
కడుపు కోత మిగుల్చుతున్న గడ్డిమందు పారాక్వాట్ పై నిషేధం కోరుతున్న డాక్టర్లు
ఈ మందు వాడకాన్ని కేంద్రం 9 పంటల్లో మాత్రమే అనుమతించినా రైతులు 25 పంటల్లో వినియోగిస్తున్నట్టు అధ్యయనాలు చెప్తున్నాయి
చేతికి అంది వచ్చిన 18 ఏళ్ళ బిడ్డను పొగుట్టుకున్న ఆ కుటుంబం తమ కడుపుకోత మరెవరికీ రాకూడదని కన్నీటి పర్యంతం అవుతోంది. తొందరపాటులో తీసుకున్న నిర్ణయంతో 18 ఏళ్ళ నిఖిల్ (కుటుంబం కోరిక మేరకు పేరు మార్చడమైనది) ప్రాణాలు కోల్పోయారు. ‘‘ఆ మందు తీసుకోవాల్సినంత సమస్యలు లేవు. మందు తీసుకున్న ఆరు రోజులకు కడుపునొప్పి అని చెప్తే హాస్పిటల్లో చేర్చాం. ఏడవ రోజు డాక్టర్లు పరీక్ష చేసి చెప్తే గానీ తను తీసుకుంది పారాక్వాట్ అనే ప్రమాదకర గడ్డిమందు అని తెలీలేదు’’ అని వెల్లడించారు నిఖిల్ పెదనాన్న.
‘‘నా తమ్ముడు తన ఒక్కగానొక్క బిడ్డనూ కోల్పోయాడు. ఈ కష్టం ఎవరికీ రాకూడదు. తనను బ్రతికించేందుకు 45 రోజులు డాక్టర్లు అన్నివిధాలా ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. విరుగుడు లేని ఇలాంటి మందును నిషేధించాలి. కనీసం చదువుకునే విద్యార్థి ఈ మందు ఎందుకు కొంటున్నాడు అని షాప్ యజమాని ఆలోచించి ఉంటే బాగుండు’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ అంశంపై స్పందించిన డాక్టర్ మర్రి మహేష్ రెడ్డి.. ప్రధానంగా యువతే క్షణికావేశంలో ఈ మందు తీసుకుని ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. విరుగుడు లేని ఈ మందు తీసుకుని చనిపోతున్న వారిని తాను పదేళ్లుగా చూస్తున్నానని ఆయన అన్నారు. గ్లైఫోసేట్ లాంటి గడ్డి మందు తీసుకున్నా మోతాదును బట్టి విరుగుడు అందుబాటులో ఉందని, బ్రతికే అవకాశం ఉంటుందని మహేష్ రెడ్డి తెలిపారు. ‘‘కానీ పారాక్వాట్ కేవలం 5 నుంచి 10 ఎంఎల్ తీసుకున్నా ఐదు ఆరు రోజుల్లో చనిపోతారు. ఈ మందు తీసుకున్న వాళ్ళు చాలా సాధారణంగా కనిపిస్తారు. కానీ క్రమంగా మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు పాడవుతాయి. డయాలిసిస్ చేస్తే వారి జీవిత కాలం మరో 10 రోజులు పొడిగించచ్చు. కానీ చావు మాత్రం తప్పించలేం” అని ఆయన చెప్పారు.
అమెజాన్ ద్వారా ఇంటింటికీ చేరుతున్న ఈ మందు పై నిషేధం కోసం గత కొంత కాలంగా పని చేస్తున్నట్టు ఆయన చెప్పారు. “రూ. 270 రూపాయలకు అమ్మే ఒక మందు డబ్బా 50 మంది ప్రాణాలు తీయగలదు. మా ప్రచారం వలన కొన్ని గ్రామాలు దీని వినియోగాన్ని పూర్తిగా నిషేధించాయి. మాజీ బిఆర్ఎస్ ఎంపీ బి. వినోద్ కుమార్ ఈ విషయం పై వ్యవసాయ మంత్రి, ముఖ్యమంత్రికి లేఖ రాశారు. నేను షార్ట్ ఫిల్మ్ చేస్తే వైరల్ అయింది. ఈ మందు తీసుకుని ఎంత మంది చనిపోయారని 100 మంది ఆర్టీఐలు దాఖలు చేశారని,” డాక్టర్ తెలిపారు.
