డ్రంక్ డ్రైవ్ తప్పించేందుకు గ్రూప్.. ఎస్సై ఎంట్రీతో కథ మలుపు
x

డ్రంక్ డ్రైవ్ తప్పించేందుకు గ్రూప్.. ఎస్సై ఎంట్రీతో కథ మలుపు

తనిఖీల సమాచారం పంచుకున్న వాట్సాప్ గ్రూప్ బయటపడింది. పోలీసులు గ్రూప్‌లో చేరగానే సభ్యులు ఒక్కసారిగా మాయమయ్యారు.


మద్యం తాగి డ్రైవ్ చేయడం తప్పని అందరికీ తెలుసు. కానీ తప్పించుకు తిరగుతూ అదే తప్పు చేస్తుంటారు. అంతేకాకుండా పోలీసులు కనిపిస్తే పక్కదారిలో తప్పించుకోవడం, వాహనం వదిలి వెళ్లిపోవడం వంటివి కూడా చేస్తుంటారు. గోదావరిఖనిలోని ఒకరు మాత్రం దీనికి పర్మినెంట్ సొల్యూషన్‌ లాంటి దాన్ని ఒకటి కనుక్కున్నాడు. అదే వాట్సాప్ గ్రూప్. అవును.. వాట్సాప్ గ్రూప్ క్రియేట్.. దాని ద్వారా ఎక్కడెక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు జరుగుతున్నాయో ఒక మ్యాప్ రెడీ చేసుకునేవారు. ఆ గ్రూప్‌లో ఉన్నవాళ్లు అవి చూసుకుని పోలీసుల కళ్లుగప్పి డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారు. తాజాగా ఆ గ్రూప్‌లో ఒక పోలీస్ అధికారి జాయిన్ అవ్వడంతో కథ అడ్డంతిరిగింది. అసలు బండారం బయటకొచ్చింది.

మొదటిది చిన్న ఐడియానే. ఎక్కడ చెకింగ్ ఉందో ముందే తెలిసిపోతే… డ్రైవింగ్ కూడా సేఫ్, ఫైన్ కూడా సేదన్న లెక్క. అదే లెక్కతో “పోలీస్ మామలు” అనే గ్రూప్ స్టార్ట్ అయింది. కొద్దికాలంలో అది చిన్న గ్రూప్ నుంచి మినీ సోషల్ నెట్‌వర్క్‌గా మారింది. సభ్యులు కూడా వెయ్యికి పైగా చేరారు. నగరంలో ఎక్కడ చెకింగ్ ఉందో, ఏ రోడ్డుపై పోలీసులు నిలబడ్డారో… అప్డేట్లు క్షణాల్లో షేర్ అయ్యేవి. ఒకరకంగా చూస్తే ఇది “గూగుల్ మ్యాప్స్ – కానీ పోలీస్‌ల కోసం” అన్నట్టే.

అయితే కథలో ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఓ వ్యక్తి ఫోన్ చెక్ చేయడంతో ఈ గ్రూప్ బయటపడింది. అక్కడి నుంచి పోలీసుల ఆసక్తి పెరిగింది. ఇలాంటి గ్రూపులను పోలీసులు గమనించడం కొత్తేమీ కాదు. అవసరమైతే వాళ్లే గ్రూపుల్లోకి వెళ్లి సమాచారం సేకరిస్తారు అన్న విషయం తెలిసిందే. ఈసారి ట్రాఫిక్ ఎస్సై నేరుగా గ్రూప్‌లోకి అడుగు పెట్టారు.

ఎస్సై జాయిన్ అయ్యాడని తెలిసిన క్షణం నుంచి సభ్యులందరికీ ఒక్కటే ఆలోచన.. అదే గ్రూప్ నుంచి ఎగ్జిట్ అవ్వడం. ఒక్కొక్కరుగా కాదు… వరుసగా లాగ్ అవుట్ అయ్యారు. కొద్ది సేపట్లో గ్రూప్ నిశ్శబ్దంగా మారింది. ఈ సమయంలో ఎస్సై ఒక వీడియో పెట్టారు. అందరి నంబర్లు సేవ్ చేసుకున్నట్టు, త్వరలో కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు చెప్పారు. ఆ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసేస్తోంది. కాగా ఈ అంశంపై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? అనేది మాత్రం ఇంకా తెలీలేదు.

Read More
Next Story