దీపస్తంభంపై దీపం వెలగలేదంటే కోర్టు ధిక్కరణ జరిగినట్టేనా?
x

దీపస్తంభంపై దీపం వెలగలేదంటే కోర్టు ధిక్కరణ జరిగినట్టేనా?

తిరుప్పరంకుండ్రం దీపం వివాదం లో ఏం జరగబోతోంది?


Click the Play button to hear this message in audio format

తమిళనాడులోని మదురై తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించకపోవడం ఇప్పుడు మరోసారి న్యాయపరమైన చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ దీపస్తంభంపై దీపం వెలగలేదు.

అయితే, దీపం వెలగకపోయినంత మాత్రాన ఆలయ అధికారులు ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లు నిర్ధారించలేము. అసలు సుప్రీంకోర్టు ఆదేశాల్లో ఏముంది? ఆలయ ట్రస్టీలు ఏం చెబుతున్నారు? జిల్లా కలెక్టర్ నివేదికలో ఏం పేర్కొన్నారు? ఈ వ్యవహారంలో కోర్టు ధిక్కరణ వర్తిస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

నవంబర్ 24న తిరుప్పరంకుండ్రంలో కార్తీక దీపాన్ని సంప్రదాయంగా వెలిగించే దీప మండపంలోనే వెలిగించారు. వివాదానికి కారణమైన కొండపై ఉన్న దీపత్తూన్ అనే దీపస్తంభం దగ్గర మాత్రం వెలిగించలేదు.
ఈ వ్యవహారంపై నవంబర్ 20న సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను మూడు రకాలుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని న్యాయ విశ్లేషణ పేర్కొంటోంది.
మొదటి వాదన ప్రకారం.. సంప్రదాయ దీప మండపంతో పాటు దీపస్తంభం వద్ద కూడా దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. అయితే, దీపం వెలిగించేందుకు ఆలయ యాజమాన్యం ఒక బృందానికి అనుమతి ఇవ్వాలని స్పష్టంగా ఆదేశించలేదన్నది ఈ వాదన.
రెండో వాదనను మద్రాస్ హైకోర్టు అనుసరించింది. సుప్రీంకోర్టు నవంబర్ 20న ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. నవంబర్ 24నే దీపస్తంభం వద్ద దీపం వెలిగించాల్సి ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. అంటే కేవలం ఏర్పాట్లు చేస్తే సరిపోదని, దీపం వెలిగించే కార్యక్రమం కూడా జరగాల్సిందేనని పేర్కొంది.
ఇక మూడో అంశం ఆలయ ట్రస్టీల వైఖరికి సంబంధించినది. దీపస్తంభాన్ని సంప్రదాయ దీప మండపానికి అదనంగా మరో చోటుగా కాకుండా, సంప్రదాయ స్థలానికి ప్రత్యామ్నాయంగా వారు భావించినట్లు కనిపిస్తోంది. అయితే, సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో సంప్రదాయ పూజా కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలగకూడదని స్పష్టంగా పేర్కొంది.

కలెక్టర్ నివేదికలో ఏముంది?

మదురై జిల్లా కలెక్టర్ నిశాంత్ కృష్ణ సుప్రీంకోర్టుకు సమర్పించిన ప్రాథమిక నివేదికలో కీలక విషయాలు వెల్లడించారు.
దీపస్తంభం వద్ద దీపం వెలిగించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఆలయ దేవస్థానం నుంచి అనుమతి పొందాలని పలుమార్లు ప్రయత్నించినప్పటికీ, తమకు ఎలాంటి అధికారిక అనుమతి అందలేదని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు నవంబర్ 20న ఇచ్చిన ఉత్తర్వుల్లో 14వ పేరాలోని ఆరో ఉప అంశం ప్రకారం.. సంప్రదాయంగా నిర్వహించే మతపరమైన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగాలని స్పష్టం చేసింది.
అదే సమయంలో 13వ పేరాలో దీపస్తంభం వద్ద కూడా దీపం వెలిగించేందుకు ఒకసారి ప్రత్యేక అనుమతి ఇచ్చింది. అంటే సంప్రదాయ దీప మండపంలో దీపం వెలిగించడంతో పాటు, అదనంగా దీపస్తంభం వద్ద కూడా దీపం వెలిగించవచ్చన్నది ఆదేశాల సారాంశం.
అయితే, ఈ కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు కొన్ని షరతులు విధించింది. దీపస్తంభం వద్దకు ప్రజలను అనుమతించకుండా నియంత్రించడం, భద్రతా ఏర్పాట్లు చేయడం వంటి బాధ్యతలను అధికారులకు అప్పగించింది.

అసలు వివాదం ఎక్కడ మొదలైంది?

