ఉతర్త బెంగాల్‌లో కమలం వికసించేనా?
x

ఉతర్త బెంగాల్‌లో కమలం వికసించేనా?

ఉత్తర బెంగాల్‌లో గతంలో కంటే ఎక్కువ స్థానాలను గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. రామమందిర ప్రారంభోత్సవం, మోదీ ప్రచారం లోక్ సభ ఎన్నికలలో ప్రభావం చూపుతాయా?


రాముడి చిత్రం దాని కిందే హిందీలో 'జై శ్రీ రామ్' అని రాసి ఉన్నఅనేక కాషాయ జెండాలు రెపరెపలు ఉత్తర బెంగాల్‌లో సామాజిక, రాజకీయ రంగాల్లో మార్పును తెలియజేస్తున్నాయి.

2019లో ఉత్తర బెంగాల్‌లోని 8 పార్లమెంటరీ సీట్లలో ఏడింటిని బిజెపి గెలుచుకుంది. 2021 అసెంబ్లీ ఎన్నికలలో కూడా TMCకి గట్టి పోటీ ఇచ్చింది. ఈ ప్రాంతంలోని 54 అసెంబ్లీ స్థానాల్లో 37 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా.. టీఎంసీ 13 సీట్లతో సరిపెట్టుకుంది.

బీజేపీ వ్యూహరచన..

గతంలో వచ్చిన ఏడింటి కంటే తగ్గకుండా ఈ సారి ఎక్కువ స్థానాలను కైవసం చేసుకునే దిశగా బీజేపీ వ్యూహరచన చేస్తోంది. ‘‘ఈ లోక్‌సభ ఎన్నికలు రాష్ట్రం నుంచి టీఎంసీని గద్దె దించేందుకు మార్గం సుగమం చేయగలవు. అది జరగాలంటే ఉత్తర బెంగాల్‌లో మొత్తం ఎనిమిది సీట్లు కావాలి. ఇక్కడి ప్రతి పోలింగ్ బూత్‌లోనూ కమలం వికసించాలి’’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఈ ప్రాంతంలోని వాణిజ్య కేంద్రమైన మరియు అతిపెద్ద నగరమైన సిలిగురి శివార్లలోని కవాఖలిలో జరిగిన ర్యాలీలో పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో హిందువుల మద్దతు గణనీయంగా పెరగడం వల్ల ఈ పని బీజేపీకి అంత కష్టమేం కాదు.

నేటికీ కాషాయ జెండా రెపరెపలు..

అయోధ్యలో జనవరి 22న హిందూ ఆరాధ్య దైవం రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే రోజు కూడా. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కాషాయ జెండాలు డార్జిలింగ్, సిలిగురి, జల్పాయిగురి, అలీపుర్దార్, కూచ్ బెహార్, రాయ్‌గంజ్, బలూర్‌ఘాట్, మాల్దా నేటికీ రెపరెపలాడుతున్నాయి.

డార్జిలింగ్‌కు చెందిన మాజీ ఎంపి, ట్రేడ్ యూనియన్ నాయకుడు సమన్ పాఠక్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో బిజెపికి మద్దతు పెరగడం అంటే భిన్నమైన జాతులు, కుల సమూహాలను ఆకర్షించడమేనన్నారు.

ఉత్తర బెంగాల్ ప్రాంతం 1970లలో ఉత్తర ఖండ ఉద్యమం, గూర్ఖాలాండ్ ఉద్యమం, 1980లలో ఉత్తర బాంగో తప్సిలీ జాతి కుల ఉద్యమం 1990లలో కమ్తాపురి ఉద్యమాలను చవిచూసింది. ఈ ప్రాంత రాజకీయాలను గురించి పూర్తి అవగాహన కోసం నిరంతరం మారుతున్న జనాభా ప్రొఫైల్‌ను విశ్లేషించడం చాలా కీలకం సిలిగురిలో ఉన్న రాజకీయ వ్యాఖ్యాత ప్రొబిర్ ప్రమాణిక్ పేర్కొన్నారు.

