ఒడిశాలో కమలం వికసించదా? సీఎం నవీన్ పట్నాయక్ లెక్కలేంటి?
x

ఒడిశాలో కమలం వికసించదా? సీఎం నవీన్ పట్నాయక్ లెక్కలేంటి?

ఒడిశాలో అధికార పగ్గాలు చేపట్టేదెవరు? మోదీ చెప్పినట్లుగా ఈ దఫా ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ దక్కించుకుంటుందా? ఆ అవకాశం లేదని సీఎం పట్నాయక్ ఎలా చెప్పగలుగుతున్నారు?


రాష్ట్రంలో వరుసగా ఆరోసారి బిజెడి అధికారంలోకి వస్తుందని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పదేళ్లు కూడా తామే అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు.

భువనేశ్వర్‌లో జూన్ 10న ‘బీజేపీ ముఖ్యమంత్రి’ ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్రం మోదీ చెప్పడంపై పట్నాయక్ స్పందించారు.

"జూన్ 10న ఏమీ జరగదు. మోదీ కల ఎప్పటికీ నెరవేరదు. ఒడిశాలో కమలం వికసించే అవకాశమే లేదు. ఈ సారి కూడా మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం.’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

'బిజూ పట్నాయక్‌కు భారతరత్న ఎందుకు ఇవ్వరు?'

బిజూ పట్నాయక్‌ను భారతరత్నకు ఎందుకు ఇవ్వరని కేంద్రాన్ని ప్రశ్నించారు పట్నాయక్.

కేంద్రం ఇటీవల పలువురికి భారతరత్న ప్రకటించడాన్ని ప్రస్తావిస్తూ..

“ఒడిషాలో చాలా మంది ధైర్యవంతులు ఉన్నారు. వారిలో కొందరి గురించి మీరు (మోదీ) మాట్లాడారు. బిజూ పట్నాయక్‌తో సహా వారిలో ఎవరూ భారతరత్నకు అర్హులు కాదా?’’ అని మోదీని పట్నాయక్ సూటిగా ప్రశ్నించారు.

2014, 2019లో మోదీ, బీజేపీ ప్రజలకు చేసిన వాగ్దానాలను ఒడిశా ప్రజలు ఇంకా గుర్తుంచుకున్నారని, 24 ఏళ్ల పాటు బీజేడీ ప్రభుత్వాన్నీ చూశామని పేర్కొన్నారు.

నెరవేర్చని వాగ్దానాలు..

"2014, 2019లో మీరు చేసిన వాగ్దానాలు మీకు గుర్తున్నాయా? ఒడిశా ప్రజలు మీ వాగ్దానాన్ని గుర్తుంచుకున్నారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ, 2 కోట్ల ఉద్యోగాలు, LPG, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గింపు, మారుమూల ప్రాంతాలలో మొబైల్ కనెక్టివిటీ గురించి ఎన్నో వాగ్దానాలు చేశారు. అవన్నీ ఏమయ్యాయి. కేవలం ఎన్నికల వేళ ఒడిశాను గుర్తుకు తెచ్చుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు’’ అని అన్నారు పట్నాయక్.

మా భాషకు గుర్తింపు ఇవ్వరా?

సంస్కృతాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం రూ.1,000 కోట్లు కేటాయించారని గుర్తు చేస్తూ.. సాంప్రదాయ భాష ఒడియాకు డబ్బు ఇవ్వలేదని పట్నాయక్ మండిపడ్డారు.

"శాస్త్రీయ ఒడిస్సీ సంగీతానికి గుర్తింపు కోసం నేను ప్రతిపాదనలు పంపాను. మీరు వాటిని రెండుసార్లు తిరస్కరించారు" అని పేర్కొన్నారు.

‘‘రైతుల గురించి మోదీ మర్చిపోయారు. ఎంఎస్‌పిని రెట్టింపు చేస్తామన్న హామీని ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు.’’

‘‘ఒడిశా ప్రజలను దృష్టిలో పెట్టుకుని కోస్టల్ హైవే నిర్మించాల్సిన మీరు మళ్లీ ఈ ప్రాజెక్టును మరిచిపోయారు.’’

ఒడిశా సహజ సంపద బొగ్గుపై ప్రధాని 10 సంవత్సరాలుగా రాయల్టీని సవరించడం కూడా మర్చిపోయారు" అని నవీన్ పట్నాయక్ మోదీపై దుమ్మెత్తిపోశారు.

ఒడిశాలో మొత్తం 21 లోక్‌సభ స్థానాలకు , 147 అసెంబ్లీ స్థానాలకు మే 13న పోలింగ్ జరగనుంది.

Read More
Next Story