గర్భవతిని చేస్తే 10 లక్షలు పేరిట మోసం ఎలా జరుగుతుందంటే..
x

'గర్భవతిని చేస్తే 10 లక్షలు' పేరిట మోసం ఎలా జరుగుతుందంటే..

ఇదో కొత్త తరహా మోసం. "గర్భవతిని చేస్తే 10లక్షలంటూ" ప్రకటనలు ఇచ్చి సొమ్ము చేసుకుంటోంది ఓ ముఠా..


మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే కావడం, ఆర్ధిక అసమానతలు పెరగడం, పేదరికం ఓ శాపంగా మారడంతో మనిషి శరీరం కూడా వ్యాపార వస్తువే అయింది. లాటరీలు, అధికవడ్డీలు, స్టాక్ మార్కెట్లు, ప్రేమలు, పెళ్లిళ్లు పేరిట ఇప్పటి వరకు డబ్బులు వసూలు చేసిన నేరగాళ్లు ఇప్పుడో వినూత్న అవతారం ఎత్తి డబ్బు కాజేసే పని మొదలుపెట్టారు.
1970ల ప్రాంతంలో "పట్టుకుంటే లక్ష" వంటి సినిమా టైటిల్స్ మాదిరే ఇప్పుడీ ముఠా "గర్భవతిని చేస్తే 10లక్షలంటూ" ప్రకటనలు ఇచ్చి పేదరికాన్ని సొమ్ము చేసుకోవాలని చూసి కటకటాల పాలైంది.
అసలేం జరిగిందంటే...
బీహార్ లోని నవడా జిల్లా.. అక్కడో ముఠా ఈ విచిత్ర స్కామ్ కి పురుడుపోసింది. సైబర్ మోసాల విషయంలో ఇదో సంచలనంగా మారింది. డిసెంబర్ మొదట్లో, హిమాంశు కుమార్ (పేరు మార్చాం) ఫేస్‌బుక్‌ను స్క్రోల్ చేస్తూ ఉండగా, "ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్" అనే పేరుతో వచ్చిన వీడియోను చూసి క్లిక్ చేశారు.
ఇదేదో బాగుందే అనుకుని హిమాంశు వాళ్లని సంప్రదించారు. మంచి ఉద్యోగమే రమ్మన్నారు. చేయాల్సిన పనల్లా ఒక మహిళ గర్భం దాల్చడానికి సహాయం చేయడం. అలా చేస్తే బాగా డబ్బు వస్తుందనుకున్నాడు. ఓ పక్క కాస్త అపనమ్మకం ఉన్నా.. పోయేందుముందిలెమ్మని ఆ ఉద్యోగానికి పూనుకున్నాడు. 35 ఏళ్ల హిమాంశు ఈ ఉద్యోగానికి పూర్వం ఓ పెళ్లి పార్టీ డెకరేషన్ కంపెనీలో నెలకు 15 వేల రూపాయలకు పని చేసేవాడు. ఈ కొత్త ఉద్యోగంలో చేరిన పాత ఉద్యోగం ద్వారా వచ్చే సంపాదన పోగా అదనంగా డబ్బు పొగొట్టుకున్నాడు. నెల తిరిగే సరికి డబ్బు రావాల్సింది పోయి మోసగాళ్లకు అదనంగా ₹16,000 చెల్లించాల్సి వచ్చింది. వాళ్లింకా హిమాంశును డబ్బు అడుగుతూనే ఉన్నారు. దీంతో అసలు విషయం తెలిసి వచ్చింది.
హిమాంశు ఒక్కడే కాదు దేశవ్యాప్తంగా ఇలాంటి వాళ్లు చాలా మంది ఈ స్కాంలో ఇరుక్కున్న వారున్నారు.
బీహార్ రాష్ట్రం నవాడ జిల్లాలో సైబర్ సెల్‌కి ఇన్‌చార్జిగా ఉన్న డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కళ్యాణ్ ఆనంద్ ఈ స్కామ్ పై ఏమన్నారంటే.. "సాదాసీదా వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని, భారీగా డబ్బు సంపాదన ఉంటుందని నమ్మబలికి మోసం చేస్తున్నారు. అందులో భాగంగా, ఓ హోటల్‌లో బిడ్డల్లేని మహిళతో సమయం గడిపే అవకాశం కల్పిస్తామంటూ నమ్మబలికి ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేయడం ఈ ముఠా లక్ష్యంగా ఉంది".
ఎలా ముగ్గులోకి దింపుతారంటే...
హిమాంశు కథనం ప్రకారం ఫేస్ బుక్ లో ప్రకటన చూసిన తర్వాత ఎవరైనా క్లిక్ చేస్తే వెంటనే ఫోన్ వస్తుంది. "వీడియో క్లిక్ చేసిన 10 నిమిషాల్లోనే నాకు ఫోన్ వచ్చింది. ఉద్యోగానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ₹799 చెల్లించాలని చెప్పారు," అని చెబుతారు.