‘‘హై కోర్టు జడ్జీలకు కూడా లెటర్ రాశాను. స్పందించిన హై కోర్టు దాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించి కేంద్ర సోలిసిటర్ జనరల్, రాష్ట్రంలోని సాధారణ పరిపాలనా విభాగానికి, వ్యవసాయ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖలకు నోటీసులు జారీ చేసి కేసులో ప్రతివాదులుగా చేసింది. ఈ మందుకు వ్యతిరేకంగా గత కొంత కాలంగా ప్రచారం నిర్వహిస్తున్న డాక్టర్లు ‘డాక్టర్స్ అగైన్స్ట్ పారాక్వాట్ పాయిజనింగ్’ అనే వేదిక ద్వారా దాని పై నిషేధం విధించాలి’’ అని నిఖిల్‌కు చికిత్స అందించిన డా. సతీష్ నారాయణ చౌదరి కోరుతున్నారు.
“మందు తీసుకున్న వాళ్ళు చూడటానికి చాలా సాధారణంగా కనిపిస్తారు. విద్యార్థి గా కనిపించే నిఖిల్ ను షాప్ యజమాని పారాక్వాట్ నీకు ఎందుకు అని అతన్ని అడిగితే ఈ విషాదం తప్పేదేమో. ఫోటోగ్రఫీ పై ఆసక్తి ఆ కుర్రవాడి జీవితం ఇలా అంతం కావటం విషాదకరం. చనిపోతున్న ప్రతి పదిమందిలో ఎనిమిది మంది గిరిజనులు ఉంటున్నారు. మందు ప్రభావంతో క్రమంగా ఒక్కో అంగం దెబ్బతిని కొన్ని రోజులకు చనిపోతారు. పైకి సాధారణంగా కనిపించే వ్యక్తి చనిపోవడాన్ని వాళ్ళ బంధు మిత్రులకు వివరించలేకపోతున్నాము,” అని డా. సతీష్ ఆవేదన చెందారు.
కూలీలను పెట్టుకుంటే ఖర్చులు పెరుగుతాయనే ఆలోచనతో రైతులు ఈ గడ్డి మందు వాడుతున్నారని, దాని ధర తక్కువగా ఉండటం కూడా దాని వాడకం పెరగటానికి దోహద పడుతోందని డా. సతీష్ అభిప్రాయ పడ్డారు.
రసాయనాల నియంత్రణ చట్టం:
దేశ వ్యవసాయ రంగంలో ప్రస్తుతం 1,000 కి మించి రసాయన మిశ్రమాలు వినియోగంలో ఉన్నాయని, వీటిలో చాలా రసాయనాలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్టు లేవని పర్యావరణ వేత్త, పాలసీ అనలిస్ట్ దొంతి నరసింహ రెడ్డి అభిప్రాయపడ్డారు. ‘‘పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ అంచనా ప్రకారం ఏటా సగటున 4 మిలియన్ టన్నుల విష రసాయనాలు (పురుగు మందులు) అమ్ముడవుతున్నాయి. ఇందులో అత్యధికం కలుపు నివారణ మందులు 50 శాతం కాగా, క్రిమిసంహారకాలు (30 శాతం), శిలీంద్రనాశకాలు (17 శాతం), రోడెంటిసైడ్లు, నెమటిసైడ్లు (3 శాతం) వంటివి వాడకంలో ఉన్నాయన్నారు. 1990ల ప్రారంభం నుంచి ఏటా 4,60,000 టన్నుల విష రసాయనం వార్షిక వినియోగం అవుతోందని ప్రపంచ ఆహార సంస్థ నివేదిక పేర్కొంది. ఇందులో మన దేశంలో దాదాపు 60,000 మెట్రిక్ టన్నుల రసాయనాలు వినియోగంలో ఉన్నాయి. వీటి వినియోగాన్ని విరివిగా పెంచటం వెనుక లాభాపేక్ష పాత్ర ఉంది’’ అని ఆయన వివరించారు.
