ఎస్బీఐపై తీవ్ర అసహనం..రేపటిలోగా విరాళాలు బయటపెట్టాల్సిందే:‘‘సుప్రీం’’
ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించేందుకు భారతీయ స్టేట్ బ్యాంకు మరికొంత సమయం కావాలని కోరడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించేందుకు భారతీయ స్టేట్ బ్యాంకు మరికొంత సమయం కావాలని కోరడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడికి జూన్ 30 వరకూ గడువు పొడిగించాలని ఎస్‌బీఐ తరఫున హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. దీనిపై విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం బ్యాంకు అభ్యర్థనను తోసిపుచ్చుతూ.. రేపటి (మార్చి 12)లోగా విరాళాల వివరాలు చెప్పాలని ఆదేశించింది. దాంతో పాటు మార్చి 15 సాయంత్రం 5 గంటల్లోగా సమాచారనంతా వెబ్ సైట్‌లో వివరాలు అప్ లోడ్ చేయాలని ఈసీకి సూచించింది.
తమ ఉత్తర్వులు పాటించకకుంటే ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది. 2019 ఏప్రిల్ 12వ తేదీతో ఉన్న ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎస్బీఐ తెలియజేయాల్సి ఉంది. ఎలక్టోరల్ బాండ్ కొనుగోలు చేసిన తేదీ, పేరు, బాండ్ విలువ, బాండ్ రిడీమ్ చేసుకున్న పార్టీ వివరాలు, తేదీ కూడా బయటపెట్టాల్సి ఉంది. అందుకోసం ఎస్బీఐ సమయం కోరగా.. సుప్రీం కోర్టు నిరాకరించింది.
రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించడానికి వీలు కల్పించే ఎన్నికల బాండ్ల పథకాన్ని గత నెల 15న సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. వాటి ద్వారా పార్టీలకు అందిన డబ్బు, దాతల వివరాలను ఈ నెల 6లోగా ఎన్నికల సంఘానికి అందించాలని గతంలో ఎస్‌బీఐని ధర్మాసనం ఆదేశించింది. ఈ క్రమంలో మరింత గడువు కావాలంటూ ఎస్‌బీఐ సుప్రీంను ఆశ్రయించింది. దాతలు, గ్రహీతల వివరాలను వేర్వేరుగా భద్రపర్చామని, వాటిని మ్యాచ్ చేసి వివరాలను ఇచ్చేందుకు మరింత సమయం కావాలని బ్యాంకు తరఫు న్యాయవాది హరీష్ సాల్వే కోర్టును అభ్యర్థించారు.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎస్‌బీఐ తీరుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ‘‘గత నెల ఇచ్చిన తీర్పు ప్రకారం విరాళాల వివరాలు వెల్లడించాలని మేం ఆదేశించాం. మీరు ఇలా అదనపు సమయం కోరుతూ మా దగ్గరకు రావడం చాలా తీవ్రమైన విషయం. మా తీర్పు స్పష్టంగా ఉంది. ఏ దాత నుంచి ఏ గ్రహీత ఎంత తీసుకున్నారన్న వివరాలను మ్యాచ్ చేసి మేం చెప్పమనలేదు. ఎన్ని బాండ్లను జారీ చేశారన్న వివరాలను ఉన్నది ఉన్నట్లుగా ఈసీకి ఇవ్వమని ఆదేశించాం. గత 26 రోజులుగా దీనిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు. ఆ సమాచారమేదీ మీరు చెప్పలేదు. మార్చి 12 సాయంత్రం పనిగంటలు ముగిసేలోగా దాతల వివరాలను మీరు ఈసీకి అందజేయాల్సిందే’ అని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఆ వివరాలను బహిర్గతపర్చాలని ఈసీకి సూచించింది.