేను ఆపే ప్రసక్తే లేదు,” అని ఆమె అన్నారు.
కెన్వ్యూ అభిప్రాయం:
2026 జనవరిలో కెన్వ్యూ రెండు వేరు వేరు ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. డయేరియా చికిత్స కోసం డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలకు అణుగుణంగా ఓఆర్ఎస్ఎల్ ను రోజువారీ సేవించే ఎలక్ట్రోలైట్ డ్రింక్‌గా ఈ-ఆర్జెఎల్ అమ్ముతాము. కంపెనీ ఎప్పుడూ పారదర్శకంగా వ్యవహరించిందని కేవలం కొందరు వ్యక్తులు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కంపెనీ పేర్కొంది. ఈ విషయం పై శాస్త్రీయ చర్చలకు తాము సిద్ధమని, ప్రజా ఆరోగ్యానికి ఎప్పుడు కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది.