‘‘దేశంలో 1968 లో విష రసాయనాల నియంత్రణ చట్టాన్ని ప్రవేశపెట్టారు. దానికి కొనసాగింపుగా 2008 లో మరో ముసాయిదా చట్టం రాగా, అందులో విష రసాయనాల బాధితులకు ఉపశమన చర్యలు, ధరల నియంత్రణ, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు లేకపోవడంతో పర్యావరణవేత్తలు వ్యతిరేకించారు. దీనిపై పార్లమెంటు ఒక కమిటీ వేయగా అది అనేక సిఫార్సులు చేసింది. ఇది బుట్ట దాఖలు కాగా 2020 లో తెచ్చిన మరో ముసాయిదాను ఇటు ప్రజలు, అటు పరిశ్రమ కూడా వ్యతిరేకించాయి.30 ఏళ్ళ తరువాత 2025 లో కేంద్రం మరో ముసాయిదా ప్రకటించింది. గత అనుభవాల నుంచి తగిన పాఠాలు తీసుకుని దీన్ని రూపొందిస్తారని ఆశిస్తున్నాం’’ అని నరసింహ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
“సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని పిలుపు నిచ్చే ప్రధాని ఆచరణలో విష రసాయనాల పరిశ్రమలను ప్రోత్సహించడం శోచనీయం. ఇవి ఇప్పుడు పన్ను రాయితీలు ఇవ్వాలని కోరుతున్నాయి. ఈ పరిశ్రమల ఏర్పాటును ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సరళీకృతం చేసింది. పర్యావరణ చట్టాలు అమలు కాకుండా వీటికి అనేక వెసులుబాట్లు కల్పించారు. వీటి వలన రైతులు, రైతు కూలీలు, గ్రామీణులు అప్పుల్లో కూరుకుపోతూ అనారోగ్యం పాలవుతున్నారు. వీటి వినియోగాన్ని తగ్గించే విధంగా నియంత్రణ చట్టం తయారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, విధాన కర్తల మీద ఉంది,” అని ఆయన అన్నారు.
అత్యంత హానికారకమైన కీటక నాశిని రసాయనాలను మనం ఎక్కువగా ఎగుమతి, దిగుమతి చేసుకుంటున్నామని పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ సీఈవో ఏ.డి. దిలీప్ కుమార్ పేర్కొన్నారు. వాటి వాడకం దేశంలో చాలా ఎక్కువగా ఉందన్నారు. “దేశంలో వాడకంలో ఉన్న ఈ రసాయనాలను సరిగ్గా అధ్యయనం చేయలేదు. ఇందులో అనేకం 1968 చట్టం అమలులోకి రాక ముందు నుంచే వాడకంలో ఉన్నాయి,” అని ఆయన అన్నారు.
రాష్ట్రాల పరిధిలో లేని నియంత్రణ:
‘‘విష రసాయనాల చట్టం ప్రకారం వాటిపై చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి మాత్రమే ఉంది. రాష్ట్రాలు వాటిని 60 రోజులు మాత్రమే నియంత్రించగలవు. ఆ సమయాన్ని 90 రోజుల వరకు మాత్రమే పెంచగలవు. కేరళ, ఒరిస్సా రాష్ట్రాలు పారాక్వాట్ ను నిషేధించినా కేంద్రం సహకరించకపోవటంతో అది గడువు తరువాత వీగిపోయింది. ఐదు క్రిమిసంహార మందులపై నిషేధం మహారాష్ట్ర ప్రభుత్వం 2017 లో కోరి కేంద్రం స్పందించకపోవటంతో ఆ ప్రయత్నం విఫలం అయ్యింది. వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోని అంశం కాబట్టి వాటికే ఈ రసాయనాల నియంత్రణ హక్కు ఉండాలి,’’ అని దిలీప్ అభిప్రాయపడ్డారు.
‘‘10/10/2022 నాటికి దేశంలో వాడకంలో ఉన్న 318 రసాయనాలలో 1/3వ వంతు (120) అత్యంత హానికారకమైన కీటక నాశిని రసాయనాలు. ఇందులో కొన్ని 81 ఇతర దేశాలలో నిషేధించినవి కావటం విస్తుగోలిపించే విషయం అనటంలో సందేహం లేదు’’ అని చెప్పారు.
