
కల్వకుంట్ల ఫ్యామిలీకి బీజేపీ ఆశీస్సులున్నాయా ?
కాళేశ్వరం అవినీతిపై సీబీఐ(CBI) దర్యాప్తు జరపాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రం హోంశాఖకు మూడునెలల క్రితం లేఖరాస్తే ఇప్పటివరకు పట్టించుకోలేదు
క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. విషయం ఏమిటంటే తెలంగాణలో సంచలనం సృష్టించిన రెండు కేసుల్లో దర్యాప్తు చేయమని, దర్యాప్తుకు అనుమతి ఇవ్వమని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం విజ్ఞప్తికి ఎన్డీయే ప్రభుత్వం నెలలు గడుస్తున్నా పట్టించుకోలేదు. (Kaleshwaram Project)కాళేశ్వరం అవినీతిపై సీబీఐ(CBI) దర్యాప్తు జరపాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రం హోంశాఖకు మూడునెలల క్రితం లేఖరాస్తే ఇప్పటివరకు పట్టించుకోలేదు. అలాగే ఫార్ములా ఈ కార్ రేసు కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ పై కేసులు నమోదు చేసి విచారించేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రహోంశాఖ పరిధిలో పనిచేసే డీవోపీటీకి రెండుసార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదు. ఈ విషయాన్ని స్వయంగా రేవంత్ రెడ్డి బయటపెట్టారు. అర్వింద్ కుమార్ పై కేసునమోదు చేసి దర్యాప్తుచేయాలి అనుమతి ఇవ్వమని రెండుసార్లు లేఖలు రాసినా డీవోపీటీ పట్టించుకోవటంలేదని రేవంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.
ఒకవైపేమో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ మీద కేసులు ఎందుకు పెట్టలేదు ? ఇంకా ఎందుకు అరెస్టుచేయలేదని పదేపదే రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మరోవైపేమో దర్యాప్తు చేయటానికి సీబీఐ ఎందుకు రంగంలోకి దిగలేదో అర్ధంకావటంలేదు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి కూడా సీబీఐ దర్యాప్తు విషయమై నోరిప్పటంలేదు. కేసీఆర్ మీద కేసులుపెట్టండి, అరెస్టుచేయండని డిమాండ్ చేస్తున్న బండి తన శాఖ పరిధిలోనే ఉన్న సీబీఐతో ఎందుకు దర్యాప్తు చేయటంచటంలేదో అర్దంకావటంలేదు. బండి, కిషన్ వైఖరితోనే కేసీఆర్ మీద కేసులు పడకుండా, విచారణలు జరిగి అరెస్టు కాకుండా కేంద్రమే అడ్డుకుంటోందేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
నిజంగానే కాళేశ్వరం అవినీతిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకునే ఉద్దేశ్యమే కేంద్రప్రభుత్వానికి ఉంటే సీబీఐ ఎందుకు కేసు టేకప్ చేయటంలేదు ? కేసు దర్యాప్తుచేయాలని రాష్ట్రప్రభుత్వం సిఫారసు చేసి రెండునెలలు దాటినా ఇప్పటివరకు కేంద్రహోంశాఖ నోరిప్పటంలేదు. దీంతోనే చేస్తున్న డిమాండ్ కు వాస్తవంగా జరుగుతున్నదానికి చాలా తేడాలున్నట్లు అందరికీ అర్ధమైపోతోంది. అందుకనే కేసీఆర్ కు తెరవెనుక బీజేపీ మద్దతుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అనుమానాలు పెరిగిపోవటానికి మరో కారణం కూడా ఉంది.
అదేమిటంటే ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ ఏ1 నిందితుడు అన్న విషయం తెలిసిందే. అధికార దుర్వినియోగంతో పాటు అవినీతి కూడా జరిగిందనేందుకు ఏసీబీతో పాటు ఈడీ కూడా చాలా సాక్ష్యాలను సంపాదించాయి. కేటీఆర్ మీద చర్యలు తీసుకోవాలంటే ముందు గవర్నర్ అనుమతించాలి. తర్వాత సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ మీద యాక్షన్ తీసుకునేందుకు కేంద్రహోంశాఖ పరిధిలోని డీవోపీటీ అనుమతించాలి. కేటీఆర్ మీద కేసు నమోదుచేసి యాక్షన్ తీసుకోవాలంటే గవర్నర్ అనుమతించాలి. అందుకనే గవర్నర్ అనుమతి కోరింది రాష్ట్రప్రభుత్వం. ప్రభుత్వం పదేపదే అడిగిన సుమారు 72 రోజుల తర్వాత గవర్నర్ అనుమతించారు. అంటే దాదాపు రెండున్నర నెలలు గవర్నర్ సంబంధిత ఫైలును తన దగ్గరే అట్టిపెట్టుకున్నారు. అన్నిరోజులు గవర్నర్ తన దగ్గరే ఫైలును ఎందుకు పెట్టుకున్నారో తెలీదు.
అలాగే అర్వింద్ కుమార్ మీద యాక్షన్ తీసుకునేందుకు పర్మీషన్ ఇవ్వాలని చీఫ్ సెక్రెటరీ కేంద్రంలోని డీవోపీటీకి రెందుసార్లు లేఖలు రాసినా ఇప్పటివరకు కేంద్రం పట్టించుకోలేదు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ అవినీతి, అధికారదుర్వినియోగానికి అర్విందే కీలక సాక్షి. కేసులో అన్నీ విషయాలు చెప్పేయటానికి అర్వింద్ ఏసీబీ ముందు అంగీకరించి అప్రూవర్ గా మారారు అనే ప్రచారంలో వాస్తవం ఎంతుందో ప్రభుత్వమే చెప్పాలి. కాబట్టి కేటీఆర్ మీద యాక్షన్ తీసుకోవాలంటే అర్వింద్ ఎంతటి కీలకమో అర్ధమవుతోంది. ఇలాంటి అర్వింద్ మీద యాక్షన్ కు రెండునెలలుగా అనుమతి ఇవ్వటంలో కేంద్రం ఎందుకు జాప్యం చేస్తోంది ? పై రెండు ఘటనల్లో కేంద్రం వైఖరి చూసిన వాళ్ళకు కేసీఆర్, కేటీఆర్ కు బీజేపీ ఆశీస్సులు ఉన్నాయని అనుమానాలు రావటంలో ఆశ్చర్యమేముంది ?

