పొలిటికల్ పార్టీలకు ఎన్నికల సంఘం కీలక సూచనలు
x
Source: Twitter

పొలిటికల్ పార్టీలకు ఎన్నికల సంఘం కీలక సూచనలు

లోక్‌సభ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం కీలక సూచనలు చేసింది. తమ నిబంధనలు ఎట్టిపరిస్థితుల్లో ఉల్లంఘించొద్దని హెచ్చరించింది.



దేశమంతా ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభ ఎన్నికలు, ఉపఎన్నికలు సహా నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను నిన్న కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దేశంలోని పొలిటికల్ పార్టీలకు రాజీవ్ కుమార్.. కీలక సూచనలు చేశారు. ఎన్నికల సమయంలో పార్టీలన్నీ తప్పకుండా తమ సూచనలు, నియమాలను పాటించాలని, ఈ విషయంలో ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చర్యల విషయంలో తాము కనికరం చూపమని అన్నారాయన. ఇప్పటికే ఎన్నికల వ్యవస్థను మెరుగుపరచడానికి పార్టీల ప్రతినిధులతో సమావేశమై వారి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నామని, ఈ ఎన్నికల కోసం రెండేళ్లుగా శ్రమిస్తున్నామని చెప్పారు. ఈసారి అంగబలం, ధనబలం లేని ఎన్నికలు నిర్వహించడమే తమ లక్ష్యమని, అందుకోసం రెండేళ్లుగా శ్రమిస్తున్నామని, కొందరి వల్ల ఎన్నికల వ్యవస్థ చెడిపోకూడదని కోరుకుంటున్నామని చెప్పారు రాజీవ్ కుమార్. ఈ సందర్బంగానే పొలిటికల్ పార్టీలకు ఆయన 10 సూచనలు చేశారు. వీటిని తూచ తప్పకుండా పాటించాలని అన్నారు.

1) ద్వేషపూరిత ప్రసంగాలొద్దు

ఎన్నికల నేపథ్యంలో ద్వేషపూరిత ప్రసంగాలకు తావు లేదని, ఈ విషయంపై ఇప్పటికే సుప్రీంకోర్టు పలు మార్గదర్శకాలను జారీ చేసిందని గుర్తు చేశారు. ‘‘నాయకులు, కార్యకర్తలు విద్వేష పూరిత ప్రసంగాలు ఇస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎన్నికల్లో విమర్శలు చేసుకోవడం అనేది మళ్ళీ కలవలేనంతలా ఉండకూడదు’’అని హితవు పలికారు.

2) ధన బలానికి నో ఛాన్స్

ఈసారి ఎన్నికల్లో ధనబలాన్ని ప్రోత్సహించే ప్రసక్తే లేదని రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ విషయంలో తాము చాలా కఠినంగా వ్యవహరిస్తామని, దానిని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు నడుచుకోవాలని తెలిపారు. ‘‘ఎన్నికల్లో ధనబలం ప్రదర్శిస్తే తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే దర్యాప్తు సంస్థలతో సమావేశమయ్యాం. అభ్యర్థులు, కార్యకర్తలు, అనుచరులు ఎవరైనా రహస్యంగా డబ్బును వినియోగిస్తే అది మంచిది కాదు. అక్రమంగా డబ్బు తరలించే విషయంపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తాం. అందులో సందేహం లేదు’’ అని సీఈసీ తేల్చి చెప్పింది.

3) ఫేక్ న్యూస్‌పై కొరడా

ఎన్నికల సమయంలో ప్రచారం చేసే అబద్దపు వార్తలపై కొరడా ఝుళిపిస్తామని సీఈసీ స్పష్టం చేసింది. ‘‘సోషల్ మీడియా కానీ ఇతర మాద్యమాల్లో కానీ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఎవరైనా పట్టుబడితే వారిపై కఠిన చర్యలు ఉంటాం. నకిలీ వార్తలను గుర్తించడానికి ఈసారి స్పెషల్ సెటప్‌ను రెడీ చేశాం. ఇందుకోసం అత్యాధునికి సాంకేతికతను వినియోగించనున్నాం. కావున అబద్దపు వార్తలను స్ప్రెడ్ చేయాలన్న ఆలోచన కూడా చేయొద్దు’’ అని హెచ్చరించింది.

4) వారికి టికెట్లు ఎందుకు?


నేర చరిత్ర ఉన్న వ్యక్తులకు ఎందుకు టికెట్ ఇచ్చాం అన్న విషయాన్ని ఆయా రాజకీయ పార్టీలు వివరించాలని తెలిపింది ఎన్నికల సంఘం. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు.. పత్రికలు, టీవీ ఛానెల్స్‌లో ప్రకటించాలి అని చెప్పింది.

5) స్టార్ క్యాంపెయినర్లపై నిఘా

ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ పార్టీల స్టార్ క్యాంపెయినర్లు ఇచ్చే ప్రసంగాలపై ప్రత్యేక నిఘా ఉంచనున్నట్లు సీఈసీ తెలిపింది. ప్రచారంలో భాగంగా వారెవరైనా వ్యక్తిగత దాడులకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని, ఎన్నికలను సమస్యల ఆధారంగానే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం యోచిస్తోందని సీఈసీ చెప్పింది.

6) పిల్లలను వినియోగించొద్దు

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల పార్టీలు ఏ విధంగా కూడా చిన్నారులను వినియోగించొద్దని సీఈసీ హెచ్చరించింది. ‘‘ఎవరైనా ఎన్నికల ప్రచారం కోసం చిన్నారులను వినియోగిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు. చిన్నారుల ఫొటోలను కూడా ప్రచారంలో వినియోగించకూడదు. ర్యాలీల్లో భాగంగా చిన్నారులను ఎత్తుకోవడం, ముద్దాడటం వంటివి కూడా చేయకూడదు’’అని సీఈసీ స్పష్టం చేసింది.

7) తప్పుడు ప్రకటనలపై చర్యలు

ఎన్నికల్లో గెలవాలన్న ఉద్దేశంతో ఏ పార్టీ అయినా తప్పుడు ప్రచారాలు చేసినా, అందుకు ప్రయత్నించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఆచితూచి వ్యవహరించాలని ఎన్నికల సంఘం తెలిపింది.

8) కుల మతాల ప్రస్తావన వద్దు

ఎన్నికల ప్రచార సమయంలో రాజకీయ పార్టీలు కుల మతాల ప్రస్తావన తీసుకురాకూడదని హెచ్చరించింది. ప్రచారాన్ని అందరినీ ఏకం చేసేలా ఉండాలే తప్ప విభజించేలా కాదని కమిషన్ తెలిపింది. దీనిపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని సూచించింది.

9) ప్రత్యర్థుల పరువు తీయొద్దు
ఎన్నికల ప్రచారంలో భాగంగా సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల ద్వారా తమ అభ్యర్థుల పరువును తీయొద్దని, అలాంటి పోస్టులు పెట్టడాన్ని తాము ఉపేక్షించమని కమిషన్ క్లారిటీ ఇచ్చింది. ఎవరైనా ఇలా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఈసీ వెల్లడించింది.

10) సరైన సలహా ఇవ్వండి
రాజకీయ పార్టీలు తమ సంస్థలకు సరైన సలహాలు ఇవ్వాలని, అన్ని పార్టీలు తమ సంస్థల పనితీరును పారదర్శకంగా ఉంచాలని కమిషన్ కోరింది.


Read More
Next Story