“ఒక అధ్యయనం ప్రకారం వ్యవసాయం చేస్తున్న వారిలో 44 శాతం మంది సుమారు 86 లక్షల మంది వీటి ప్రభావానికి లోనవుతున్నారు. పొరపాటున జరిగే ప్రమాదాల వలన సంవత్సరానికి సుమారు 11,000 మంది చనిపోతున్నట్టు అది లెక్కగట్టింది. ఇందులో 60 శాతం మన దేశంలోనే జరుగుతున్నాయి. ఈ గడ్డు పరిస్థితిలోనూ రసాయనాలపై నిషేధం నిలబడకపోవటం వెనుక ఎంత బలమైన శక్తులు పనిచేస్తున్నాయో చెప్పకనే చెప్తోంది,” అని నరసింహ రెడ్డి అన్నారు.
డాక్టర్స్ అగైన్స్ట్ పారాక్వాట్ పాయిజనింగ్ సంస్థ కేంద్ర మంత్రికి రాసిన లేఖ:
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా కు ‘డాక్టర్స్ అగైన్స్ట్ పారాక్వాట్ పాయిజనింగ్’ తరపున రాసిన లేఖలో పలు విషయాలు ప్రస్తావించారు. పారాక్వాట్ ను వర్గీకరించటంలో తప్పులు జరిగాయని దాని వాడకం వలన ఎదురౌతున్న ఆరోగ్యసమస్యలు, మరణాలను పరిగణనలోకి తీసుకోలేదని గుర్తు చేశారు.
ఈ మందు ప్రభావాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫార్సులకు అనుగుణంగా వర్గీకరించే సమయంలో ఎలుకలపై చేసిన LD50 ప్రయోగాలపై ఆధారపడటం వలన అది మనుషులపై వేసే ప్రభావాన్ని ప్రతిబింబించ లేదని, ఊపిరితిత్తులతో పాటు ఇతర అవయవాలపై కనిపించే విషప్రభావాలను పరిగణించకపోవడం, తీసుకున్న మోతాదుకు మించి ప్రభావాన్ని సరిగ్గా అంచనా వేయకపోవడం; వినియోగిస్తున్న వారిపై, పర్యావరణం పై పడుతున్న ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయటం జరిగిందని వాళ్ళు ఉత్తరంలో ఎత్తి చూపుతూ తమ పరిశోధనలను సమర్పించటానికి మంత్రితో భేటీ కోరారు.
చైనా, యూరోపియన్ యూనియన్, బ్రెజిల్ సహా 67 దేశాలలో ఈ మందును నిషేధించారని దాని మూలంగా పార్కిన్సన్ వ్యాధి పెరుగుతోందని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు డా. రాకేశ్ కుమార్ చెన్నా ఈ ఉత్తరంలో రాశారు. రైతులు రక్షణ పరికరాలు వినియోగించకపోవటం, మందు ఇళ్ళలో నిల్వ ఉంచిన సమయంలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉండటం, వాటికి విరుగుడుగా అంటిడోట్ లేకపోవటం వల్ల అంతర్గత అవయవాలకు తీవ్ర నష్టం కలుగుతోంది, అని ఆయన మంత్రికి తెలియచేశారు.
దీర్ఘకాలంగా ఈ మందు ప్రభావానికి లోనైన వాళ్ళకు ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్, మూత్రపిండ వైఫల్యం, నాడీ సంబంధిత వ్యాధులు వస్తున్నట్టు వెల్లడి అయ్యిందని ఆయన చెప్పారు. మందు తీసుకున్న ఒక్కో రోగికి ఐసీయు లో చికిత్స కోసం రు. 50,000 నుంచి రు. 2,00,000 ఖర్చు అవుతోంది. ప్రజలకు దీర్ఘకాలిక పార్కిన్సన్ చికిత్సకు రు. 1,000 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనాలు ఉన్నాయి. వీటి వాడకం వలన నేలలోని సూక్ష్మజీవాలకు నష్టం జరిగి దిగుబడులు తగ్గుతాయని డాక్టర్లు తమ లేఖలో పేర్కొన్నారు.
ఈ నేపధ్యంలో రైతులను రక్షించి, ఆహార భద్రతకు హామీ పడుతూ ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న ఆరోగ్యకరమైన సంప్రదాయాలను మన దేశంలో అమలు చేసేట్టు చూడాలని ఉత్తరం లో రాకేశ్ కుమార్ చెన్నా కోరారు.

