
NOSTALGIC | మన్మోహన్.. మా ఊరి పిలగాడే!
భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కోసం పాకిస్తాన్ లోని ఓ గ్రామం మౌనంగా రోదిస్తోంది. అరే.. మా ఊరి పిలగాడు చనిపోయాడే అని తల్లడిల్లుతోంది. ఆ ఊరి పేరే గహ్ (GAH).
భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కోసం పాకిస్తాన్ లోని ఓ గ్రామం మౌనంగా రోదిస్తోంది. అరే.. మా ఊరి పిలగాడు చనిపోయాడే అని తల్లడిల్లుతోంది. ఆయన అంత్యక్రియలకు ఢిల్లీకి తరలి రావాలని ఆతృతపడ్డారు. సమయం తక్కువ, దౌత్యపరమైన చిక్కులతో కుదరకపోయే సరికి కన్నీటిని కళ్లలోనే వత్తుకుంటూ సంతాపం వ్యక్తం చేస్తోంది. ఆ ఊరి పేరే గహ్ (GAH). ప్రపంచ ప్రఖ్యాత ఆర్ధిక వేత్త, ఇండియా ఆర్ధిక మంత్రి, భారత ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పుట్టిన గ్రామం అది.
దేశం విడిపోవడానికి ముందు ఆ గ్రామం అఖండ భారతదేశంలో ఉంది. ఇప్పుడది పాకిస్తాన్ లో ఉంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కు వాయవ్యంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. చక్వాల్ జిల్లాలో ఈ గ్రామం ఉంది. మన్మోహన్ సింగ్ మరణవార్త తెలిసినప్పటి నుంచి ఆ ఊరి వాళ్లంతా శోకసంద్రంలో మునిగిపోయారు.
గహ్ పాఠశాలలోనే మన్మోహన్ సింగ్ నాలుగో తరగతి వరకు చదువుకున్నారు. మన్మోహన్ తండ్రి గురుముఖ్ సింగ్. ఆయన బట్టల వ్యాపారి. తల్లి అమృత్ కౌర్. ఇంటిపని చూసుకునే వారు. మన్మోహన్‌సింగ్‌ను చిన్నప్పుడు ఊళ్లో వాళ్లందరూ ‘మోహనా’ అని పిలిచేవారు. ఊళ్లోనే హాకీ కూడా ఆడేవారట.
మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యాక 2008లో తన చిన్ననాటి దోస్త్ రాజా మహమ్మద్ అలీని ఢిల్లీకి పిలిపించుకున్నారు. తనతో పాటు కొన్ని రోజులు ఉంచుకున్నారు. ఆనాటి సంఘటనను ఇప్పుడు ఊరు ఊరంతా తలచుకుంటూ కుమిలిపోతోంది. రాజా మహమ్మద్ అలీ మేనల్లుడు రాజా అషిక్ అలీ ఆనాటి సంఘటనను గుర్తుచేసుకుంటూ.. ఈవేళ మా మామాలేరు, మా మోహనా లేరు అంటూ కన్నీరుపెట్టుకున్నారు . ‘మా గ్రామం మొత్తం విషాదంలో ఉంది. కుటుంబ సభ్యుణ్ణి కోల్పోయినట్టే అందరూ బాధపడుతున్నారు’’ అని మరో గ్రామస్తుడు అల్తాఫ్ హుస్సేన్ అన్నారు.
మన్మోహన్ మృతికి నివాళులు అర్పించేందుకు గ్రామస్థులంతా శుక్రవారం సమావేశమయ్యారు. ఈ గ్రామంలో మన్మోహన్‌తో కలిసి చదువుకున్న చాలా మంది మిత్రులు 2004లో ఆయన ప్రధాని అయ్యేసరికే చనిపోయారు. 2008లో ఢిల్లీకి పిలిపించుకున్న తన మిత్రుడు రాజా మొహమ్మద్ అలీ కూడా 2010లో చనిపోయారు.
‘మన్మోహన్ మరణం మా గ్రామస్థులను కలచివేసింది. భారత్‌లో జరిగే అంత్యక్రియలకు హాజరుకావాలని అనుకున్నాం. కానీ అది అసాధ్యం. అందుకే ఇక్కడే సంతాపం తెలుపుతున్నాం’ అన్నారు రాజా అషిక్ అలీ.
2004లో మన్మోహన్ సింగ్ ప్రధాని అయినపుడు ఈ ఊరు ఊరంతా సంబరం చేసుకుంది. ‘మా గ్రామానికి చెందిన బాలుడు భారత ప్రధానమంత్రి అయ్యారని తెలిసి గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆవేళ గర్వంతో ఉప్పొంగిపోయారు. ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ తాజాగానే ఉన్నాయి’ అని అషిక్ చెప్పారు. గ్రామంలో మన్మోహన్ చదువుకున్న పాఠశాల ఇంకా అలానే ఉంది. అప్పటి రికార్డులు కూడా పదిలంగానే ఉన్నాయి. వాటి ప్రకారం.. పాఠశాలలో మన్మోహన్ అడ్మిషన్ నంబరు 187. జన్మదినం 1932, ఫిబ్రవరి 4. పాఠశాలలో 1937లో చేరారు. కులం ‘కోహ్లి’.
దేశ విభజన సమయంలో మన్మోహన్ కుటుంబం ఇప్పుడు ఇండియాలో భాగంగా ఉన్న పంజాబ్ (అమృత్‌సర్)కు తరలి వెళ్లింది. అప్పటి నుంచి మళ్లీ మన్మోహన్ ఆ గ్రామానికి వెళ్లలేదు. ‘మోహనా.. మళ్లీ ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు ఆయన మరణవార్త మాకు చేరింది. కనీసం ఆయన కుటుంబసభ్యులైనా మా గ్రామానికి వస్తారని ఆశిస్తున్నాం’ అని హుస్సేన్ ఆకాంక్షించారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ కి ముగ్గురు కుమార్తెలు. వారందరూ తండ్రి లాగేనే లౌకికవాదానికి కట్టుబడి వారు. వేర్వేరు మతాలకు చెందిన వారిని వివాహం చేసుకున్నారు.
చిన్నప్పుడు పాకిస్థాన్‌లో గడిపిన రోజుల్లో మన్మోహన్ సింగ్ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని ఆయన రెండో కుమార్తె దామన్ సింగ్ చెప్పారు. జీవితం చాలా కష్టంగా ఉండేదంటూ చెప్పేవారని ఆమె తన పుస్తకం స్ట్రిక్ట్లీ పర్సనల్ అనే పుస్తకంలో రాశారు. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ పశ్చిమ ప్రాంతంలోని గాహ్‌లో పుట్టిన మన్మోహన్ సింగ్ జీవితంలోని కొన్ని కీలకఘట్టాలను దామన్ సింగ్ రికార్డ్ చేశారు. ‘తిరిగి పాకిస్థాన్ వెళ్లాలనుకుంటున్నారా అని నాన్నను నా సోదరి అడిగింది. అస్సలు ఇష్టం లేదని బదులిచ్చారు. నా తాతయ్యను చంపేసిన ప్రాంతానికి వెళ్లను’ అని మన్మోహన్ సింగ్ చెప్పినట్టు దామన్ గుర్తు చేసుకున్నారు.
కుటుంబ సమావేశాలు, పిక్నిక్‌లలో మన్మోహన్ సింగ్ జానపద గేయాలు పాడేవారట.2014లో హార్పర్‌కాలిన్స్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.
Next Story