జనాభాపరంగా..ఇది రాష్ట్రంలోని అత్యంత వైవిధ్యభరితమైన ప్రాంతం. మొత్తం నాలుగు భాషా కుటుంబాలు - ఇండో-యూరోపియన్, ఆస్ట్రిక్, టిబెటో-చైనీస్ ద్రావిడియన్లు నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలోని ప్రధాన జాతి సమూహాలైన బెంగాలీలు, రాజ్‌బన్‌షీలతో పాటు, నేపాలీలు, ఆదివాసీలు, భూటానీలు, టిబెటన్లు, తమాంగ్, లెప్చా, లింబూ, మెచ్, రభా, టోటోస్ వంటి ఇతర జాతులు కూడా ఇదే ప్రాంతంలో నివసిస్తున్నారు.

వలసలతో పెరిగిన జనాభా..

అనేక మంది వ్యక్తులు ఉత్తర బెంగాల్‌కు వలసవచ్చారు. కొత్తగా ఏర్పాటైన తేయాకు తోటల్లో పని చేయడం కోసం బ్రిటిష్ వారు ఉత్తర బెంగాల్‌లోని ఆదివాసీలను చోటానాగ్‌పూర్ ప్రాంతం నుండి డోయర్స్, తెరాయ్ ప్రాంతాల వెళ్లేందుకు ఒప్పించారు. ఇలా వలస వెళ్లడం 19వ శతాబ్దం ద్వితీయార్థంలో జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ 1835లో సిక్కింలోని హిల్ స్టేషన్ దాని పరిసర ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడంతో డార్జిలింగ్‌లో వలసదారుల సంఖ్య పెరిగిపోయింది. 1829లో డార్జిలింగ్ జనాభా కేవలం 100 మాత్రమే. కంపెనీ కొనుగోలు చేసిన 10 ఏళ్లలోపు దాదాపు 10వేలకు పెరిగింది. భారతదేశ విభజన తరువాత, తూర్పు పాకిస్తాన్ నుండి చాలా మంది బెంగాలీ హిందూ వలసదారులు ఈ ప్రాంతానికి వచ్చారు. 1950లో టిబెట్‌ను చైనా స్వాధీనం చేసుకున్న తర్వాత వేల టిబెటన్లు ఈ ప్రాంతానికి వచ్చారు.

బీజేపీ రాజకీయం..

మోడీ ప్రభుత్వంలో బెంగాల్‌కు చెందిన నలుగురు మంత్రుల్లో ఇద్దరు ఈ ప్రాంతానికి చెందినవారే. గూర్ఖాలాండ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుందన్న హామీతో నేపాలీ వర్గాలను ఆకర్షిస్తూ.. 2009 నుంచి డార్జిలింగ్ పార్లమెంటరీ స్థానాన్ని బీజేపీ గెలుచుకుంటూ వస్తుంది. అనంత మహారాజ్ నేతృత్వంలోని గ్రేటర్ కూచ్ బెహార్ పీపుల్స్ అసోసియేషన్ వంటి రాజ్‌బాంగ్షి గ్రూపులతో పొత్తులు పెట్టుకోవడం ద్వారా 2019 పార్లమెంటరీ ఎన్నికలకు ముందు తన ప్రభావాన్ని విస్తరించింది. ఇందులో ఆదివాసీ వర్గానికి చెందిన ప్రముఖ నాయకుడు, అఖిల భారతీయ ఆదివాసీ వికాస్ పరిషత్ (ABAVP) నుండి జాన్ బార్లా కూడా ఉన్నారు. కొత్త పౌరసత్వ చట్టం ప్రకారం పౌరసత్వ వాగ్దానంతో హిందూ షెడ్యూల్డ్ కులాల సమూహం మతువాస్‌ను ఆకర్షించింది.

స్థానిక నేతలకు ప్రోత్సాహం..

ఈ ప్రాంతాన్ని బెంగాల్ నుండి విడదీసి, సొంత రాష్ట్రంగా లేదా కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసే అవకాశాన్ని పార్టీ పరిశీలించింది.