ఈ వ్యవహారాన్ని అర్థం చేసుకోవాలంటే మద్రాస్ హైకోర్టు జనవరి 6, 2026న ఇచ్చిన తీర్పును కూడా పరిశీలించాలి. ఆ తీర్పులోని 141వ పేరా ప్రకారం.. దీపస్తంభం వద్ద ఆలయ దేవస్థానమే దీపం వెలిగించాలని హైకోర్టు పేర్కొంది.
అయితే, నవంబర్ 20న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు ఈ అంశానికి సంబంధించిన హైకోర్టు తీర్పులోని కొన్ని ఆదేశాల అమలును నిలిపివేసింది. అదే సమయంలో తన మధ్యంతర ఆదేశాలను అమలు చేయాలని సూచించింది.

ఇక్కడే కీలకమైన న్యాయపరమైన అంశం ఉంది.

సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లోని 13వ పేరాలో దీపస్తంభం వద్ద దీపం వెలిగించడాన్ని అనుమతించేందుకు తగినదిగా భావిస్తున్నట్లు పేర్కొంది. కానీ, ఈ పదాలను ఆలయ అధికారులు తప్పనిసరిగా అక్కడ దీపం వెలిగించాలన్న ఆదేశంగా అర్థం చేసుకోలేమని విశ్లేషణ చెబుతోంది.
మరోవైపు, దీపస్తంభం వద్ద దీపం వెలిగించేందుకు ఎవరు వెళ్లాలన్న అంశాన్ని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆలయ దేవస్థానం అనుమతించిన బృందమే అక్కడ దీపం వెలిగించాలని పేర్కొంది.
ఈ బృందంలో ఎంతమంది ఉండాలి? ఎవరెవరు ఉండాలి? అన్నది జిల్లా కలెక్టర్ నిర్ణయించాలి. ఇందుకోసం ఆలయ కార్యనిర్వాహక అధికారి, పోలీస్ కమిషనర్, భారత పురావస్తు శాఖ అధికారులతో సంప్రదింపులు జరపాలని సూచించింది.
అయితే, బృందాన్ని ఎంపిక చేసే అధికారం కలెక్టర్‌కు ఉన్నప్పటికీ, ఆ బృందానికి అనుమతి ఇచ్చే అధికారం మాత్రం ఆలయ దేవస్థానానిదే. ఒకవేళ దేవస్థానం ఎవరినీ అనుమతించకపోతే ఏం చేయాలన్నది సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొనలేదు.

ఆలయ ట్రస్టీల వాదన ఏంటి?

నవంబర్ 24న ఆలయ ట్రస్టీలు తమ నిర్ణయాన్ని వివరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఉచ్చి పిళ్లయార్ ఆలయం సమీపంలోని దీప మండపం ప్రధాన దేవత తలపై భాగంలో ఉంటుందని, చాలా కాలంగా అక్కడే సంప్రదాయబద్ధంగా కార్తీక దీపం వెలిగిస్తున్నామని తెలిపారు.
ఆలయ వారసత్వ పూజారులు, మతపరమైన రికార్డులు, ఆగమ శాస్త్ర నియమాలను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ట్రస్టీలందరూ ఏకగ్రీవంగా సంప్రదాయ దీప మండపంలోనే దీపం వెలిగించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అలాగే ఆలయ ఆచార సంప్రదాయాల గురించి న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
దీంతో నవంబర్ 24న సాయంత్రం ఆరు గంటల సమయంలో సంప్రదాయ స్థలంలో దీపం వెలిగించారు. కలెక్టర్ నివేదిక మాత్రం మరో విషయాన్ని వెల్లడించింది. నవంబర్ 22నే ఆలయ కార్యనిర్వాహక అధికారి దీపస్తంభం వద్ద దీపం వెలిగించేందుకు పది మందితో కూడిన బృందాన్ని ప్రతిపాదించారని తెలిపింది.
నవంబర్ 24న కూడా ఆ బృందానికి ట్రస్టీల అనుమతి కోరినట్లు కార్యనిర్వాహక అధికారి తనకు లిఖితపూర్వకంగా తెలియజేశారని కలెక్టర్ పేర్కొన్నారు. ట్రస్టీలు అనుమతిస్తేనే తదుపరి ఏర్పాట్లు, దీపారాధన కార్యక్రమం కొనసాగుతాయని ఆమె చెప్పినట్లు నివేదికలో వివరించారు.
కానీ ట్రస్టీల తీర్మానం కారణంగా దీపస్తంభం వద్ద కార్యక్రమం నిర్వహించలేకపోయామని కార్యనిర్వాహక అధికారి తరువాత తెలియజేసినట్లు కలెక్టర్ చెప్పారు.

మద్రాస్ హైకోర్టు ఏమంది?

