నైట్‌డ్యూటీతో లైంగిక సమస్యలు పెరిగిపోతాయా ?
x
Night shift employees

నైట్‌డ్యూటీతో లైంగిక సమస్యలు పెరిగిపోతాయా ?

రాత్రుళ్ళు ఉద్యోగాలు చేసే వారిలో ఇమ్యూనిటి తగ్గిపోవటమే కాకుండా అనారోగ్యాలు పెరిగిపోతున్నట్లు బయటపడింది


నైట్‌డ్యూటీ చేసేవాళ్ళకి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయా ? అవుననే చెబుతోంది ఒక తాజా అద్యయనం. మల్టీనేషనల్కంపెనీలో పగటిపూట డ్యూటీచేసే ఉద్యోగులు, రాత్రిషిఫ్టుల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళ ఆరోగ్యాలపై గాంధీ ఆసుపత్రి కాలేజీ ఒక పరిశీలన జరిపింది. ఈపరిశీలనలో పగటిపూట ఉద్యోగాలు చేసేవాళ్ళతో పోల్చితే రాత్రుళ్ళు ఉద్యోగాలు చేసేవారిలో ఇమ్యూనిటి తగ్గిపోవటమే కాకుండా అనారోగ్యాలు పెరిగిపోతున్నట్లు బయటపడింది. ఈ పరిశీలన వ్యాసం ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం జర్నల్ సంచికలో ప్రచురితమైంది. నైట్‌షిఫ్టుల్లో పనిచేసేవారికి అనారోగ్య సమస్యలు ఎక్కువ అనటానికి ప్రధానకారణం ఏమిటంటే విటమిన్ డీ లోపమే కాకుండా టెస్టోస్టెరాన్ స్ధాయిలు పడిపోవటం, అధిక కొలెస్ట్రాల్ సమస్యలు పెరిగిపోవటమే.

మామూలుగా ఉండాల్సిన దానికన్న అధికబరువున్న వారికే ఊబకాయం కారణంగా అనారోగ్యాలు తొందరగా వస్తాయనే భావన జనాల్లో ఉంది. అయితే గాంధీకాలేజీ అధ్యయనంలో అందుకు భిన్నమైన రిజల్ట్స్ వచ్చాయి. సర్వేచేసిన వారి సగటు వయసు 28 ఏళ్ళు. పగటిపూట ఉద్యోగాలుచేసే వారికన్నా రాత్రిపూట ఉద్యోగాలు చేసేవారి బాడీ మాస్ ఇండెక్స్, వయసు తక్కువగానే ఉన్నా అనారోగ్యాలు మాత్రం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. నైట్‌డ్యూటీలు చేసే ఉద్యోగుల్లో 77శాతంమందిలో ఇన్యులిన్ నిరోధకత తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇలాంటివారిలో అత్యధికులు భవిష్యతుల్లో టైప్-2 డయాబెటికస్ బారినపడే ప్రమాదం ఉందని అర్ధమైంది.

రాత్రిపూట పనిచేసేవారిలో అత్యధికులకు ట్రైగ్లిజరైడ్స్ స్ధాయిలో సగటున 195 ఎంజీ/డీఎల్ ఉండగా, డే షిఫ్ట్ ఉద్యోగుల్లో 180 ఎంజీ/డీఎల్ నమోదయ్యాయి. అలాగే ఇంకో విషయం ఏమిటంటే మంచికొలెస్ట్రాల్ ఉండాల్సిన సాధారణ స్ధాయి 45-60 ఎంజీ/డీఎల్ కాగా నైట్ డ్యూటీ ఉద్యోగుల్లో 35 ఎంజీ/డీఎల్ మాత్రమే ఉంది. మంచికొలెస్ట్రాల్ 35 ఎంజీ/డీఎల్ కన్నా తక్కువగా ఉంటే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రాత్రిపూట ఉద్యోగాలు చేసేవారికి నిద్ర సరిగా ఉండదుకాబట్టి శరీరంలోని హార్మోన్ల వ్యవస్ధ చిన్నాభిన్నం అవుతోందని అధ్యయనంలో తేలింది. మగవారిలో టెస్టోస్టెరాన్ స్ధాయిలు 400 ఎన్జీ/డీఎల్ నుండి 373.6 ఎన్జీ/డీఎల్ గా ఉన్నది. దీనివల్ల ఏర్పడే ప్రధాన సమస్య అంగస్తంభన వంటి సమస్యలు పెరిగి లైంగిక సామర్ధ్యం తగ్గిపోవటం.

నైట్‌డ్యూటీలుచేసే మహిళాఉద్యోగుల్లో ఈస్ట్రాడయోల్ స్ధాయిలు, థైరాయిడ్ సమస్యలు ఎక్కువైపోతున్నట్లు అధ్యయనంలో బయటపడింది. పగటిపూట ఉద్యోగులతో పోల్చితే నైట్‌డ్యూటీ ఉద్యోగుల్లో ‘సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం’ బారినపడుతున్న వారిసంఖ్య పెరుగుతున్నట్లు తేలింది. నైట్‌డ్యూటీ ఉద్యోగుల్లో గ్రోత్ హార్మోన్ స్ధాయిలు కూడా తగ్గిపోతున్నాయని అధ్యయనంలో బయటపడింది. గ్రోత్‌హార్మోన్ నిద్రలోనే వెలువడుతుంది. అలాంటిది అసలు నిద్రే ఉండకపోతే ఇక గ్రోత్ హార్మోన్ విడుదలయ్యేందుకు అవకాశం ఎక్కడుంది ?

రాత్రుళ్ళు పనిచేసి తెల్లవారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఉద్యోగులు నిద్రపోతారు. వాళ్ళు నిద్రలేచేసమయానికి మధ్యాహ్నం దాటిపోతుంది. లేచినదగ్గర నుండి మళ్ళీ రాత్రి డ్యూటీకి ప్రిపేర్ అవటంతోనే సరిపోవటం వల్ల సూర్యుడిని చూడటం దాదాపు తగ్గిపోయింది. దీని ఫలితంగానే నైట్‌డ్యూటీ ఉద్యోగుల్లో విటమిన్ డీ లోపం స్పష్టంగా కనబడుతోంది. యాంత్రికమైపోయిన మనిషి జీవనంలో, సంపాదన కోసం పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో రాత్రి, పగలు పనిచేయక తప్పటంలేదు. అందుకనే శారీరక అసమతుల్యాలు పెరిగిపోయి బతుకులను చిందరవందర చేసేస్తోంది.

Read More
Next Story