గతేడాది పశ్చిమ బెంగాల్‌ నుంచి అనంత మహారాజ్‌ను తొలిసారి రాజ్యసభ ఎంపీని చేసింది. ఈయన బెంగాల్ కూచ్ బెహార్ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం లేదా UT హోదాను గట్టిగా సమర్థించారు.

సవాళ్లు - మారుతున్న సమీకరణాలు..

ఈసారి బిజెపి సవాళ్లను ఎదుర్కొంటోంది. మోదీ ప్రభుత్వం హామీలను నిలబెట్టుకోలేకపోవడమే అందుకు ప్రధాన కారణం.

“15 ఏళ్లుగా మమ్మల్ని మోసం చేసినందున గూర్ఖాలు ఈసారి బీజేపీకి ఓటు వేయరు. 2009 నుండి బిజెపికి ఓటు వేయడం ద్వారా గూర్ఖాలు ఏ ప్రయోజనం పొందలేదు, ”అని హమ్రో పార్టీ అధ్యక్షుడు అజోయ్ ఎడ్వర్డ్స్ ది ఫెడరల్‌తో అన్నారు. మొన్నటి వరకు ఈయన బీజేపీ మిత్రపక్షంగా ఉన్నారు. భారతీయ గూర్ఖా ప్రజాతాంత్రిక్ మోర్చా (BGPM) కూడా బీజేపీ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమైనందుకు ఆ పార్టీకి తగిన సమాధానం ఇవ్వాలని గూర్ఖాలకు పిలుపునిచ్చారు.

పెరుగుతోన్న అంసతృప్తి..

ఇదిలా ఉండగా.. తకుర్సియోంగ్‌ ఎమ్మెల్యే బిష్ణు ప్రసాద్ శర్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం బీజేపీని కలవరపెడుతుంది. ఆయన తన నామినేషన్ ఉపసంహరించుకునేందుకు పార్టీ అగ్రనాయకత్వం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది.

డార్జిలింగ్‌లో ఏప్రిల్ 26న ఈ ప్రాంతంలోని మరో రెండు నియోజకవర్గాలు - రాయ్‌గంజ్, బలూర్‌ఘాట్‌తో పాటు పోలింగ్ జరుగుతుంది.

రాజ్‌బన్షీలు, ఆదివాసీలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోవడంతో బిజెపి అసంతృప్తిని ఎదుర్కొంటోంది. తమకు టిక్కెట్ నిరాకరించడంపై పార్టీ ఇద్దరు ఎంపీలు జాన్ బార్లా, అనంత మహారాజ్ మండిపడుతున్నారు.

ఏప్రిల్ 19న మొదటి దశలో ఎన్నికలలో ఈ అంశాలన్ని ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆల్-ఇండియా మెచ్ సమాజ్, నగేసియా కిషన్ ఆదివాసీ సమాజ్ (NKAS), కంప్తపురి ప్రజల సంస్థ కమతా రాజ్‌బన్షి పరిషత్ ఈ నెల మొదట్లో TMCకి మద్దతు ప్రకటించాయి. ఈ గ్రూపులు గతంలో బీజేపీకి మద్దతిచ్చాయి. ‘‘లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మూడుసార్లు మద్దతిచ్చాం. కాని ఈసారి టీఎంసీ అభ్యర్థులకే మద్దతు ఇస్తాం’’ అని ఎన్‌కేఏఎస్ సలహాదారు సునీల్ నగేసియా అన్నారు.

పార్టీని గట్టెక్కించే బాధ్యతను భుజాన వేసుకున్న ప్రధాని మోదీ ఈ ప్రాంతంలో మెరుపుదాడి ప్రారంభించారు. సిలిగురి, కూచ్ బెహార్ జల్పాయిగురిలో మూడు సమావేశాలలో ప్రసంగించారు. మొన్నటి వరకు వారి ర్యాలీలు పెద్ద ఎత్తున జనాలను ఆకర్షించడం బీజేపీ సానుకూల అంశం. బీజేపీకి కంచుకోటను కాపాడుకోవడంలో మోదీ సహకరిస్తారో లేదో చూడాలి.

Read More
Next Story