ఫోన్ చేసిన వ్యక్తి హిమాంశును పరిచయం చేసుకున్న తర్వాత ... ముంబైలోని ఓ కంపెనీ కోసం పని చేయాల్సి ఉంటుందని, ఒక మహిళను గర్భం దాల్చే బాధ్యత మీదే అని హిమాంశుకు చెప్పారు.
ఆ మహిళకు గర్భం రావడానికి ప్రయత్నం చేసినందుకు 5 లక్షల రూపాయలు ఇస్తామని, ఆమె గర్భం దాల్చితే అదనంగా ₹8 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు.
దానికి హిమాంశు అంగీకరిస్తూ "నేను పేదవాడినని, డబ్బు చాలా అవసరం కావడంతో ఈ పనికి ఒప్పుకుంటున్నాను" అని చెప్పాడు. దానికి అవతలి వ్యక్తి "మీ డబ్బుకు వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదని, మీరు ఆ మహిళతో గడిపిన అనంతరం 5 లక్షలు ఇచ్చేస్తామని " హామీ ఇచ్చారు ఇద్దరు పిల్లల తండ్రి అయిన హిమాంశుకి.
ఆ తరువాత హిమాంశులో నమ్మకం పెంచేందుకు "బేబీ బర్త్ అగ్రిమెంట్" అనే పేరుతో నకిలీ కోర్టు పత్రాలు, పోలీస్ ఉన్నతాధికారి ఫోటోతో కూడిన పత్రాలు పంపించారు. "మీ బ్యాంక్ ఖాతాలో ₹5 లక్షల క్రెడిట్ చూపిస్తున్నారు, అది టాక్స్ చెల్లించిన తర్వాత విడుదల చేస్తామన్నారు," దాన్ని హిమాంశు నమ్మేశాడు.
తీరా ఆ లాడ్జీలో గదిలోకి వెళ్లిన తర్వాత ఆ ముఠా సభ్యులు వీళ్లని రహస్య కెమేరాలతో ఫోటోలు తీస్తారు. వాటితో బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇస్తామన్న డబ్బులు ఇవ్వడానికి బదులు హిమాంశు లాంటి వాళ్ల నుంచే డబ్బులు గుంజుతారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఆల్‌ ఇండియా ప్రెగ్నెంట్‌ జాబ్‌ సర్వీస్‌’, ‘ప్లేబాయ్‌ సర్వీస్‌’ల పేరిట ఫేస్‌బుక్‌లో ఈ ముఠా సభ్యులు ప్రకటనలు ఇచ్చారు. పిల్లలు లేని స్త్రీలను గర్భవతులను చేస్తే రూ.10 లక్షలు పొందవచ్చని ప్రకటించారు. ఒకవేళ వారు విఫలమైతే రూ.50 వేల నుంచి రూ.5 లక్షలు సైతం పొందవచ్చని పేర్కొన్నారు. దీంతో ఆకర్షితులైన పలువురు ఆ ముఠాను సంప్రదించి మోసపోయారు.
చాలామంది మోసపోయినా సిగ్గుపడి ఈ స్కామ్ గురించి చెప్పడానికి ముందుకు రావడం లేదు. పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ బాధితుడు పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం... మొదట ముఠా సభ్యులు బాధితుల నుంచి పాన్‌ కార్డ్‌, ఆధార్‌ కార్డ్‌, సెల్ఫీ, ఇతర వివరాలు సేకరించారు. అనంతరం రిజిస్ట్రేషన్‌, హోటల్‌ గదుల బుకింగ్స్‌ పేరిట డబ్బు వసూలు చేశారు. ఒకవేళ బాధితులు ఇవ్వకుంటే వారిని బ్లాక్‌మెయిల్‌ చేస్తారు. ఈ వ్యవహారమై ఫిర్యాదులు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. వారి నుంచి 6 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద బాధితుల వాట్సప్‌ ఛాట్‌, కస్టమర్‌ ఫొటోలు, ఆడియో రికార్డింగ్‌లు, బ్యాంక్‌ లావాదేవీలను గుర్తించారు.
ఇలాంటి మోసాలను అరికట్టాలంటే ప్రజల్లో అవగాహన పెరగడం ఒక్కటే మార్గం. సంతానం లేని స్త్రీలను గర్భవతులను చేస్తే భారీ మొత్తంలో డబ్బు వస్తుందని నమ్మడమే ఈ ముఠాలకు పెట్టబడి. ఆ తరహా ప్రకటనలకు మోసపోవద్దని పోలీసులు చెబుతున్నా సగటు మనుషులు మోసపోతూనే ఉన్నారు.
Read More
Next Story