ఈ పరిణామాల నేపథ్యంలో నవంబర్ 24న మద్రాస్ హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలను కఠినంగా అర్థం చేసుకుంది. దీపస్తంభం వద్ద ఆ రోజే దీపం వెలగాల్సి ఉందని, కేవలం ఏర్పాట్లు చేయడం మాత్రమే సరిపోదని అభిప్రాయపడింది. దీపం తప్పనిసరిగా వెలగాలని సుప్రీంకోర్టు ఆదేశించినట్లు పేర్కొంది.
జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఆలయ కార్యనిర్వాహక అధికారి, ట్రస్టీలు సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత కలిగి ఉన్నారని గుర్తుచేసింది. అయితే, కొత్తగా దీపం వెలిగించాలని ప్రత్యేక ఆదేశాలు ఇవ్వలేదు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయాన్ని నమోదు చేసింది.

దీపం వెలగకపోతే కోర్టు ధిక్కరణేనా?

ఈ వివాదంలో అత్యంత కీలకమైన అంశం కోర్టు ధిక్కరణకు సంబంధించిన న్యాయపరమైన నిర్వచనం. కోర్టు ధిక్కరణ చట్టంలోని సెక్షన్ 2(బి) ప్రకారం సివిల్ కాంటెంప్ట్ నిర్ధారించాలంటే కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు నిరూపించాల్సి ఉంటుంది.
దీనికి సంబంధించి 2014లో రామ్ కిషన్ వర్సెస్ తరుణ్ బజాజ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ కేసులో రెండు వేర్వేరు కోర్టు ఉత్తర్వులను ఎలా అర్థం చేసుకోవాలన్న దానిపై వివాదం ఏర్పడింది. ఉద్యోగిని తిరిగి విధుల్లోకి తీసుకోవడంతో పాటు ఇతర ప్రయోజనాలు కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే, ఆ తర్వాత సుప్రీంకోర్టు బకాయి జీతాలు కూడా చెల్లించాలని పేర్కొంది.
ఈ ఉత్తర్వులను ఉద్యోగి, యాజమాన్యం వేర్వేరుగా అర్థం చేసుకున్నారు. దీంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. అయితే, రెండు ఉత్తర్వులను కలిపి పరిశీలించిన సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణకు తగిన ఆధారాలు లేవని పేర్కొంది. ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.
ఈ సందర్భంగా కోర్టు ఇచ్చిన ముఖ్యమైన వివరణ ఏమిటంటే.. ఒకే ఆదేశానికి రెండు రకాల అర్థాలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు, సంబంధిత వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ధిక్కరించినట్లు ఆధారాలు లేకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోలేమని స్పష్టం చేసింది.
అలాగే, కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా ఆదేశాలను అమలు చేయలేకపోతే దాన్ని కూడా ఉద్దేశపూర్వక ఉల్లంఘనగా పరిగణించలేమని పేర్కొంది.

ట్రస్టీలు ఉద్దేశపూర్వకంగా ధిక్కరించారా?

ఇప్పుడు ఇదే సూత్రాన్ని తిరుప్పరంకుండ్రం వివాదానికి అన్వయించాల్సి ఉంటుంది.కలెక్టర్ నివేదిక ప్రకారం.. ఆలయ కార్యనిర్వాహక అధికారి దీపస్తంభం వద్ద దీపం వెలిగించేందుకు ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నించారు. కానీ, ట్రస్టీల నుంచి బృందానికి అవసరమైన అనుమతి రాలేదు.
అయితే, ట్రస్టీలు ఎందుకు అనుమతి ఇవ్వలేదు? వారి నిర్ణయం వెనుక ఉద్దేశం ఏమిటి? సుప్రీంకోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా? అన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.
కలెక్టర్ తన ప్రాథమిక నివేదికలో ఈ పరిణామాలను వివరించారు. మరిన్ని ఆధారాలతో అనుబంధ నివేదిక సమర్పించేందుకు కూడా అనుమతి కోరారు. అందువల్ల దీపస్తంభం వద్ద దీపం వెలగకపోవడంపై వివరణ అవసరమే అయినప్పటికీ, ఆలయ ట్రస్టీలు సంప్రదాయ పూజా కార్యక్రమాన్ని నిర్వహించినంత మాత్రాన వారు సుప్రీంకోర్టును ఉద్దేశపూర్వకంగా ధిక్కరించినట్లు నిర్ధారించలేమన్నది ఈ న్యాయ విశ్లేషణలోని ప్రధాన అంశం.
మొత్తంగా చూస్తే, తిరుప్పరంకుండ్రం వివాదం కేవలం దీపం ఎక్కడ వెలిగించాలన్న అంశానికే పరిమితం కాలేదు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల అసలు ఉద్దేశం ఏమిటి? వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది? ఆదేశాల అమలులో వైఫల్యం జరిగితే దానికి ఉద్దేశపూర్వక ఉల్లంఘన అనే ముద్ర వేయవచ్చా? అన్న కీలక న్యాయపరమైన ప్రశ్నల చుట్టూ ఈ వివాదం కొనసాగుతోంది.
Read More
Next Story